కొండంత జనం

ABN , First Publish Date - 2022-05-22T07:27:49+05:30 IST

భక్తుల రద్దీతో తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో రెండు నెలలుగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.వారాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది.

కొండంత జనం

తిరుమల, మే 21 (ఆంధ్రజ్యోతి):భక్తుల రద్దీతో తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ ప్రభావం తగ్గడంతో రెండు నెలలుగా తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.వారాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. శనివారం తిరుమల మొత్తం భక్తులతో కిటకిటలాడింది.శనివారం సాయంత్రం సర్వదర్శన భక్తుల మధ్య తోపులాట జరిగింది.సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్క్‌లోని షెడ్లు నిండిపోయాయి.క్యూలైన్‌ లేపాక్షి మీదుగా పీఏసీ-4 లగేజీ సెంటర్‌ నుంచి రాంభగీచ వరకు వ్యాపించింది. దీంతో శనివారం సాయంత్రం ఆస్థానమండపం వద్ద క్యూలైన్‌లోకి ప్రవేశించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో భక్తుల మధ్య 4.30 నుంచి 6 గంటల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి.సెక్యూరిటీ  సిబ్బంది రోప్‌ల సహాయంతో ఏపీసీ-4 వద్దనున్న లైన్‌లోకి అనుమతించారు.రద్దీ పెరుగుతున్న క్రమంలో క్యూలైన్లను, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు.గదులు కేటాయించే సీఆర్వో, ఎంబీసీ, పద్మావతి, రిజిస్ర్టేషన్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లలో బారులు తీరారు. గదులు లభించని భక్తులు షెడ్లు, కార్యాలయాల ముందు, ఫుట్‌పాత్‌లు, చెట్ల కిందనే సేదదీరుతున్నారు.సోమవారం వరకూ రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-05-22T07:27:49+05:30 IST