గోరంత పథకాలకు కొండంత ప్రచారాలు!

ABN , First Publish Date - 2022-05-25T06:13:38+05:30 IST

జగత్ కిలాడీ జగన్ నిత్యం అవాస్తవ ప్రకటనలతో మాయ చేస్తున్నారు. ప్రజలపై మోసపు వలలు విసరడమే ఆయనకు దినచర్యగా మారింది. ప్రజలు అధికారమిచ్చింది ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే తప్ప...

గోరంత పథకాలకు కొండంత ప్రచారాలు!

జగత్ కిలాడీ జగన్ నిత్యం అవాస్తవ ప్రకటనలతో మాయ చేస్తున్నారు. ప్రజలపై మోసపు వలలు విసరడమే ఆయనకు దినచర్యగా మారింది. ప్రజలు అధికారమిచ్చింది ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడం కోసమే తప్ప, సొంత మీడియాకు లబ్ధి చేకూర్చడానికి కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం టెలివిజన్, పత్రికల ద్వారా ప్రకటనోద్యమం చేపట్టి ప్రజాధనాన్ని హారతి కర్పూరంలా ఖర్చుపెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి, రాజ్యాంగాన్నీ దానిపై తాను చేసిన ప్రమాణాన్నీ కాలరాసి, సొంత పత్రికకు అడ్డగోలుగా ప్రకటనలు ఇస్తూ, ఈ మూడేళ్ళలో దాదాపు రూ.500 కోట్లు దోచిపెట్టారు.


రైతు భరోసా పథకం ద్వారా రైతుకి దక్కేది పిసరంత, కానీ ప్రభుత్వం చేసే ప్రచారం కొండంత. వైఎస్సార్ పెన్షన్ కానుకకు పత్రికా ప్రకటనల కోసం ప్రతి నెల రూ.20కోట్లు చొప్పున ఏడాదికి రూ.240కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. నాలుగు విడతలుగా అమలు చేస్తున్న విద్యాదీవెన పథకం ఒక్కో విడతకు రూ.20కోట్లతో పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా ప్రతి పథకానికి పదే పదే ప్రకటనలు ఇస్తూ వందల కోట్ల రూపాయల్ని సొంత మీడియాకు దోచిపెడుతున్నారు. తమకు భజన చెయ్యని పత్రికలపై పక్షపాతం చూపిస్తున్నారు. అటు రాజకీయ ప్రయోజనాల కోసం, ఇటు సొంత మీడియాకి ఆర్థిక లబ్ధి కోసం ఇతర మీడియా సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ లోపాలు, తప్పులను ఎత్తి చూపుతుందన్న అక్కసుతో ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తున్నారు. ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఈ రాష్ట్రం ఎవరి జాగీరూ కాదు. నిజంగా మీరు చెబుతున్నట్లు మీ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతున్నట్లయితే ఈ విధంగా పేజీలకు పేజీలు పత్రికా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరమేముంది? పథకాలకు తండ్రీ కొడుకుల పేర్లు పెట్టుకొని సొంత జేబులో నుంచి ఖర్చుపెట్టినట్లు దానకర్ణుల్లా ఊదరగొడుతున్నారు.


కొత్త పథకాలు ప్రారంభించినా, ఏదైనా విజయం సాధించి ఇస్తే ప్రకటనలు ఇవ్వడంలో అర్థం ఉంది. దానిని ఎవరూ తప్పు పట్టరు. ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితిలో ఉండి, వేలకోట్ల అప్పులు చేస్తూ, ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతూ, మరో పక్కన ఉన్న పథకాలకు కోతలు పెడుతూ, పాత పథకాలకే కొత్త రంగులద్ది పేర్లు మార్చి పదే పదే ప్రకటనలిస్తూ, ప్రజాధనాన్ని దారి మళ్లించడం ఎంతవరకు సమర్థనీయం? ఒక పత్రికకే ప్రకటన ఇస్తే విమర్శలు వస్తాయని మరికొన్ని పత్రికలకు కూడా కొన్ని ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వమే కొత్తగా కనిపెట్టినంత స్థాయిలో ప్రచారానికి ఖర్చుపెడుతున్నారు. ఇప్పటికే అప్పు తేనిదే ప్రభుత్వం అడుగు తీసి అడుగు వెయ్యలేని దుస్థితి. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో ఈ విధంగా ప్రజాధనాన్ని దుబారా చెయ్యడం సమర్థనీయమా?


తన ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, తన ప్రభుత్వానికి గత తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా మీరే చెప్పాలని తూర్పు గోదావరి జిల్లా మత్స్యకార భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను కోరారు. అట్లాగే కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలపై శిక్షణ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని మీరెక్కడైనా చూసారా అని ప్రజల్ని ప్రశ్నించారు. చంద్రబాబువి అబద్దాలని, మోసాలని చెప్పే అర్హత అసలు జగన్‍కి ఉన్నదా? విదేశాలకు పోవాలంటే సీబీఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుని వెళుతున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు వేలెత్తి చూపటం సిగ్గుచేటు. ఈయన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమ జీవోల ద్వారా మోసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చెయ్యబట్టే సీబీఐ విదేశాలకు వెళ్లకుండా నిబంధన విధించింది. ఒక పక్కన టెర్రరిస్టు పరిపాలన చేస్తూ, ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టి, మరోపక్క పెట్టుబడులు ఆకర్షించడం కోసం దావోస్ వెళుతున్నామని చెప్పడం ఎవర్ని మోసం చెయ్యడానికి? రాష్ట్రంలో వున్న అధ్వాన్న పరిస్థితులు చూసి ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? పెట్టుబడులు రావాలి అంటే ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. నిరంతరం విద్యుత్తు ఉండాలి. రహదారులు అద్భుతంగా ఉండాలి. రాష్ట్రంలో వీటి పరిస్థితి చూసి ఎవరన్నా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? మీరు పెట్టుబడులు కోసం అని బిల్డప్ ఇస్తూ విదేశాలకు వెళుతున్నారు. కానీ మీ ఈ విదేశీ యాత్రలకు అయ్యే ఖర్చులైనా వెనక్కు తీసుకురాగలరా?


సొమ్మొకడిది సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి. ఒఎన్‌జిసి పైపులైన్లతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం ఇచ్చేది కేంద్రం. దానిని తానే సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ హంగామా చెయ్యటం హాస్యాస్పదం. మత్స్యకారులకు ఈ పరిహారాన్ని ఆరు నెలలుగా ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాల్సిన దానిలో సగమే ఇచ్చి మత్స్యకారులను ఉద్ధరించినట్లు ప్రకటనలు ఇవ్వడం మోసం కాక మరేమిటి? మల్లాడి సత్యలింగ నాయకర్ పేరెత్తే అర్హత జగన్‌కు ఉందా? ఎంఎస్ఎన్ ట్రస్టు ఆస్తులు కూడా కబ్జా చేయాలని మీరు చూడలేదా? తెలుగుదేశం అడ్డుకోవడంతో వెనక్కి తగ్గింది నిజం కాదా? మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం రెట్టింపు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. డీజిల్ రాయితీ బకాయిల్లేకుండా చెల్లించింది, మత్స్యమిత్ర గ్రూపులను ఏర్పాటు చేసింది, ఫిష్ మార్కెట్లు నెలకొల్పింది తెలుగుదేశమే.


తెలుగుదేశం ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికీ భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంది. కుప్పకూల్చిన రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించింది తెలుగుదేశం కాగా, విధ్వంసం చేసి వికృతానందం పొందింది వైసీపీ. ఆదాయం పెంచి ఆస్తులు కల్పించింది తెలుగుదేశం కాగా, ఆదాయం పెంచటం చేతగాక ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది వైసీపీ. అన్ని రంగాలను అభివృద్ధి చేసి రెండంకెల వృద్ధి రేటును తెలుగుదేశం ప్రభుత్వం సాధించగా, అసమర్థ పాలనతో అన్ని రంగాలను నేలమట్టం చేసి రాష్ట్రాన్ని మైనస్ గ్రోత్‌లోకి నెట్టింది వైసీపీ. మిగులు విద్యుత్ సాధించి కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని తెలుగుదేశం మీకు అప్పగిస్తే, విద్యుత్తు వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టి రాష్ట్రాన్ని అంధకారం చేశారు మీరు. ఐదేళ్లు విద్యుత్తు చార్జీలు పెంచకుండా పాలించింది తెలుగుదేశం. వైసీపీ ప్రభుత్వం మూడేళ్ళలో ఏడుసార్లు విద్యుత్తు చార్జీలు పెంచి రూ.16వేలకోట్ల భారాన్ని మోపింది. అయిదేళ్లలో తెలుగుదేశం రూ.67వేలకోట్లు ఖర్చుచేసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, పట్టిసీమను నిర్మించి, నదుల అనుసంధానం చేసి, 70శాతం పోలవరం పూర్తిచేస్తే, ఆ ప్రాజెక్టులను మొండి గోడలుగా మిగిల్చింది వైసీపీ. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించింది, నిరుద్యోగ భృతి ఇచ్చింది తెలుగుదేశం కాగా, నిరుద్యోగాన్ని పెంచి నిరుద్యోగ భృతిని రద్దు చేసింది వైసీపీ. పెట్టుబడులు రాబట్టింది తెలుగుదేశం అయితే వెళ్లగొట్టింది వైసీపీ. తెలుగుదేశం ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా చూపటానికి ఇవి చాలా? ఇంకా కావాలా?  మీరా గత ప్రభుత్వానికీ, వైసీపీ ప్రభుత్వానికి తేడా గమనించమని ప్రజల్ని కోరేది? మూడేళ్ల మీ నిర్వాకాలు ఏమిటో గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో బయట పడుతున్నాయి. మీ అభిమాన రివర్స్ టెండరింగ్ పథకం ఇప్పుడు మీకే రివర్స్ అయింది. సభల్లో మీరు నోరు తెరవగానే జనం రివర్స్ వెళ్లిపోతున్నారు.

యనమల రామకృష్ణుడు

టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - 2022-05-25T06:13:38+05:30 IST