చెరువులకు పొంచి ఉన్న ముప్పు

ABN , First Publish Date - 2022-08-17T05:31:47+05:30 IST

అసలే వర్షాకాలం. మండలంలోని చాలా ప్రమాదపుటంచున ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతోందోననే భయం గుప్పేట్లో గ్రామీణులు జీవనం గడుపుతున్నారు.

చెరువులకు పొంచి ఉన్న ముప్పు
కొత్తపల్లి చెరువు కట్టపై ఏపుగా పెరిగిన కంప చెట్లు

అమడగూరు, ఆగస్టు 16: అసలే వర్షాకాలం. మండలంలోని చాలా ప్రమాదపుటంచున ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతోందోననే భయం గుప్పేట్లో గ్రామీణులు జీవనం గడుపుతున్నారు. గత యేడాది కురిసిన భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా చెరువులు బాగా దెబ్బతిన్నాయి. మం డలపరిధిలోని పేరంవాండ్లపల్లి, నల్లగుండకొత్తచెరువు, గంగరాజుచెరువు, ఎ.కొత్తపల్లి చెరువు, పుట్టవాండ్లపల్లి చెరువు, అమడగూరు పెద్ద చెరువులు ప్రమాదంలో పడ్డాయి. ఈయేడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తా యని వాతారణ శాఖాధికారులు చెబుతున్నారు. గత యేడాది మాదిరిగానే ఈయేడాది కూడా వర్షాలు భారీగా కురిస్తే కొత్తపల్లి చెరువుకు గండిపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయని గ్రామస్థులంటున్నారు. 

    గత యేడాది కురిసిన వర్షాలకు పేరంవాండ్లపల్లి, కొత్తపల్లి, అమడగూరు చెరువుల కట్టలపై నుంచి నీళ్లు పొంగి పొర్లడంతో... చెరువు కట్టలు కోతలకు గురయ్యాయి. అప్పుడు ఇరిగేషన అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎక్స్‌కవేటర్లతో మరవలు, తూముల వద్ద పెద్ద కాలువలు తీయడంతో ప్రమాదం తప్పిందని ప్రజలంటున్నారు. మళ్లీ వాటిగురించి పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి చేతులు దులుపుకుంటారు తప్ప, శాశ్వత పరిష్కారం చేయడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. చెరువులకు ప్రమాదం పొం చి ఉందని తెలిసినా ఏ అధికారికానీ, ప్రజాప్రతినిధికానీ కన్నెతి చూడడం లేదంటున్నారు. దీంతో  అడవులను తలపించేలా చెరువుల్లో ముళ్ల పొదలు ఏపుగా పెరిగి... చెరువు కట్టలు నెర్రెలు  చీలాయి. కొత్తపల్లి చెరువు కట్టకు నెర్రెలు అధికంగా చీలడంతో చెరువుకు గండిపడే అవకాశముందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలోని గొర్రెల కాపరులు మేతకు, తాగునీటి కోసం చెరువు కట్టపై వెళ్లాల్సి ఉంది. చెరువు కట్టమీద గంగమ్మ గుడి ఉంది. భక్తులు ముళ్ల పొదల్లో వెళాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన చెందుతున్నారు. పైగా గ్రామస్థులు అరచేతిలో ప్రాణా లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. కొత్తపల్లి చెరువు కు గండిపడితే కొత్తపల్లి దిగువ ఊరు మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి చెరువు తెగితే అమడగూరు చెరువు తేగిపోయే ప్రమాదముందని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఆ చెరువు తెగితే దిగువ ప్రాంతాలైన శీతిరెడ్డిపల్లి, రెడ్డివారిపల్లి, కర్ణాటక రాష్ట్రంలోని రాయచెరువు గ్రామం కూడా నీట మునిగే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. ఇంత ప్రమాదం పొంచి ఉంటే ఇరిగేషన అధి కారులు ఏమీ పట్టనట్లు వవ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్ప టికైనా ఇరిగేషన అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ వర్షాలు రాకముందే చెరువు కట్టల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

పనులు చేయడానికి నిధులు లేవు- మహేష్‌, ఇరిగేషన ఏఈ

చెరువులు మరమ్మతులు చేపట్టాలంటే ప్రస్తుతం నిధులు లేవు.  సంవ త్సరాలు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు మంజూరు కావడంలేదు. కొత్తపల్లి, అమడగూరు, పేరవాండ్లపల్లి చెరువులను ఆర్‌ఆర్‌ఆర్‌గా ఎస్‌డీపీ ప్యాకేజీకింద మరమ్మతుల కోసం నివేదికలు పంపాం. నిధులు వస్తే పనులు చేపడతాం.   


Updated Date - 2022-08-17T05:31:47+05:30 IST