గుడ్లకొచ్చిన అలికిడి

ABN , First Publish Date - 2020-06-01T05:52:42+05:30 IST

కిక్కురుమనని బోరలు వొంపులు పొదలు దాటి అర్ధమ్మనాత్రి నడుస్తున్న పాణం లేని కొండ చిలువలా ఉంది పిల్లబాట.....

గుడ్లకొచ్చిన అలికిడి

కిక్కురుమనని బోరలు

వొంపులు పొదలు దాటి

అర్ధమ్మనాత్రి నడుస్తున్న

పాణం లేని కొండ చిలువలా ఉంది పిల్లబాట

నడుస్తున్న పొడగాటి నిశ్శబ్దంలో...


నా ఎనకాల ఏదో అలికిడి

ఎన్ను తడుముకోని నిటారుగా నడుస్తున్న

మధ్య మధ్యలో సరాయిస్తున్న

అయినా నన్ను ఏదో అనుసరిస్తున్న నీడ


ఎప్పుడు ఇట్ల జరిగింది లేదు

ఎన్ని సార్లు చీకటి తోడు రాలేదు

ఆకు రాలిన సప్పుడు లేదు

గాలి బాగా వీస్తున్నట్టూ కాదు

ఏ తెడల అలికిడి లేదు

చేపలు ఎగిరిన సప్పుడు లేదు

ఏ కుక్కల నక్కల అరుపులు లేవు

కట్టమైసమ్మ కనుగుడ్లల్లో నిశ్శబ్దం


ఇంట్లో వద్దంటున్నా....

ఇసురొల భుజాన ఏసుకొని

పొయ్యి ముట్టిస్తందుకు

మహా వొస్తి దొంగ సాటుంగ 

ఎన్ని సార్లు ఎన్ను తడుముకున్నా 

అదే అలికిడి

గుడ్లకొచ్చిన అలికిడి

తావు కోసం తనుకులాడుతుంది


మతి మాయజాలం

భీతి చితి జ్వాల

అడుగు అడుగు ఆటు

కనిపించని పాము కాటు

తోవంతా దిగులు

ఇంటికొచ్చే దాక బుగులు


మెలికలు తిప్పిన మెతుకు

బుస కొడుతున్న గడియ

నిమిషం నిమిషం నిశ్శబ్ద ఊబిలోకి కూరుకుపోతుంది


పంతుల్ది ఏం బొయ్యింది

పాపయ్యది ఏం బొయ్యింది

వలస పాదాల కింద వడ్లు

పల్లేర్లయ్యి గుచ్చుకుంటున్నయ్‌

పిల్లలు పిడికిట్ల కొస్తున్నరు

పడమటింట్లో కాగు

సాంపి నింపుకొని వాకిట్లో కొచ్చింది

సందుక ఉన్నోడు సందు కనబడకుండ ఉండు


కాళ్ళు చేతులు ఆడించి

ఋతువులకు చెమట సాకబోసి

కాలాన్ని అల్లించేటోళ్ళం

కట్టేసినట్టుంది

ఎవరో ఒట్టేసినట్టుంది

మూడు బాటల మీది నించి

నడిమింట్లో తిప్పేసినట్టుంది

మలుగు నెర్రల ఇరికినట్టుంది

జీడిగింజ పగిలి చీకటి తోడుకున్నట్టుంది


ఎవడు పెట్టిన ఇత్తనమో

మెదలు మెదలుగా శవాలు

శ్వాస లేని కల్లం

చిక్కంలో చేపల నిశ్శబ్దం



మునాసు వెంకట్‌ 

99481 58163

Updated Date - 2020-06-01T05:52:42+05:30 IST