స్థానికతకు సున్నం

ABN , First Publish Date - 2022-08-18T08:32:34+05:30 IST

ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్నారు.

స్థానికతకు సున్నం

  • ఉపాధి అవకాశాల్లో లోకల్‌ ఊసే లేదు
  • ఏటీజీ ఫ్యాక్టరీ రూల్స్‌ ప్రకారం చూస్తారట?
  • ప్రైవేట్‌ కంపెనీల్లో 75ు ఉద్యోగాలకు జగన్‌ హామీ
  • కానీ, ఆ ఊసే లేకుండా టైర్ల కంపెనీ ప్రారంభం
  • ఎంటెక్‌ పూర్తిచేసిన వారికీ మొండిచేయి
  • పిల్లలకు కొలువుల ఆశతోనే కంపెనీకి భూములు
  • నైరాశ్యంలో అచ్యుతాపురం సెజ్‌  రైతులు, యువత


ఎంటెక్‌ చేసినా సెజ్‌లో ఉద్యోగం లేదు 

నేను ఎంటెక్‌ పూర్తి చేశాను. అచ్యుతాపురం సెజ్‌ కంపెనీల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినా ఇవ్వలేదు. దీంతో కాకినాడలోని ఒక ప్రైవేటు కళాశాలలో అరకొర జీతంతో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. మా భూముల్లో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో మాకు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే తల్లితండ్రులకు దగ్గరగా వుండడానికి అవకాశం ఉంటుంది.. 

- ఎల్‌.ప్రవీణ్‌ కుమార్‌, ఎంటెక్‌, మార్టూరు, అచ్యుతాపురం సెజ్‌


విశాఖపట్నం/అచ్యుతాపురం రూరల్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అన్నారు. ‘కంపెనీలకు భూములిచ్చి మీ పిల్లల కోసం కొలువులు తీసుకోండి’ అన్నట్టు కలరింగ్‌ ఇచ్చారు. మూడేళ్లుగా జగన్‌ సర్కారు చేస్తున్న ఈ ప్రకటనలు నమ్మి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఏటీజీ టైర్ల కంపెనీ ఏర్పాటుకు పలువురు రైతులు సహకరించారు. ఇంట్లోని ఉన్నత చదువులు చదివిన పిల్లలను దృష్టిలో ఉంచుకుని తమ భూములు ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించారు. కంపెనీ వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నిజంగానే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, టైర్ల కంపెనీ ప్రారంభోత్సవం కోసం మంగళవారం సెజ్‌కు వచ్చిన సీఎం జగన్‌,దీనికి సన్నాహంగా మూడురోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ నుంచి ఉపాధి కల్పనపై స్పష్టమైన హామీ రాకపోవడంతో వీరిని నిశ్చేష్ఠులను చేసింది. ‘అదంతా కంపెనీ చూసుకుంటుంది’ అన్న పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడటం తమను విస్మయపరిచిందని పలువురు డిప్లొమా పట్టభద్రులు తెలిపారు.


 దీంతో పరిశ్రమల ఏర్పాటు, వాటిలో స్థానికులకు ఉపాధి విషయంలో అధికార పార్టీ నేతలు వాస్తవాలు దాచిపెడుతున్నారని మరోసారి తేలిపోయింది. పరిశ్రమల్లో వేర్వేరు పనులకు సంబంధించి కాంట్రాక్టులు దక్కించుకునేందుకు పోటీ పడే ప్రజా ప్రతినిధులు....భూములు ఇచ్చిన స్థానికులకు వాటిల్లో ఉపాధి కల్పించే విషయంలో మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మైకుల ముందు మాత్రం స్థానికులకు న్యాయం జరుగుతుందని ప్రగల్బాలు పలుకుతున్నారు. అచ్యుతాపురం మండలంలోని ఏపీ సెజ్‌లో మంగళవారం ఉత్పత్తి ప్రారంభించిన ఏటీజీ టైర్ల కంపెనీలో మొదటి విడత 1,200 మందికి, ఆ తరువాత 800 మందికి ఉపాధి లభిస్తుందని, అందులో 75 శాతం స్థానికులకే అని గతంలో నొక్కి వక్కాణించారు. అయితే, సీఎం జగన్‌ ఈ కంపెనీ ప్రారంభోత్సవంలో జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడా దొరక్కుండా మాట్లాడారు. ఉపాధి విషయంలో కంపెనీ నిబంధనలకు అనుగుణంగా స్థానికులకు అవకాశం ఇస్తారని పేర్కొన్నారు. మూడురోజుల క్రితం జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కూడా ఇవే మాటలు వల్లెవేశారు. ఏటీజీ టైర్ల కంపెనీలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, ‘వారికి (విలేకరులకు) స్థానికుల ఉపాధి వివరాలు ఇవ్వండయ్యా’ అని అధికారులను పురమాయించారు. అయినా.. ఇప్పటివరకు ఉద్యోగుల వివరాలు, అందులో స్థానికులు ఎంతమందో వెల్లడించలేదు. దీనిపై స్థానిక యువత గగ్గోలు పెడుతున్నారు. 


పది శాతమూ న్యాయం చేయలేదు

జగన్‌ ప్రభుత్వం మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉపాధి విషయంలో ఇచ్చిన హామీలో పదిశాతం కూడా న్యాయం చేయలేదని వాపోతున్నారు. సెజ్‌ ఏర్పాటుకు తమ జీవనాధారమైన భూములను త్యాగం చేశామని, ఇప్పుడు తమ పిల్లలకు సెజ్‌లోని కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఉపాధి కోసం వారు పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కంపెనీల యాజమాన్యాలకు అధికార పార్టీ నాయకులు అమ్ముడుపోయి, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడేళ్ల తరువాత తొలిసారి సెజ్‌కు వచ్చారని, ఆయనను కలిసి సమస్యలను విన్నవించుకుందామంటే.. పోలీసులు ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదని నిరుద్యోగ యువకులు అన్నారు. ఏటీజీ టైర్ల కంపెనీ కోసం మార్టూరు గ్రామంలో రైతుల నుంచి 450 ఎకరాలు సేకరించారు. పెద్ద పెద్ద చదువులు చదివినా తమకు అవకాశం ఇవ్వలేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


దరఖాస్తు చేసి ఏడాదైనా ఉద్యోగం ఇవ్వలేదు

‘‘నేను డిప్లొమా (పాలిటెక్నిక్‌) పూర్తిచేశాను. ఏటీజీ టైర్ల కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను. కంపెనీ నిర్మించి ఏడాది కావస్తున్నా ఉద్యోగం ఇవ్వలేదు. కంపెనీలోకి వెళ్లి అడుగుదామంటే సెక్యూరిటీ సిబ్బంది అనుమతి ఇవ్వడం లేదు. పరిశ్రమల్లో స్థానికులకు 75ు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించిన సీఎం జగన్‌.. సెజ్‌లోని కంపెనీల్లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలి’’

- బదిరెడ్డి నరేశ్‌, డిప్లొమా హోల్డర్‌, మార్టూరు, అచ్యుతాపురం సెజ్‌


సెజ్‌కు 10 ఎకరాలు ఇచ్చాం.. 

‘‘ఎస్‌ఈజడ్‌ కోసం మా కుటుంబం పది ఎకరాలు ఇచ్చింది. టైర్ల ఫ్యాక్టరీని మా భూమిలోనే ఏర్పాటుచేశారు. ఎంబీఏ పూర్తి చేసిన నాకు ఈ కంపెనీలో ఉద్యోగం ఇవ్వలేదు. పరిశ్రమల కోసం భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదు’’

- శివరామ్‌ ప్రసాద్‌, ఎంబీఏ, మార్టూరు, అచ్యుతాపురం సెజ్‌


Updated Date - 2022-08-18T08:32:34+05:30 IST