ప్రాణం తీస్తున్న పిడుగు

ABN , First Publish Date - 2022-04-22T05:34:39+05:30 IST

పిడుగు పాటుకు సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి.

ప్రాణం తీస్తున్న పిడుగు

  1. పొలాల్లో పనులు చేస్తుండగా ప్రమాదం
  2. మృతుల్లో రైతులు, కూలీలు,  గొర్రెల కాపరులే అధికం 
  3.   అప్రమత్తతే ముఖ్యమంటున్న నిపుణులు


పిడుగు పాటుకు సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి. గురువారం ఒక రోజే నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ నలుగురు పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్న వారిలో   ఎక్కువగా పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, కూలీలు, గొర్రెల కాపర్లే ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే పిడుగు ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ చేసే హెచ్చరికలను జిల్లా యంత్రాంగం పల్లెసీమల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.


(కర్నూలు-ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ఆరంభంలో పిడుగుపడి మరణాలు నమోదవుతున్నాయి. వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా మేఘాల్లో ఏర్పడే పీడనం, ఇతర పరిస్థితుల కారణంగా మెరుపులు ఏర్పడతాయి. ఇవి పెద్ద శబ్దంతో భూమి వైపు దూసుకొస్తాయి. కొన్ని కోట్ల ఓల్టుల విద్యుత శక్తి పిడుగలా భూమిపై కేంద్రీకృతం వల్లనే ప్రాణ, ఆస్తి నష్టం జరగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.  

  భూమి వైపు దూసుకొచ్చే మెరుపు

వాతావరణంలో వేడి కారణంగా నీరు అవిరి అవుతూ మేఘాలు ఏర్పడతాయి. ఆ సమయంలో ఏర్పడే వేడి, చల్లని గాలులకు మేఘాలు ప్రభావితం అవుతాయి. వేడికి ప్రభావితమయ్యే మేఘాలు తక్కువ బరువు ఉంటాయి. నీటి ఆవిరితో నిండి ఉన్న మేఘాల కంటే ఎత్తుకు వెళ్లాయి. వీటిలో ప్లస్‌ లేదా పాజిటివ్‌ చార్చ్‌ ఉంటుంది. ఎక్కువ బరువు ఉండే మేఘాలు తక్కువ ఎత్తులో మైనస్‌ లేదా నెగిటివ్‌ చార్చ్‌లో ఉంటాయి. వీటిలో ఎలకా్ట్రన్లు ఎక్కువగా ఉంటాయి. ఆకాశం మేఘా వృతమైనప్పుడు దిగువన ఉన్న నెగటివ్‌ చార్జ్‌ క్లౌడ్స్‌లోని ఎలకా్ట్రన్లు.. ఎక్కువ ఎత్తులో ఉండే మేఘాల వైపు ఆకర్షితం అవుతాయి. ఈ క్రమంలో వీటిలో ఉండే ఎలకా్ట్రన్లు.. నెగటివ్‌ చార్జ్‌ కలిగిన మేఘాలు లేదా భూమి వైపు ఆకర్షితమై అధిక శక్తితో ప్రసరిస్తాయి. ఆ సమయంలో ఏర్పడే విద్యుత్తు శక్తినే మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని అంటారు. ఇవి ఆకాశంలో ఇతర మేఘాల వైపునకు లేదా భూమి వైపునకు అత్యంత వేగంగా దూసుకు వస్తాయి. కోట్ల ఓల్టుల విద్యుత శక్తితో భూమి తాకిని మెరుపు విధ్వంసం సృష్టిస్తుంది.

 ఈ జాగ్రత్తలు పాటిద్దాం

వర్షాకాలంలో ఆకాశంలో ఏర్పడే వాతావరణ మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. మేఘాలు కమ్ముకుంటే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. 

ఫ పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, గొర్రెలు, పశువుల కాపర్లు వీలైనంత త్వరగా ఇళ్లకు చేరుకోవాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తుందని గుర్తించగానే సమీపంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుకోవాలి. 

ఫ ఆ సమయంలో నేలమీద నిటారుగా నిల్చొని ఉండకూడదు. మెరుపులు ఏర్పడినప్పుడు ఆరుబయట ఉంటే.. ఆ సమయంలో శరీరాన్ని బంతిలాంటి స్థితిలో ఉంచాలి. తలను కిందకు వంచి.. చేతులు గుండ్రంగా శరీరంపై కప్పి ఉంచాలి. కాలి వేళ్లు మాత్రమే భూమిని తాకేలా ఉండాలి. భూమిపైకి కాస్త ఎత్తులో శరీరం ఉండటం వల్ల పిడుగు ప్రమాదం తగ్గుతుంది. 

ఫ ఉరుములు, మెరుపులతో కూడి వర్షం వస్తున్నప్పుడు ఎక్కువ మంది గుంపుగా ఉండకూ డదు. ఒకరికి ఒకరు దూరంగా ఉండాలి. ఒకవేళ పిడుగు ప్రమాదం సంభవిస్తే నష్టం తీవ్రత తగ్గుతుంది. 

ఫ ఇళ్లలో ఉన్నప్పడు పిడుగు పడితే.. ప్లంబింగ్‌ వ్యవస్థ ద్వారా విద్యుత్తు ప్రవహించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం వస్తున్నప్పుడు స్నానాలు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. అంతేకాదు.. కరెంట్‌తో పని చేసే వాషింగ్‌ మెషిన్లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, గేమ్‌ సిస్టమ్స్‌ వంటివి ఉపయోగించరాదు. 

ఫ మెరుపును ఆకర్షించే గుణం చెట్లకు ఉంటుంది. వర్షానికి తడిసినా పర్వాలేదు. ఏ పరిస్థితుల్లోనూ ఎత్తయిన చెట్ల కిందకు వెళ్లకూడదు. కొండలు, పర్వతాలు, శిఖరాలు వంటి ఎత్తయిన ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా కిందకు దిగాలి. 

ఫ టవర్లు, విత్యుత్తు స్తంభాలు, ట్రాన్సఫార్మర్లకు దూరంగా ఉండాలి. 

ఫ చెరువులు, కాలువలు, సరస్సులు.. వంటి నీటి వనరుల్లో ఉండేవాళ్లు బయటకు రావాలి. 

ఫ పిడుగు ప్రమాద మరణాలను పరిశీలిస్తే.. సాయంకాలపు వర్షాలకే ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. సాయంత్రం 3-4 గంటల తర్వాత పొలాల్లో పనులు చేసే రైతులు ఇళ్లకు చేరుకోవడం ఉత్తమం. 

 ముందస్తు అంచనా అవసరం

-  ఏ జిల్లాలో, ఏ మండలంలో పిడుగులు పడుతున్నాయో వాతావరణ శాఖ సెల్‌ఫోన్ల ద్వారా ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పుల గురించి రేడియో, టీవీలు, ఇతర ప్రసార సాధనాలు, సోషల్‌ మీడియా ద్వారా సమాచారం తెలుసుకోవాలి.

-  వాతావరణంలో వేడి, తేమ ఎక్కువగా ఉన్న సమయంలో క్యుములోనింబస్‌ మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా వర్షాలు పడుతాయి. అలా అకస్మాత్తుగా కురిసే వర్షాలు తక్కువ వ్యవధిలో భారీగా కురుస్తాయి. అదే సమయంలో పిడుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

- దట్టమైన మేఘాలు ఏర్పడి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు.. మెరుపులు, ఉరుముల శబ్దాలు ఎక్కువగా ఉంటే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో బయటకు వెళ్లకూడదు. బహిరంగ ప్రాంతాల్లో చేయాల్సిన పనులు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. 

  ఏడాదిలో జరిగిన పిడుగుపాటు  మరణాల్లో కొన్ని ..

- హొళగుంద మండలం పెద్దహ్యాట గ్రామంలో గతేడాది పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. 30 మేకలు కూడా మృత్యువాతపడ్డాయి. 

-  గతేడాది మే 11న కోసిగి మండలం డి.బెళగల్‌ గ్రామంలో పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుకు కురవ వీరనాగప్ప (46) మృతి చెందారు

-  జూన 6న నందవరం మండలం ముగతి గ్రామంలో పొలంలో విత్తనం వేస్తున్నారు. అదే సమయంలో వర్షాలు రావడంతో చెట్టు కిందకు చేరిన కమలమ్మ (26) పిడుగు పడి మృత్యుఒడి చేరారు.

-  ఆదోని మండలం కుప్పగల్లుకు చెందిన సురేష్‌ (11) ఆరో తరగతి చదువుతున్నాడు. అమ్మానాన్నలు వలస వెళ్లడంతో అమ్మమ్మ ఊరు మంత్రాలయం మండలం లచ్చుమర్రి గ్రామంలో ఉన్నారు. ఈ నెల 16న పొలం దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో వర్షం రాగా పొలంలోనే పిడుగు పడి ప్రాణం వీడారు. 

Updated Date - 2022-04-22T05:34:39+05:30 IST