Prophet Row: నూపుర్ శర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ఉపసంహరణ కోరుతూ సీజేఐకి లేఖ

ABN , First Publish Date - 2022-07-02T00:53:01+05:30 IST

భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు

Prophet Row: నూపుర్ శర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల ఉపసంహరణ కోరుతూ సీజేఐకి లేఖ

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఉపసంహరించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ (Justice NV Ramana) సమక్షంలో ఓ లేఖ అర్జీ (Letter Petition) దాఖలైంది. ఆమె ఓ టీవీ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తంకావడంతోపాటు ఆమెపై పలు చోట్ల కేసులు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులన్నిటినీ ఒకే చోట విచారించేలా ఆదేశించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఆమెకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. 


Nupur Sharma దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం తోసిపుచ్చింది. ఆమెపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లన్నిటినీ ఒకే చోట విచారించేలా ఆదేశించేందుకు తిరస్కరించింది. Prophet Mohammadపై ఆమె చేసిన వ్యాఖ్యలను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం తీవ్రంగా విరుచుకుపడింది. ఆమె యథేచ్ఛగా మాట్లాడటం వల్ల యావత్తు దేశం అగ్ని జ్వాలల్లో చిక్కుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో జరుగుతున్నదానికి ఆమె మాత్రమే బాధ్యురాలని మండిపడింది. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ ఎజెండాతో లేదా ఏదో క్రూరమైన కార్యకలాపాల కోసం ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉందని పేర్కొంది. ఆమె యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని పేర్కొంది.


ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన అజయ్ గౌతమ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సమక్షంలో ఓ లెటర్ పిటిషన్ దాఖలు చేశారు. నూపుర్ శర్మ పిటిషన్‌పై న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణ జరగడం కోసం, ఆమెపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ధర్మాసనానికి తగిన ఆదేశాలను జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు. నూపుర్ శర్మపై చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమైనవని ప్రకటించాలని కోరారు. ఆమెపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులన్నిటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-07-02T00:53:01+05:30 IST