నేతన్నకు కావాలి..చేయూత

ABN , First Publish Date - 2022-08-07T04:34:42+05:30 IST

పెళ్లిళ్లు, పేరింటాలు, ఇతర శుభ కార్యాలకు హోదా, అంతస్తుకు సూచికంగా భావించే పట్టుచీరల ఉత్పత్తి రంగం చేనేత ఒడిదుడుకులు, ఆటుపోట్ల మధ్య సాగుతోంది.

నేతన్నకు కావాలి..చేయూత
నీరుగట్టువారిపల్లెలో చేనేత మగ్గంపై పట్టుచీర నేస్తున్న కార్మికులు

ఒడిదుడుకుల్లో చేనేత రంగం
నేడు జాతీయ చేనేత దినోత్సవం

మదనపల్లె, ఆగస్టు 6:
పెళ్లిళ్లు, పేరింటాలు, ఇతర శుభ కార్యాలకు హోదా, అంతస్తుకు సూచికంగా భావించే పట్టుచీరల ఉత్పత్తి రంగం చేనేత ఒడిదుడుకులు, ఆటుపోట్ల మధ్య సాగుతోంది. ఇన్నాళ్లు కరోనాతో ఓపక్క, కార్మికుల కొరతతో మరోపక్క చతికిలపడ్డ నేతన్న ప్రస్తుతం..భారీగా పెరిగిన సిల్కు ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇప్పటికే గోరుచుట్టుపై రోకటి పోటులా జౌళి పరిశ్రమపై జీఎస్టీ ఉండనే ఉంది. వార్పు, రేషంపై 5 శాతం, కలర్‌ (డైయింగ్‌)పై 12 శాతం, జరీపై 18 శాతం చొప్పున చేనేత ముడిసరుకుపై వస్తుసేవా పన్నులు కేంద్రం విధించింది. ఆ భారం కార్మికుల నుంచి వ్యాపారుల వరకు, చివరికి వినియోగదారుడిపై కూడా పడుతోంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో పట్టుసాగు లేకపోవడం, ముడిసరుకు చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో సిల్కు ధరలు రెట్టింపయ్యాయి. ధరలకు అనుగుణంగా మార్కెట్‌లో పట్టుచీరల వ్యాపారం మందగించడం కూడా నేతన్న బతుకుకు భరోసా లేకుండా పోయింది. చేనేత రంగాన్ని ప్రోత్సహించేలా, నేతన్నకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుతాలు ఏటా ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం ప్రత్యేక పర్వదినాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మంగళగిరిలో రాష్ట్ర స్థాయి, రాయచోటిలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేతన్న స్థితిగతులపై ఇస్తున్న ప్రత్యేక కథనం.
జిల్లాలోని మదనపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు, వీరబల్లి, సుండుపల్లె, మట్లి, రామాపురం, తదితర ప్రాంతాల్లో చేనేతలు ఉన్నారు. జిల్లాలో ప్రముఖంగా సిల్క్‌టౌన్‌గా పేరొందిన నీరుగట్టువారిపల్లె చేనేతకు ప్రసిద్ధి. ఇక్కడ పది వేల వరకు చేనేత, పవర్‌ మగ్గాలు పనిచేస్తుండగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికిపైగా కార్మికులు రోజువారీ ఉపాధి పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా తీసుకుంటే 15 వేల మగ్గాలు, 30 వేల మంది కార్మికులు ఉన్నట్లు అంచనా. నీరుగట్టువారిపల్లెలోని పది వేల మగ్గాలు పని చేస్తుండగా, వాటిలో ఒక్కో మగ్గం నుంచి సగటున నెలకు అయిదు నుంచి ఎనిమిది పట్టు చీరలు ఉత్పత్తి అవుతాయి. ఈ లెక్కన నెలకు 50 వేలకుపైగా పట్టు చీరలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇందులో ఒక్కో పట్టుచీర ధర కనిష్ఠంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ ఉంటోంది. నెలకు కనీసం రూ.వంద కోట్ల విలువ చేసే పట్టుచీరలు మాస్టర్‌ వీవర్స్‌, యాజమాన్యాలు ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ధర్మవరం తర్వాత చేనేతలో మదనపల్లె ద్వితీయ స్థానంలో ఉండగా, పవర్‌లూమ్స్‌లో హిందూపురం మొదటిస్థానాన్ని ఆక్రమించగా, చిత్తూరు జిల్లా నగరి రెండో స్థానంలో ఉంది.
    చేనేత మగ్గాలను నేర్చుకోవడానికి యువత, నిరుద్యోగులు గతంతో పోలిస్తే పూర్తిగా తగ్గిపోయారని చెప్పవచ్చు. ఇదంతా కష్టంతో కూడుకున్న పని కావడంతో ఈతరం యువత ఉపాధి, ఉద్యోగ రంగాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో చేనేత రంగమే..మానవ వనరుల కొరతను ఎదుర్కొంటోంది. ఈ రంగంపై ఆసక్తి ఉన్న మరికొందరు పవర్‌లూమ్స్‌ వైపు మక్కువ చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న కార్మికుల వరకే చేనేతరంగం నడుస్తుందని, తర్వాత భవిష్యత్తు అంతా పవర్‌లూమ్స్‌కే ఉంటుందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. చేనేత స్థానాన్ని క్రమంగా మరమగ్గాలు ఆక్రమిస్తున్నాయి. ఒకప్పుడు పూర్తిగా చేనేత మగ్గాలే ఉన్న మదనపల్లెలో ప్రస్తుతం మరమగ్గాలు వెయ్యికిపైగా ఉన్నాయి. వీటితో కూలీలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఓ పక్క సంతోషపడినా, మరోపక్క సంప్రదాయబద్ధంగా వస్తున్న చేనేత మగ్గం కనుమరుగయ్యే అవకాశం వస్తుందేమోనన్న ఆందోళనా లేకపోలేదు. ఏది ఎలా ఉన్నా.. నైపుణ్యం గల కార్మికుల డిమాండ్‌ ఉండనే ఉంది. వీరికి అడ్వాన్సులు భారీగా పెరగడం అటు మగ్గాల యాజమాన్యాలు, ఇటు మాస్టర్‌ వీవర్స్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా సిల్కు, జరీ ధరలు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. గతంలో సిల్కు కిలో రూ.3 వేలు ఉండగా ప్రస్తుతం కిలో రూ.6 వేలు పలుకుతోంది. దీనికి జీఎస్టీ తోడు కావడంతో చేనేత, జౌళిరంగంపై మోయలేని భారం పడుతోంది. ముడిసరుకు కొనుగోలు నుంచి చీరల అమ్మకం, రవాణా వరకూ దాడులు, తనిఖీలు ముమ్మరం కావడంతో వినియోగదారులు కూడా రెండు కంటే ఎక్కువగా కొనుగోలు చేసే పట్టుచీరలకు బిల్లులు అడుగుతున్నారని, ధరలు కూడా పెరగడంతో అమ్మకాలు తగ్గిపోయినట్లు వ్యాపారులు, మగ్గాల యాజమాన్యాల వారు వాపోతున్నారు.

ఎందుకీ పరిస్థితి?


మార్కెట్‌లో డిమాండ్‌కు తగిన స్థాయిలో పట్టు ఉత్పత్తి కావడం లేదు. మల్బరీకి మంచి ధరలు ఉన్నా..పంట సాగు క్రమేణా తగ్గిపోతోంది. రైతులు టమోటా, తదితర పంటలపై మక్కువ చూపడంతో మల్బరీ సాగు తగ్గుతోంది. పంట సాగును పెంచేలా రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు ప్రకటిస్తున్నా ఆ స్థాయిలో పంట సాగు పెరగకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితిలో పట్టురంగానికి ముడిసరుకు చైనా నుంచి దిగుమతి అవుతోంది. దీంతో ధరలు అనూహ్యంగా పెరిగి, ఆ ప్రభావం చేనేతరంగంపై పడుతోంది. సిల్కు ధరలు పెరిగిన స్థాయిలో పట్టుచీరలు ధరలు పెరగడం లేదని మాస్టర్‌వీవర్స్‌, వ్యాపారులు వాపోతున్నారు. ధరలు పెంచితే, వినియోగదారులు కొనే పరిస్థితి లేదని చెబుతున్నారు. రెండు చీరలు కొనే వారు కూడా ఒకటి కొనుగోలు చేయడం, లేదంటే అది కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడుతున్నట్లు వారు వాపోతున్నారు. పైగా రెండేళ్ల కరోనా తర్వాత మూడు నెలలు వ్యాపారం ఆశాజనకంగా ఉన్నా..తర్వాత ఆషాఢ, తదితర కారణాలతో శుభకార్యాల వ్యాపారం మందగించింది. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చేనేత రంగానికి కావాల్సిన ప్రోత్సాహకాలివి..!


చేనేత రంగానికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు ఈ రంగం మరికొంతకాలం మనుగడ కొనసాగించాలంటే చేనేత, జౌళి శాఖను జీఎస్టీ నుంచి మినహాయించాలి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి కార్మికులు కోరుతున్న మదనపల్లె పట్టుచీరలకు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పించాలి. మదనపల్లెకు 50 చేనేత క్లస్టర్లు మంజూరు చేయాలి. మెగా టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికులకు విరివిగా బ్యాంకు రుణాలు ఇవ్వాలి. నగరి మున్సిపాలిటీ తరహాలో ఇక్కడి వారికి ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ ఇవ్వాలి. వీరికి కమర్షియల్‌ స్థానం నుంచి గృహ వినియోగం కిందనే ఆస్తిపన్ను విధించాలి. కేంద్రప్రభుత్వం ఇస్తున్న సిల్క్‌ సబ్సిడీని రూ.200 నుంచి రూ.500 పెంచడంతో పాటు దానిని కొనసాగించాలి. నేతన్న నేస్తం కొందరికే కాకుండా అందరికీ అమలు చేయాలి. చేనేత రంగానికి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న 50 రంగుల అద్దకం పరిశ్రమలను మరో చోటికి తరలించడం ద్వారా నీరు, వాతావరణ కాలుష్యం నుంచి కాపాడవచ్చు.

చేనేతకు చేయూత కావాలి
- జి.శ్రీరాంచినబాబు, సెంట్రల్‌ సిల్కు బోర్డు మాజీ సభ్యుడు, మదనపల్లె.

పవర్‌లూమ్స్‌కు పోటీగా నిలబడి చేనేత రంగం మరికొంత కాలం బతకాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు చేయూతనివ్వాలి. పాలసీలు, ఇతర ప్రోత్సాహకాలు తప్పనిసరి. కార్మికులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి. ష్యురిటీ లేకుండా ముద్రరుణాలు ఇస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా..ఆచరణలో అమలు కావడం లేదు. రోజురోజుకూ మూగబోతున్న చేనేత మగ్గానికి పూర్వవైభవం తేవడానికి ట్రైనర్స్‌ పెంచాలి. వారికి ప్రోత్సాహకాలు ఇస్తే కొత్తతరం కూడా పవర్‌లూమ్స్‌ తరహాలో చేనేత మగ్గాలపై కూడా మొగ్గుచూపే అవకాశం ఉంది.


చేనేతకు మెరుగైన ప్యాకేజి, సబ్సిడీ ఇవ్వాలి
- మోడెం నాగరాజు, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మదనపల్లె

దేశంలోనే చేతివృత్తుల్లో మొదటిస్థానంలో ఉన్న చేనేత రంగానికి ప్రభుత్వం మెరుగైన ప్యాకేజి, సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలి. ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నా ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. కేంద్రం చేనేత రంగానికి కొన్ని పథకాలకు నిధులిస్తున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్ఙాయిలో కార్మికులకు ఇవ్వడం లేదు. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించి సిల్స్‌ సబ్సిడీతో ఇస్తే కొంతవరకు చేనేతరంగం బతుకుతుంది.



Updated Date - 2022-08-07T04:34:42+05:30 IST