చిన్నారిని మింగేసిన పెద్ద చెరువు

ABN , First Publish Date - 2021-10-17T05:40:31+05:30 IST

పెద్ద చెరువు ఓ చిన్నారిని మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి.. ఆకస్మికంగా దూరమవడంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో కూరుకుపోయారు. రాజాం మండలం పొగిరిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

చిన్నారిని మింగేసిన పెద్ద చెరువు
ప్రసన్న మృతదేహం

- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

- పొగిరిలో విషాదం

రాజాం రూరల్‌, అక్టోబరు 16 : పెద్ద చెరువు ఓ చిన్నారిని మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి.. ఆకస్మికంగా దూరమవడంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో కూరుకుపోయారు. రాజాం మండలం పొగిరిలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పొగిరికి చెందిన నారాయణరావు, రామలక్ష్మి దంపతుల కుమార్తె లక్ష్మీప్రసన్న(8).. పెద్దచెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందింది. అప్పటివరకూ ఇంట్లో ఆడుకుంటున్న ఆ చిన్నారి తోటి పిల్లలతో కలిసి గ్రామంలో నిర్వహిసున్న గౌరమ్మ ఉత్సవాల వద్దకు వెళ్లింది. స్నానం కోసం పెద్దచెరువులో దిగి మునిగిపోయింది. వెంటనే అక్కడ ఉన్నవారంతా గాలింపు చర్యలు ప్రారంభించారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారిని ఒడ్డుకు చేర్చారు. చికిత్స కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా... చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నారాయణరావు, రామలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడు హేమంత్‌ కుమార్‌, లక్ష్మీప్రసన్న, రామ్‌చరణ్‌ కవలలు. వీరిలో ఒకరైన  లక్ష్మీప్రసన్న మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.  

Updated Date - 2021-10-17T05:40:31+05:30 IST