ప్రాణం తీసిన భూ తగాదా

ABN , First Publish Date - 2021-03-04T07:05:53+05:30 IST

వ్యవసాయ భూముల విషయంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.

ప్రాణం తీసిన భూ తగాదా
హత్యకు గురైన పాంగి సీతమ్మ

మహిళపై నాటుతుపాకీతో కాల్పులు

అక్కడికక్కడే మృతి

నిందితుడి ఇంటిపై మృతురాలి బంధువుల దాడి, దహనం


డుంబ్రిగుడ, మార్చి 3: వ్యవసాయ భూముల విషయంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గిరిజన మహిళపై నాటుతుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో  కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి నిందితుడి ఇంటితోపాటు మరో రెండు ఇళ్లను ధ్వంసం చేసి, దహనం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. 

డుంబ్రిగుడ మండలంలో పంచాయతీ కేంద్రమైన రంగిలిసింగిలో పాంగి లోకొందోర్‌, పాంగి దామోదర్‌ కుటుంబాల మధ్య వ్యవసాయ భూమికి సంబంధించి ఆరేళ్లుగా వివాదం వుంది. ఈ నేపథ్యంలో లోకొందోర్‌, అతని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పొలంలో పనులకు వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో లోకోందోర్‌ భార్య సీతమ్మ(55) వంట చేయడానికి ముందుగానే ఇంటికి వచ్చింది. అన్నం వండేందుకు బియ్యం కడుగుతుండగా... పాంగి దామోదర్‌ వెనుక నుంచి వచ్చి నాటుతుపాకీతో కాల్చాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో సీతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న లోకొందోర్‌, కుటుంబ సభ్యులు పరుగు పరుగున ఇంటికి వచ్చారు. రక్తపు మడుగులో పడివున్న సీతమ్మను చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి దామోదర్‌తోపాటు అతని సమీప బంధువుల ఇళ్లపై దాడి చేసి నిప్పంటించారు. పాంగి లోకొందోర్‌, అతని కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం డుంబ్రిగుడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు రంగిలిసింగి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమర్టమ్‌ నిమిత్తం అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-03-04T07:05:53+05:30 IST