ఇసుకపై ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-08-02T05:08:34+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమాలకు అంతే ఉండడం లేదు. కొంత మంది వ్యక్తులు అడ్డదారి సంపాదనకు ఇదో మార్గంగా చేసుకుంటున్నారు.

ఇసుకపై ఇష్టారాజ్యం
తుమ్మికాపల్లి చంపావతినదిలో ఇసుక తవ్వకాల దృశ్యం


గుట్టుగా తవ్వకాలు.. రవాణా
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
మైనింగ్‌ శాఖలో సిబ్బంది కొరతతో అక్రమాలకు రాజమార్గం
నాలుగు నెలల్లో 120 కేసులు
విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు1:
జిల్లాలో ఇసుక అక్రమాలకు అంతే ఉండడం లేదు. కొంత మంది వ్యక్తులు అడ్డదారి సంపాదనకు ఇదో మార్గంగా చేసుకుంటున్నారు. ప్రశ్నించే అధికారిని మామూళ్లతో దారికి తెచ్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారి ఆగడాలతో సహజ వనరులు అనూహ్యంగా తరిగిపోతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు ప్రమాదకరంగా తయారవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నచ్చినట్టుగా తవ్వకాలు చేస్తున్నారు. చాలాచోట్ల అనుమతులు లేవు. గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామంలో నదిలోంచి భారీ ఎత్తున ఇసుకను తోడి లారీల్లో తరలిస్తున్నారు. పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదన్న విమర్శ ఉంది. ఒక్కోసారి స్వల్పంగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారు. ఇదే మండల పరిధిలో మరుపల్లి గ్రామంలోని ఓ కొండపై గ్రావెల్‌ తవ్వకాలకు ఈ ఏడాది జనవరి 27న అనుమతి తీసుకున్నారు. మూడునెలల పాటు 0.25 హెక్టార్లలో గ్రావెల్‌, మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకు న్నారు. గడువు ముగిసి సుమారు ఐదు నెలలు కావస్తోంది. అయినా తవ్వకాలు ఆపడం లేదు. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని తెలిసింది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కొండకరకాం కొండను ఓ నాయకుని అండతో  రాత్రివేళల్లో యథేచ్ఛగా తొలిచేస్తున్నారని తెలిసింది. పదుల సంఖ్యలో లారీలతో రాత్రివేళ నగరంలోని పద్మావతినగర్‌లో ఉన్న ఓ వెంచర్‌కు చేరవేస్తున్నట్లు సమాచారం. తుమ్మికాపల్లి గ్రామం సమీపంలో ఉన్న చంపావతి నదిలో అక్రమంగా లారీలతో ఇసుకను తరలిస్తున్నారని తెలుసుకున్న  టీడీపీ నాయకులు నది వద్దకు వెళ్లి లారీని, ఎక్సకవేటర్‌ను ఇటీవల పట్టుకున్న విషయం తెలిసిందే.

 సిబ్బంది కొరత
 జిల్లా మైనింగ్‌ శాఖలో ఉద్యోగులు, సిబ్బంది కొరత నెలకొంది. ఒక ఏడీతో పాటు, ఆర్‌ఐలు ఇద్దరు, టీఐ ఒకరు ఉండాలి.. కానీ ఏడీతో పాటు ఒక్క ఆర్‌ఐ మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడైనా తనిఖీలకు వెళ్లాలంటే పోలీసులు, విజిలెన్సు అధికారులపై ఆధారపడాల్సిన దుస్థితి మైనింగ్‌ శాఖలో నెలకొంది.

4 నెలలు... 120 కేసులు
నెల    కేసులు   పెనాల్టీలు
ఏప్రిల్‌     13    రూ.6.72 లక్షలు
మే        18    రూ.4.47 లక్షలు
జూన్‌     36     రూ.17 లక్షలు
జులై      53    రూ.17.2 లక్షలు
=======

చర ్యలు తీసుకుంటున్నాం
అనుమతులు లేకుండా మట్టి, ఇసుక, కంకర తరలిస్తున్న వాహనాలను పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తున్నాం. పోలీసులు, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులు కూడా నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. పట్టుకున్న వాహనాలకు భారీగా పెనాల్టీలు వేస్తున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం.
            - మళ్లేశ్వరావు, ఏడీ, మైనింగ్‌


Updated Date - 2022-08-02T05:08:34+05:30 IST