సంతోషం కష్టం కాదు!

ABN , First Publish Date - 2020-11-19T05:30:00+05:30 IST

కరోనా సమయంలో ఒత్తిడికి లోనవకుండా సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలో బాలీవుడ్‌ సుందరి శిల్పాశెట్టీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘శిల్పా కా మంత్ర’ పేరుతో పంచుకున్నారు

సంతోషం కష్టం కాదు!

కరోనా సమయంలో ఒత్తిడికి లోనవకుండా సంతోషంగా ఉండేందుకు ఏం చేయాలో బాలీవుడ్‌ సుందరి శిల్పాశెట్టీ   ఇటీవల  తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘శిల్పా కా మంత్ర’ పేరుతో పంచుకున్నారు. ఇంతకీ ఆమె ఏం చెబుతున్నారంటే... 


‘మిమ్మల్ని సంతోషపరిచే విషయం ఏమిటి?’ అని శిల్పా తన ఇన్‌స్టా వేదికగా ఈమధ్య అభిమానులను అడిగారు. ఈ ప్రశ్న అడగడంలో ఆమె ఉద్దేశం సంతోషాన్ని ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేకుండా కొన్ని పనులు చేయడం ద్వారా పొందవచ్చని చెప్పడం. వ్యక్తిగత సంరక్షణ, భావోద్వేగాల పరంగా ఫిట్‌గా ఉండడం వంటివి సంతోషంగా ఉండేందుకు చాలా ముఖ్యం అంటారీ యోగా గురు. 


చిన్న చిన్న పనులతోనే సంతోషం

‘‘సంతోషంగా ఉండడం చాలా సులువు. జీవితంలో చిన్న చిన్న పనుల్లోనే మన సంతోషం దాగుందనే విషయాన్ని గుర్తించాలి. ఇష్టమైన వారితో సమయం గడపడం, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, స్కూల్‌, కాలేజీ రోజుల స్నేహితులను కలవడం, ఉదయాన్నే కాసేపు ఎండలో నిల్చోవడం, నచ్చిన ఆహారం తినడం, పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోవడం, మన గురించి మనం జాగ్రత్తలు తీసుకోవడం, మధ్యలో వదిలేసిన లక్ష్యాలను చేరుకొనేందుకు ప్రయత్నిచడం, ప్రకృతిలో నడవడం వంటివి సంతోషానికి కారణమయ్యే హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. లవ్‌ హార్మోన్స్‌ విడుదలకు కారణమవుతాయి. ఇవి ఒత్తిడి, చికాకు, నొప్పికి చక్కని మందుగా పనిచేస్తాయి. ఫలితంగా మానసిక ఆరోగ్యం, ఎమోషనల్‌ ఫిట్‌నెస్‌ మెరుగుపడుతుంది’’  అంటున్నారు శిల్పా.


‘హ్యాపీనెస్‌ కెమికల్స్‌ అండ్‌ హౌ టూ హ్యాక్‌ దెమ్‌’ (సంతోషానికి కారణమయ్యే రసాయనాలు, వాటిని  ఆధీనంలోకి తెచ్చుకోవడం ఎలా). మన శరీరంలో విడుదలయ్యే నాలుగు రకాల హార్మోన్లను మన ఆధీనంలో ఉంచుకునేందుకు శిల్పాశెట్టీ చెబుతున్న సలహాలివి...


డోపమైన్‌ రసాయనం 

  1. ఒక పనిని పూర్తిచేయడం
  2. వ్యక్తిగత రక్షణ పనులు  
  3. నచ్చిన ఫుడ్‌ తినడం
  4. చిన్న విజయాలను వేడకలా చేసుకోవడం


ఎండార్ఫిన్‌ - పెయిన్‌ కిల్లర్‌

  1. నవ్వు తెప్పించే వ్యాయామాలు 
  2. కామెడీ సీన్లు చూడడం
  3. ముదురు రంగు చాక్లెట్లు తినడం
  4. వ్యాయామం 


సెరటోనిన్‌ - ఆలోచనలను స్థిరంగా ఉంచేది

  1. ధ్యానం  
  2. పరుగెత్తడం
  3. ఎండలో నిల్చోవడం
  4. ప్రకృతిలో నడవడం
  5. ఈత  
  6. సైకిల్‌ తొక్కడం
  7. అరటిపండ్లు తినడం


ఆక్సిటోసిన్‌- లవ్‌ హార్మోన్‌

  1. పెంపుడు కుక్కతో ఆడుకోవడం
  2. చంటి పిల్లలతో ఆడడం
  3. చేతులను పట్టుకోవడం
  4. కుటుంబసభ్యులను కౌగిలించుకోవడం
  5. అభినందనలు తెలియజేయడం

Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST