నాన్న ఊహించనంత గొప్ప కానుక ఇచ్చిన కూతురు

ABN , First Publish Date - 2021-10-09T01:19:05+05:30 IST

సాధించాలన్న తపన, అంతకుమించిన పట్టుదల ఉంటే అందనిదంటూ ఏదీ ఉండదని నిరూపించింది కేరళకు చెందిన

నాన్న ఊహించనంత గొప్ప కానుక ఇచ్చిన కూతురు

తిరువనంతపురం: సాధించాలన్న తపన, అంతకుమించిన పట్టుదల ఉంటే అందనిదంటూ ఏదీ ఉండదని నిరూపించింది కేరళకు చెందిన ఆర్య. త్వరలోనే ఐఐటీ కాన్పూరులో చేరబోతోంది. ఆమె ఐఐటీలో చేరడంలో ఎలాంటి విశేషమూ లేదు. అయితే, విశేషమల్లా ఆమె పెట్రోలు బంకులో పనిచేసే వ్యక్తి కుమార్తె కావడమే. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు దేశప్రజల హృదయాలను గెలుచుకున్న ఆర్య సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్షేషన్.


తండ్రి రాజగోపాలన్‌తో కలిసి పెట్రోలు బంకులో నిల్చున్న ఆర్య ఫొటోను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య షేర్ చేశారు. ఆర్య తన అంకితభావం, సాధనతో పెట్రోలియం కంపెనీలోని ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆ వెంటనే ఈ వార్త వైరల్ అయింది. ఆర్య రాజ్యగోపాలన్ స్టోరీ చివరికి కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టికి చేరింది. వెంటనే ఆయన ట్వీట్ చేస్తూ.. తండ్రీకుమార్తెను భారతదేశానికి స్ఫూర్తి ప్రదాతలంటూ కొనియాడారు. ‘‘ఆర్య రాజగోపాలన్ ఆమె తండ్రి రాజగోపాలన్‌తోపాటు ఇంధనరంగంతో మమేకమైన ప్రతిఒక్కరినీ గర్వపడేలా చేశారు’’ అని పేర్కొన్నారు. 


అన్నూరుకు చెందిన ఆర్య తండ్రి రాజగోపాలన్ కన్నూరు జిల్లా పయ్యనూర్‌లోని ఐవోసీ పెట్రోలో బంకులో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి కేకే శోభన బజాజ్ మోటార్స్‌లో పనిచేస్తున్నారు. ఎన్ఐటీ కాలికట్‌లో ఇప్పటికే బీటెక్ పూర్తిచేసిన ఆర్య ఇప్పుడు పెట్రోకెమికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌ను ఐఐటీ కాన్పూరులో అభ్యసించనుంది.  

Updated Date - 2021-10-09T01:19:05+05:30 IST