ఇన్ఫోసిస్‌ నుంచి కిండిల్‌ దాకా..!

ABN , First Publish Date - 2020-07-09T05:30:00+05:30 IST

రచనా వ్యాసంగం మీద ప్రేమతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసిందా అమ్మాయి. సందేశాత్మక కథలతో రచయిత్రిగా ఎదిగే ప్రయత్నంలో పడింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన పాఠకులకు, తన ‘కిండిల్‌’ కథలతో కాలక్షేపాన్ని పంచుతున్న ఆ అమ్మాయే సోనాలీ దాబడే...

ఇన్ఫోసిస్‌ నుంచి కిండిల్‌ దాకా..!

రచనా వ్యాసంగం మీద ప్రేమతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసిందా అమ్మాయి. సందేశాత్మక కథలతో రచయిత్రిగా ఎదిగే ప్రయత్నంలో పడింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన పాఠకులకు, తన ‘కిండిల్‌’ కథలతో కాలక్షేపాన్ని పంచుతున్న ఆ అమ్మాయే సోనాలీ దాబడే! తన కిండిల్‌ కథల విశేషాలను ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చింది.


‘‘చిన్నప్పటి నుంచీ నాకు పుస్తకాలంటే ప్రాణం. ఈ అభిరుచి నాన్న నుంచే అబ్బింది. ఆయన పుస్తకాలు విపరీతంగా చదివేవారు, నాతో చదివించేవారు. దాంతో పుస్తకాల మీద ఆసక్తి, రచన మీద ఆపేక్ష వయసుతో పాటు పెరిగాయి. ఏడో తరగతి నుంచే చిన్న చిన్న గేయాలు రాయడం మొదలుపెట్టాను. అయితే అందరు పిల్లల్లాగే చదువులో రాణించి, ఆ తర్వాత ‘ఇన్ఫోసిస్‌’లో ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసినా, మనసంతా కథల చుట్టూ తిరుగుతూ ఉండేది. ఉద్యోగంలో బిజీగా ఉండి రచనలకు దూరం కావడంతో, నాలోని రచయిత్రికి ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావన కలిగేది. దాంతో 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసి రచనా వ్యాసంగాన్ని చేపట్టాను. మొదట ‘నైట్స్‌ అండ్‌ లిల్లీస్‌’ అనే నవల రాసుకున్నా. ఆ తర్వాత ‘ఫైవ్‌ ఆఫ్‌ హార్ట్స్‌’ అనే కథల పుస్తకం రాశా. ఇప్పుడు ‘కిండిల్‌’లో ఉంచిన ‘నోనెట్‌’ నా మూడో రచన. 


‘కిండిల్‌’లోనే ఎందుకంటే....

సాధారణంగా ప్రచురణకర్తలు చిన్న కథలను ప్రచురణకు స్వీకరించరు. అందుకే అమెజాన్‌ కిండిల్‌లో నా పుస్తకాన్ని జూన్‌ 15న పబ్లిష్‌ చేశాను. సామాజిక మాధ్యమాల్లో నాకు పరిచయం ఉన్న చాలామంది పుస్తకాలు చదవడానికి కిండిల్‌కే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దాంతో వాళ్లందరికీ పుస్తకం చేరడం కోసం ఆ మార్గాన్ని ఎంచుకున్నా. పైగా కిండిల్‌ యాప్‌ను ఫోన్‌లో కూడా డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా, ఎక్కడున్నా, ఎప్పుడైనా చదువుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ పుస్తకం చదవాలనుకునేవాళ్లు అమెజాన్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి. ఈ సభ్యత్వంతో కిండిల్‌ యాప్‌ ద్వారా పుస్తకాన్ని కొని, డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. పుస్తకాన్ని అరువు తీసుకుని చదివే సౌలభ్యం కూడా ఉంది. అది కిండిల్‌ బారో. దీన్లో పుస్తకాన్ని అరువు తీసుకున్నప్పుడు, ఆ పుస్తకాన్ని చదువుకోవడానికి 15 రోజుల వ్యవధి దొరుకుతుంది. 


నోనెట్‌ అంటే?

‘నోనెట్‌’ అనే పదం సంగీతానికి సంబంధించినది. దీని అర్థం... తొమ్మిది. నా కథల సంపుటిలో తొమ్మిది కథలు ఉండడం, ఒక్కో కథకు వైవిధ్యమైన భావోద్వేగాలను రేకెత్తించే స్వభావం ఉండడంతో నా సంపుటికి ఆ పేరు పెట్టా. ఈ తొమ్మిది కథల్లో భయం, వేదన లాంటి వేర్వేరు భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి కథ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిన ఏదో ఒక సందర్భాన్ని గుర్తుకుతెచ్చేలా ఉంటుంది. 


సినిమాకు స్ర్కిప్ట్‌ అందించా...

2018లో విడుదలైన ‘ఆ’ అనే సినిమాకు స్ర్కిప్ట్‌ అందించా. ఈ సినిమా స్ర్కిప్ట్‌ రైటింగ్‌ టీమ్‌లో నేనూ ఒక సభ్యురాలిని. దర్శకులు ప్రశాంత్‌ వర్మ నా స్కూలు స్నేహితులకు స్నేహితుడు. అలా ఆయన యాడ్‌ ఫిల్మ్స్‌కు నేను పని చేశాను. ఆ తర్వాత ఆయన మొదలుపెట్టిన స్ర్కిప్ట్స్‌విల్‌లో కూడా సేవలు అందించాను. ఆ క్రమంలో ‘ఆ’ సినిమాకు స్ర్కిప్ట్‌ అందించడం జరిగింది. కానీ నాకు సినిమాలకు స్ర్కిప్ట్‌ అందించడం కన్నా, పుస్తక రచనలోనే సంతృప్తి ఎక్కువ. 




పుస్తకాలు చదవాలి!

పుస్తకాలు చదవడం వల్ల మెరుగైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. సామాజిక మాధ్యమాలతో కాలక్షేపం చేయడం తప్పు కాదు. ఎన్నో విషయాలను ఇంటర్నెట్‌  ద్వారా తెలుసుకునే వీలు లేకపోలేదు. అయితే ప్రపంచం గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదివే మాధ్యమాన్నీ ఎంచుకోవాలి. పుస్తకాల్లో రచయితలు పేర్కొనే సామాజిక అంశాల ద్వారా సందేశాలను గ్రహించవచ్చు. పుస్తకాలు చదవడం వల్ల ప్రపంచాన్ని చూసే దృక్కోణం మారుతుంది. అభిప్రాయాల్లో స్పష్టత చేకూరుతుంది. కాబట్టి ఎవరైనా సరే పుస్తకాలు చదవడం జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ విషయంలో పెద్దలు పిల్లలకు మార్దనిర్దేశకులుగా మారాలి. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని పుస్తకాలు చదివే అభిరుచిని పెంపొందించుకోవడం కోసం వినియోగించాలి.’’


మాది కర్నాటక. మా పూర్వీకులు హైదరాబాద్‌కు వలస వచ్చి, స్థిరపడిపోయారు. దాంతో నా చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. అమ్మ ప్రతిభ హోమ్‌మేకర్‌. నాన్న విజయ్‌ దాబడే బ్యాంకు ఉద్యోగిగా రిటైరయ్యారు. నాకు ఓ తమ్ముడు ఉన్నాడు.

సోనాలీ దాబడే @ 9491112057

themelodramaticbookworm@gmail.com


-గోగుమళ్ల కవిత



Updated Date - 2020-07-09T05:30:00+05:30 IST