80 వేల మందికి శిక్షణనిచ్చిన Teacher.. America వంటి దేశాలే అతడికోసం పోటీ పడుతున్నాయి

ABN , First Publish Date - 2021-09-01T02:01:21+05:30 IST

ఎంతోమంది విద్యార్థులను అత్యున్నత స్థాయికి చేరేలా తీర్చిదిద్దే మహోన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఉపాధ్యాయులకు సమాజంలో ..

80 వేల మందికి శిక్షణనిచ్చిన Teacher.. America వంటి దేశాలే అతడికోసం పోటీ పడుతున్నాయి

సిమ్లా: ఎంతోమంది విద్యార్థులను అత్యున్నత స్థాయికి చేరేలా తీర్చిదిద్దే మహోన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఉపాధ్యాయులకు సమాజంలో ఎంతో గొప్ప గౌరవం దక్కుతుంది. అలాంటి ఉపాధ్యాయుల్లో కూడా కొందరు మేటి ఉపాధ్యాయులుగా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు. తాజాగా అలాంటి ఓ ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకొచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాలోని దూర్ దరాజ్ ప్రాంతంలోని ధరోగడాకు చెందిన వీరేంద్ర కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విద్యార్థులకే కాదు.. ఆయన ఉపాధ్యాయులకు కూడా శిక్షణనిస్తారు. ఇప్పటివరకు ఆయన దాదాపు 80 వేల మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణనిచ్చారు. అందమైన చేతిరాత రాసేలా వారిని తీర్చి దిద్దారు.


చదువులో ఎంత ఉన్నతస్థాయి సాధించినా.. కొందరి చేతిరాత మాత్రం చాలా దారుణంగా, అందవిహీనంగా ఉంటుంది. అలాంటి వారి చేతి రాతను అందంగా తీర్చిదిద్దేందుకే నిర్దేశించిన చదువు కాలిగ్రఫీ. ఈ కాలిగ్రఫీలోనే వీరేంద్ర కుమార్ నిపుణత సాధించారు. 2018 మే నుంచి దీనిపై శిక్షనివ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 80వేల మందికి పైగా శిక్షణనిచ్చారు.


వీరేంద్ర కుమార్ కాలిగ్రఫీలో అడుగుపెట్టడానికి ముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అక్కడ విద్యార్థులకు ఆడుతూ పాడుతూ విద్య నేర్పించేవారు. ఆయన బోధనా పద్ధతికి విపరీతంగా గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే 2015లో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పురస్కారంతో గౌరవించింది. ఇక తాజాగా కోవిడ్-19 లాక్‌డౌన్‌ను కూడా వీరేంద్ర కుమార్ చక్కగా ఉపయోగించుకున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షనిస్తూనే కాలిగ్రఫీ బోధన కూడా మొదలుపెట్టారు. మొదట్లో సిమ్లాకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంల ద్వారా దేశవిదేశాల్లోని వారికి శిక్షణనిచ్చారు.


21 రోజుల్లో ఎలాంటి చేతి రాతగల వారికైనా తాను చక్కటి చేతి రాత నేర్పిస్తానని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే అనేక దేశాల్లో నివశించే భారతీయులు వీరేంద్రను సంప్రదించారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఓ పాఠశాల వీరేంద్ర కుమార్‌కు భారీ జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నెలకు దాదాపు రూ.5 లక్షల రూపాయల జీతం ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ వీరేంద్ర కుమార్ ఆ ఆఫర్ తిరస్కరించారు. ఇదొక్కటే కాదు.. వీరేంద్రకు ఇలాంటి ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ వాటిని ఆయన పూర్తిగా తిరస్కరించారు. తాను దేశంలోని విద్యా విధానాన్ని బాగు చేసేందుకు ఎంతో చేయాల్సి ఉందని, అందుకే ఇక్కడే తాను పనిచేస్తానని గర్వంగా చెబుతున్నారు.

Updated Date - 2021-09-01T02:01:21+05:30 IST