Abn logo
Jul 23 2021 @ 16:31PM

తృటిలో తప్పిన పెను ప్రమాదం... పాక్ డ్రోన్‌‌ను విజయవంతంగా కూల్చేసిన భారత్...

న్యూఢిల్లీ : పెను ప్రమాదం సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఓ పాకిస్థానీ డ్రోన్‌ను భారత్ విజయవంతంగా కూల్చేసింది. దీనిలో 5 కేజీల బరువుగల ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొసివ్ డివైస్ (ఐఈడీ) ఉంది. దీనిని జమ్మూ సమీపంలోని కనచక్ వద్ద గురువారం-శుక్రవారం మధ్య రాత్రి కూల్చేసినట్లు జమ్మూ-కశ్మీరు పోలీసులు ప్రకటించారు. 


జమ్మూ-కశ్మీరు పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ ముఖేశ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ డ్రోన్ ద్వారా ఐఈడీ పేలుడు పదార్థాన్ని భారత దేశంలోని అఖ్నూర్ సెక్టర్‌కు పంపినట్లు తమకు నిర్దిష్ట సమాచారం అందిందని తెలిపారు. గురువారం రాత్రి అందిన ఈ సమాచారం ఆధారంగా తాము నిఘా పెట్టామన్నారు. గురువారం-శుక్రవారం మధ్య రాత్రి సుమారు ఒంటి గంటకు ఓ పోలీసు బృందం ఈ డ్రోన్‌ను కూల్చేసిందన్నారు. దీనిలో ఐదు కేజీల ఐఈడీ ఉందన్నారు. ఇది ఉపయోగించడానికి సిద్ధంగా ఉందన్నారు. దీనిని పేల్చడానికి కేవలం ఒక వైరును కనెక్ట్ చేయవలసి ఉందన్నారు. ప్రాథమిక పరిశీలనలో తెలిసిన వివరాలనుబట్టి దీనిని హెక్సాకాప్టర్‌గా గుర్తించినట్లు తెలిపారు. దీనికి ఆరు రెక్కలు ఉన్నాయని, ఓ ఫ్లైట్ కంట్రోలర్, జీపీఎస్ ఉన్నాయని చెప్పారు. చైనా, హాంగ్ కాంగ్, తైవాన్‌లలో తయారైన విడి భాగాలను అసెంబుల్ చేసి దీనిని  తయారు చేసినట్లు వెల్లడైందన్నారు. ఈ డ్రోన్లు సుమారు 12 కేజీల వరకు బరువుతో దాదాపు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని చెప్పారు. ఈ డ్రోన్‌ను కూల్చిన ప్రదేశం, సరిహద్దు మధ్య గగనతల దూరం దాదాపు ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుందన్నారు. 


ఓ ఏడాది క్రితం హీరానగర్ సెక్టర్‌లోని కథువాలో కూల్చేసిన డ్రోన్ నంబరును, తాజాగా కూల్చేసిన డ్రోన్ నంబరును పరిశీలించినపుడు, కేవలం ఒక అంకె మాత్రమే తేడా కనిపించిందన్నారు. దీనినిబట్టి ఉగ్రవాదులు డ్రోన్లలో ఉపయోగించేందుకు ఒకే విధమైన సిరీస్ కలిగిన చాలా ఫ్లైట్ కంట్రోలర్లను సంపాదించినట్లు నిస్సందేహంగా రుజువవుతోందన్నారు. 


జూన్ 27న జమ్మూలోని భారత వాయు సేన (ఐఏఎఫ్) స్టేషన్‌పై జరిగిన డ్రోన్ దాడి వల్ల ఏర్పడిన గోతిలో దొరికిన స్ట్రింగ్స్, ఇటువంటి డ్రోన్ల నుంచి పదార్థాలను క్రింద పడేయడానికి ఉపయోగించే స్ట్రింగ్స్ డిజైన్ ఒకే విధంగా ఉన్నాయన్నారు. దీనినిబట్టి  ఐఏఎఫ్ స్టేషన్‌పై జరిగిన దాడికి కూడా ఇటువంటి డ్రోన్‌నే ఉపయోగించినట్లు ధ్రువపడిందన్నారు. 


జూన్ 27న జరిగిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలోని కీలకమైన వ్యవస్థలపై దాడి చేయడానికి పాకిస్థానీ ఉగ్రవాదులు మానవ రహిత గగనతల వాహనాలను ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. జూన్ 27 నుంచి అనేకసార్లు డ్రోన్లు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి వస్తున్న ఈ డ్రోన్లలో చాలావాటిని భద్రతా దళాలు కూల్చేస్తున్నాయి. అయితే జమ్మూ-కశ్మీరు పోలీసులు ఈ విధంగా పేలుడు పదార్థాన్ని మోసుకొస్తున్న ఓ డ్రోన్‌ను కూల్చడం ఇదే మొదటిసారి.