Abn logo
Feb 25 2021 @ 01:23AM

మేధో వారధిగా ఒక చరిత్రకారుడు

మెట్రోనగరాల్లో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలో ‘పాన్ ఇండియన్’ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్‌ను ప్రభావితం చేసే ఒక ప్రొఫెసర్‌కు, అదే బోధనాంశాన్ని గ్రామీణ ప్రాంతంలోని సాధారణ కళాశాల విద్యార్థులకు బోధించే ఆచార్యుడి పనితీరుకు స్థాయీ బేధాలుంటాయా? ఒకరు సైద్ధాంతిక రూపకర్తలై సరికొత్త భావజాల ఆవిష్కరణలకు ఊపిరులూదితే, మరొకరు వాటిని అందిపుచ్చుకుని విస్తరింప చేసినపుడు, ఆ రెండింటి ప్రతిఫలనాల విలువను తూకం వేయడం ఎలా?! విస్తృత కాన్వాస్ నేపధ్యంగా ‘థింక్ ట్యాంక్’గా పనిచేసే వాళ్లకు, క్షేత్రస్థాయిలో దాని ‘అప్లికేషన్’ను లోతుల్లోకి తీసుకువెళ్ళే వాళ్లకు మధ్య హెచ్చుతగ్గులు నిర్ణయించటమెట్లా? ఒక కొత్త సిద్ధాంతంతో ఆచార్యుడు ఒక వెయ్యి మంది మేధావుల్ని ప్రభావితం చెయ్యడంలోనూ, అందులో ఒకరు దాన్ని స్వీకరించి వెయ్యి మంది విద్యార్థుల మధ్యకో అంతకు రెట్టింపు సమూహాల మధ్యకో దాన్ని తీసుకువెళ్లినప్పుడు రెండింటి మధ్య ఉండే ప్రభావాల నిష్పత్తి ఎంత? 


బిపన్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్లు ఢిల్లీ నుంచో అలీగఢ్ నుంచో చరిత్ర రచనలో స్థూలస్థాయి కృషి చేస్తే, దాని స్ఫూర్తి సడలని రీతిలో సూక్ష్మస్థాయిలో వివిధ శ్రేణుల్లోకి తీసుకెళ్లినది, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం అనే పెద్ద గ్రామం నుంచి పని చేసిన చరిత్ర ఆచార్యుడు డాక్టర్ గరికపాటి రుద్రయ్య చౌదరి. అవగాహనలో వామపక్ష భావజాలం, మాటలో నిక్కచ్చితనం, నిర్ణయంలో నిశ్చయతత్వం, వాదనలో ప్రజాస్వామ్య పోకడలు ఈ లక్షణాలు ఇంకా ఎవరిలోనైనా ఉంటే ఉండవచ్చు, కానీ రుద్రయ్య చౌదరి అధ్యాపకుడు కావడంతో కొన్ని దశాబ్దాలు పాటు ఎంతో మందిలోకి ఆయన అలా ప్రవహించారు. 


రామచంద్రపురం చుట్టుపక్కల రాయవరం మునసబుగా పేరున్న సమితి ప్రెసిడెంట్ ఉండవల్లి సత్యనారాయణ మూర్తి స్థానిక కాంగ్రెస్ నాయకుడే అయినా ఆయన మాటకు రాష్ట్రస్థాయిలో విలువ ఉండేది. దాంతో 1966 నాటికి రామచంద్రపురంలో ఆయన పేరుతోనే డిగ్రీ కళాశాల వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్న యాజమాన్య కళాశాలకు వామపక్ష భావాలున్న రుద్రయ్య చౌదరి సారథ్యం వహించారు. అలా ప్రత్యర్థులుగా భిన్నంగా కనిపిస్తున్న రెండు పార్టీల ‘పొలిటికల్ ఎకానమీ’ ఒక్కటే అని వారి ‘వర్కింగ్ రిలేషన్స్’ నిరూపించాయి. ఒక వైపు కళాశాల అభివృద్ధి చేస్తూనే తన అధ్యయన అంశమైన ‘చరిత్ర’ పాఠ్యాంశంగా 1974 నాటికి వాల్తేర్ ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ తెచ్చి ప్రాంతీయ చరిత్ర అధ్యయనం దిశగా రుద్రయ్య చౌదరి మరో అడుగు ముందుకు వేశారు.


ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీకి రాష్ట్ర కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పీస్ కౌన్సిల్‌కు బాధ్యుడుగా, జిల్లా అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడు కూడా అయిన రుద్రయ్య చౌదరి ఎనభై దశకం నాటికి వైరుధ్య రూపం తీసుకున్న ‘వర్గ –కుల’ స్పృహల సంధి దశకు ప్రతినిధిగా కనిపిస్తారు. ఈ దశలో ఆయన వ్యక్తిగతంగా, అధ్యయన అంశపరంగా వామపక్ష వైఖరిని వదులుకోకుండానే, కళాశాల నిర్వహణలో తన సామాజిక వర్గ ఆమోదాన్ని పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల మొదటి రీసర్చ్ గైడ్‌గా, స్టేట్ ఆర్కివ్స్ సలహామండలి సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, పలు చరిత్ర పాఠ్య గ్రంథాలకు సంపాదకుడిగా, ద్రవిడియన్ ఎన్‌సైక్లోపీడియా, జర్నల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చ్ సొసైటీ వంటి ప్రతిష్టాత్మక సంచికల వ్యాసరచయితగా బాధ్యతలు తీసుకున్నారు. 


జాతీయస్థాయి చరిత్ర రచనా విధానాలు, (‘మెథడాలజీ’) తన ప్రాంతాలకూ ఇక్కడి ‘చరిత్ర’ విద్యార్థులకు వేగవంతంగా చేరాలని, ఎప్పటికప్పుడు జాతీయస్థాయి పరిశోధనలకు అనుబంధంగా ఇక్కడ చౌదరి పర్యవేక్షణలో ‘సెమినార్ల’ నిర్వహణ జరిగేది. తూ.గో. జిల్లాలో రామచంద్రపురాన్ని ఆనుకుని ఉన్న కొత్తూరు లాంటి చిన్న గ్రామంలో తన ఇంటి మీదనుంచి దేశం వైపు ఆయన చూసే చూపు, తన విద్యార్థులు జెఎన్‌యూ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించాలనే తపనలో ప్రతిఫలించేది. పలు దేశాల్లో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న ఈ ప్రొఫెసర్‌కు తను చదువుచెప్పే విద్యార్థులది ఆంగ్ల ప్రావీణ్యం తక్కువయిన గ్రామీణ నేపధ్యం అని తెలుసు. అయినా అది ఆయన లక్ష్యాన్ని ఏనాడూ నిలువరించలేదు. 


సామాజిక వర్గాలవారీగా కళాశాలలు స్థాపితమై అవి ఆ వర్గ విద్యార్థుల ప్రయోజనాలను మాత్రమే కాపాడుతాయనే అభిప్రాయం ప్రబలుతున్న కాలంలో, ఈ రకమైన పాక్షిక దృష్టికి రుద్రయ్య చౌదరి ఒక మినహాయింపు. మేము విద్యార్థులుగా ఉన్న కాలంలో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నతశ్రేణిలో ఉత్తీర్ణులైతే, అందులో ఆయన సామాజిక వర్గం కాని ఇతరులు ఆరుగురు ఉండడం అందుకు నిదర్శనం.


వ్యవసాయ కుటుంబంలో 1934లో జన్మించి 1995లో మరణించిన ఈ చరిత్ర ‘నిర్మాత’ పేరిట ఏ విశ్వవిద్యాలయంలోని పీఠానికి తక్కువ కాకుండా, ఏడాది కొకటి చొప్పున నిరాఘాటంగా సాగిన ఇరవై ఐదు స్మారకోపన్యాసాలు 2020తో ముగిశాయి. వీటిలో చివరి ఉపన్యాస అంశం ‘విస్మరించబడిన సామాజిక శాస్త్రాల అధ్యయనం–- పాతికేళ్ల విపరిణామాలు’ కావడం కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఇవి కూడా చౌదరి అధ్యాపక సహచరుడు ప్రొఫెసర్ జాస్తి దుర్గాప్రసాద్, స్థానిక ప్రజావైద్యుడు డాక్టర్ చెలికాని స్టాలిన్‌లు ఇతరుల తోడ్పాటుతో ఇన్నాళ్ళు నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక విద్య ఉధృతి ఉప్పెనలో అక్కడి చరిత్ర శాఖ ఇప్పటికే మూతపడింది. ‘కాలం కనిన’ ఆలోచనాపరులను వారి భావధారను ఎంతమేర ఆ సమాజాలు కొనసాగిస్తాయి అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. 

జాన్‌సన్ చోరగుడి

కొప్పర్తి వెంకటరమణమూర్తి

(నేడు రుద్రయ్య చౌదరి వర్ధంతి)

Advertisement
Advertisement
Advertisement