మలుపుల మరకల కొండపొలం

ABN , First Publish Date - 2020-08-24T06:32:22+05:30 IST

కొంతమందంతే- అంగరంగ వైభవంగా, అట్టహాసంగా రంగ ప్రవేశం చేస్తారు. సాహితీ ప్రపంచం కూడా వారికి భాజా భజంత్రీలతో స్వాగత తోరణాలు కట్టి, చందన తాంబూలాది సత్కారాలు...

మలుపుల మరకల కొండపొలం

తన నేలకు తాను ఆస్థాన లేఖకుడిననీ, నేల చెప్పే విషయాలను రాసి ప్రకటించడమే తన పని అని వినమ్రంగా చెప్పుకునే రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఈసారి తెలుగు సాహిత్య చరిత్రలో ఎక్కడో తప్ప కనిపించని గొల్లల జీవితాలను అక్షరాలకెత్తాడు. ఓ చీకటి రాత్రి.. పైన నక్షత్రాలు, చుట్టూ చెట్లు. కొండపై ఒంటరిగా కూర్చుని అడవి నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ చేసే ఓ భయోద్విగ్న వనవాస అనుభవాన్నిస్తుంది ‘కొండపొలం’.


కొంతమందంతే- అంగరంగ వైభవంగా, అట్టహాసంగా రంగ ప్రవేశం చేస్తారు. సాహితీ ప్రపంచం కూడా వారికి భాజా భజంత్రీలతో స్వాగత తోరణాలు కట్టి, చందన తాంబూలాది సత్కారాలు అందజేసి ఆయాసపడుతుంది. మరికొందరు ఉంటారు- ఎప్పుడొచ్చారో తెలీదు. ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఎప్పుడో పరిమళం గుప్పుమంటుంది. సాహితీ లోకమంతా ఒక్కసారి అచ్చెర్వొంది అతడి గత, వర్తమాన రచనలను చకిత నయనాలతో పరిశీలిస్తుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఈ రెండో కోవకు చెందిన నిశ్శబ్ద పథికుడు. ఆరుపదులకు సమీపిస్తున్న వయసు, మూడు దశాబ్దాల పైబడిన సాహితీ వ్యాసంగం. ఎనిమిది నవలలు, మూడు కథా సంపుటాలు, ఓ కవితా సంపుటి. వీటిల్లో ఎన్నిటికో బహుమతులు, మరెన్నిటికో పురస్కారాలు. కడప జిల్లాలోని మారుమూలనున్న బాలరాజు పల్లె నుంచే ఇట్లా ఒడిసెల తిప్పాడంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది.


తన నేలకు తాను ఆస్థాన లేఖకుడిననీ, నేల చెప్పే విషయాలను రాసి ప్రకటించడమే తన పని అని వినమ్రంగా చెప్పుకునే రచయిత ఈసారి తెలుగు సాహిత్య చరిత్రలో ఎక్కడో తప్ప కనిపించని గొల్లల జీవితాలను అక్షరాలకెత్తాడు. అందులోనూ సామాన్యమైన గొల్లల జీవితాన్ని మాత్రమేగాక, కరువు ప్రాంతాల గొల్లలు నెల రోజులు పైగా చేసే ‘కొండ పొలం’ను ప్రత్యేక అంశంగా నవలను మలిచాడు. గొల్లల మాట తీరు, జీవనశైలి కొత్త కావచ్చు కానీ, వ్యవహారంలో రైతులకీ, గొల్లలకీ తేడా ఏమీ లేదు. రైతు మట్టిని నమ్ముకుంటాడు, గొల్ల గొర్రెను నమ్ముకుంటాడు. ఇద్దరూ కన్నీళ్లను దిగమింగుకుని, వాన్నీళ్ల కోసం ఆకాశంలోకి తొంగి చూడాల్సిందే. ఆరుగాలం, అహరహం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకున్నా లభించే ఫలితం చాలా స్వల్పం. అయితే, తెలుగు కథల్లో రైతు జీవిత చిత్రణకు కొదవేమీ లేదు. కానీ, అంతకంటే అధమంగా బతుకులీడుస్తున్న గొల్లల గురించి ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఆ లోటును చాలా వరకూ పూడుస్తుంది ఈ నవల.


గొర్రె తోక బెత్తెడే అయినా దాని పొట్ట కోసం ఎన్నో తిప్పలు. వాటికి సరైన ఆహారం దొరక్కపోవడం ఒక సమస్య అయితే, దొరికినా ఏ గొర్రె ఎట్లా, ఎంత తింటోందో కనిపెట్టుకోవాలి. ఏది ఎద కొచ్చిందీ, ఏది దేని మీద ఎక్కింది పసిగట్టాలి. చిన్నచిన్న పిల్లలకు లేత ఆకులు కోసి, వాటికి అందేలా వేలాడదీయాలి. వాటి నడకను చూసి వాటికొచ్చిన నలతను గ్రహించాలి. వాటి కడుపు నిండితేనే కాపరికి గొంతులో ముద్ద దిగుతుంది. ఆడ బిడ్డల పెళ్లిళ్లకైనా, కొడుకుల చదువులకైనా ఆ గొర్రెలె వారి ఏకైక ఆధారం. వాటితో ఇంతలా అనుబంధం పెనవేసుకున్నా.. అవసరానికి అమ్ముకోక, కావాలనుకున్నప్పుడు కోసుకోక తప్పదు. ‘గొర్రె కడుపునిండా మెయ్యకుంటే ఆ రాత్రి నిద్దర పట్టదు. మెగం కొరికితే పైకి ఎట్టున్నే రొండ్రోజులన్నా లోపల్లోపల ఏడ్చుకుంటాము... గొల్లోడన్నేంక గొర్ల మీంద మర్లుండాల్సిందే. దానిగ్గూడా పట్టు విడుపులుండాల’ అని గొల్ల పెద్ద పుల్లయ్య అసలు సత్యాన్ని విప్పి చెబుతాడు.


ఈ నవలలో రవి అర్జునుడులాంటివాడైతే, పుల్లయ్య, గురప్ప.. కృష్ణుల్లాంటి వారు. రవిలో గూడు కట్టుకున్న భయాన్ని పారదోలుతూ గురప్ప హితబోధ చేస్తుంటే, రవితోపాటు ఇతరులను కూడా హెచ్చరిస్తూ జీవన తత్వాన్ని బోధపరుస్తూంటాడు పుల్లయ్య. ‘నువ్వు గొర్ల కాయడం లేదు సిన్నోడా, నీ బయ్యాన్ని నువ్వు కాసుకొంటా వుండావు. దాన్ని మేపుకొంటా వుండావు. ఎప్పుడూ నిన్ను గురించి నువ్వు ఆలోచెన సేస్తా వుండావు తప్ప గొర్రెల గురించి ఆలోచన సెయ్యడంలే’ అని కాస్త కటువుగానే చెబుతాడు గురప్ప. ‘గొల్లోని కోపము మెడ మీందికి బరువు. మనకెందుకోయ్‌ నరికే పని? ఆ మాటలు చెప్పొద్దు. గొల్లోనికి లాకీగాదు’ అని పుల్లయ్య కర్తవ్య బోధ చేస్తాడు. సందర్భానుసారం రచయిత కూడా అక్కడక్కడా చాలా విషయాలు ప్రకటిస్తుంటారు. అయితే, జీవితానుభవం నుంచి పెల్లుబికినవి కావడంతో అవి ఆయా సందర్భాలను పండించాయి. కానీ, ఈ కొండ పొలం అనుభవం మొత్తాన్ని ఒక ఉద్యోగార్థిలో చైతన్యాన్ని తీసుకొచ్చేలా వ్యాఖ్యానించడం పెద్ద గొర్రెదాటనే చెప్పాలి. ప్రాణాలను పణంగా పెట్టి, తమ ఒక్కరి ప్రాణం యాభై గొర్రెలకు సమానంగా భావిస్తూ ఏళ్లకు ఏళ్లుగా కొండపొలం చేసేవారే వారి వ్యక్తిగత జీవితాల్లోగానీ, సామాజిక జీవితాల్లోగానీ ఏమీ చెప్పుకోదగ్గ మార్పు లను సాధించలేక పోయారు. మృత్యువుకు ఎదురు వెళ్లి, తమనీ, తమతోటి జీవాలను కాపాడుకోవాల్సిన ఆటవిక సందర్భాలకీ; కులం, ప్రాంతం, మాట, యాస ప్రాతిపదికన వెనక్కి నెట్టివేసే కుతంత్రాలకీ చాలా తేడా ఉంది. అడవిలో మందపై దాడి చేసే పులి కేవలం ఒక గొర్రెను నోటకరుచుకుపోతుంది. బతకడానికి దాని తావుల్లోకి వెళ్లినందుకు ‘పుల్లరీ’ చెల్లించినట్టుగా దాన్ని భావించాలి అంటాడు పుల్లయ్య. కానీ, నగరారణ్యంలో సంచరించే ‘కోరగల జీవాలు’ ఏదో జీవాన్ని ఆకలి తీర్చుకోవడానికి నోట కరచుకుపోయే రకాలు కాదు; రేపటి, మాపటి ఆకలి కోసం ఆ చంకలో నాలుగు, ఈ చంకలో నాలుగు జీవాలను ఇరికించుకుని.. కుదిరితే ఇంకో నాలుగైనా ఎత్తుకుపోవాలనుకునే బుద్ధి గలవి. నగరంలోని బతుకు పోరు వేరని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


నవల చివర్లో హీరో అటవీ అధికారి అయిపోయి దుష్టశిక్షణ చేసేయడం కూడా కట్టుకథను మించి పోయింది. చాలామంది అధికారులు ఆఫీసుల్లో కూర్చుని దొరికిన కేసులనే విచారిస్తారనీ, కానీ.. మన హీరో రవి కదనరంగమైన అడవి లోతుల్లోకి వెళ్లి దొంగల ఆటకట్టిస్తాడని అనడం కాత్యాయనీ విద్మహే గారు అన్నట్టు అందమైన ఊహగా అంగీకరించడం కూడా కష్టమే. వీరప్పన్‌లుగానీ, వివేక్‌ దూబేలుగానీ రాజ్యం పెంచితే పెరిగిన వారే. ‘పెద్దల’ మాట వినకుండా ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో చాలామంది నిజాయితీగల అధికారులకు తెలుసు. అయినప్పటికీ సాహసించి, తెగించిన వారి ప్రాణాలేమయ్యాయో కూడా జన సామాన్యానికి తెలుసు.


ఈ మలుపులనీ, మరకలనీ పక్కన బెడితే ‘కొండ పొలం’ ఓ చక్కని అనుభవాన్ని ఇస్తుంది. ఓ చీకటి రాత్రి.. పైన నక్షత్రాలు, చుట్టూ చెట్లు. కొండపై ఒంటరిగా కూర్చుని అడవి నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ చేసే ఓ భయోద్విగ్న వనవాస అనుభవాన్నిస్తుంది.

దేశరాజు

Updated Date - 2020-08-24T06:32:22+05:30 IST