ఏనుగుల గుంపు

ABN , First Publish Date - 2021-03-25T05:30:00+05:30 IST

ఒక అడవిలో ఒక చోట చిన్న చిన్న జంతువులు, పక్షులు, చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివసించేవి.

ఏనుగుల గుంపు

ఒక అడవిలో ఒక చోట చిన్న చిన్న జంతువులు, పక్షులు, చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివసించేవి. కొన్ని జంతువులు బొరియలు చేసుకుని ఉంటే, పక్షులు చెట్లపై గూళ్లు కట్టుకుని సంతోషంగా జీవించేవి. ఒకరోజు వాటికి ప్రమాదం ఎదురయింది. అవి నివసించే చోటు గుండా   ఒక ఏనుగుల గుంపు వెళుతుండేది. ఆ ఏనుగులు వెళుతున్న సమయంలో భూమి కంపించినట్టు అయ్యేది. చెట్లపై నుంచి పక్షుల గూళ్లు కిందపడేవి. చిన్న చిన్నజంతువులు చేసుకున్న బొరియలు కూలిపోయేవి. రోజూ అలాగే జరుగుతుండటంతో అన్నీ కలిసి ఏనుగుల దగ్గరకు వెళ్లి మాట్లాడాలని నిర్ణయించుకున్నాయి. మరుసటి రోజు వెళ్లి తమ బాధనంతా ఏనుగులతో చెప్పుకొన్నాయి.


అప్పుడు ఏనుగులు ‘ఇక మీదట మీరున్న చోటు నుంచి వెళుతున్నప్పుడు నెమ్మదిగానే వెళతాం’ అని మాట ఇచ్చాయి. చెప్పినట్టుగానే మరుసటి రోజు ఏనుగులు నెమ్మదిగా వెళ్లాయి. జంతువులన్నీ ఎంతో సంతోషించాయి. అయితే ఏనుగులు వెళ్లే దారిలో ఒకరోజు వేటగాళ్లు ఉచ్చులు బిగించారు. వేటగాళ్లు ఊహించినట్టుగానే ఏనుగులు ఆ ఉచ్చులో పడ్డాయి. విషయం అర్థమై సహాయం కోసం అరవసాగాయి. వాటి అరుపులు విన్న చిన్న చిన్న జంతువులు, పక్షులు, చీమలు మనకు సహాయం చేసిన ఏనుగుల కోసం మనమూ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాయి. చిన్న చిన్న జంతువులు ఉచ్చును కొరికేయసాగాయి. చీమలు వేటగాళ్లను కుట్టడం మొదలెట్టాయి. ఆ దెబ్బతో వేటగాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఏనుగులు సురక్షితంగా బయటపడ్డాయి. 


Updated Date - 2021-03-25T05:30:00+05:30 IST