Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 26 Mar 2022 17:56:07 IST

తరగతి గదిలో నమాజ్... దర్యాప్తుకు ఆదేశించిన విశ్వవిద్యాలయం...

twitter-iconwatsapp-iconfb-icon
తరగతి గదిలో నమాజ్... దర్యాప్తుకు ఆదేశించిన విశ్వవిద్యాలయం...

భోపాల్ : కర్ణాటకలో హిజాబ్ వివాదం సద్దుమణగక ముందే, మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో నమాజ్ వివాదం ప్రారంభమైంది. డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్థిని తరగతి గదిలో నమాజ్ చేస్తున్నట్లు హిందూ జాగరణ్ మంచ్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ విశ్వవిద్యాలయం ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. 


మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో ఉన్న డాక్టర్ హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో తరగతి గదిలో హిజాబ్ ధరించిన  ఓ విద్యార్థిని నమాజ్ చేస్తున్నట్లు ఈ ఫిర్యాదులో ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులకు సమర్పించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సంతోష్ సహ్‌గౌర శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హిందూ జాగరణ్ మంచ్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఫిర్యాదుతోపాటు వీడియో కూడా అందిందని చెప్పారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ తన నివేదికను మూడు రోజుల్లోగా సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


ఈ విశ్వవిద్యాలయం మీడియా సంబంధాల అధికారి వివేక్ జైశ్వాల్ మాట్లాడుతూ, విద్యార్థులకు అధికారికంగా డ్రెస్ కోడ్ లేదన్నారు. అయితే విద్యార్థులు ప్రాథమిక నైతిక ప్రమాణాలతో బట్టలు ధరించాలన్నారు. 


హిందూ జాగరణ్ మంచ్ సాగర్ విభాగం అధ్యక్షుడు ఉమేశ్ సరఫ్ మాట్లాడుతూ, ఈ వీడియోలో కనిపిస్తున్న విద్యార్థిని చాలా కాలం నుంచి హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతున్నట్లు తెలిపారు. అయితే ఆమె శుక్రవారం మధ్యాహ్నం తరగతి గదిలో నమాజ్ చేస్తూ కనిపించారని, ఇది అభ్యంతరకరమని తెలిపారు. ఇటువంటి మతపరమైన కార్యకలాపాలను విద్యా సంస్థల్లో అనుమతించరాదన్నారు. విద్యా సంస్థలు అన్ని మతాలకు చెందినవని చెప్పారు. విశ్వవిద్యాలయం ఉప కులపతికి, రిజిస్ట్రార్‌కు వినతి పత్రాలను సమర్పించామని చెప్పారు. 


కర్ణాటక హైకోర్టు మార్చి 15న ఇచ్చిన తీర్పులో హిజాబ్‌ను ధరించడం ఇస్లాం మతాచారాల్లో ముఖ్యమైన భాగం కాదని చెప్పింది. ఈ తీర్పుపై అపీలును అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.