నైరుతి సగం పూర్తి.. వెల్లువెత్తిన వానలు

ABN , First Publish Date - 2022-08-01T09:27:20+05:30 IST

దేశంలో వ్యవసాయ రంగానికి ప్రధాన ఆయువుపట్టు వంటి నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో తొలి అర్ధ భాగం ముగిసింది. తొలుత మందకొడిగా ప్రారంభమైన వర్షాలు తర్వాత క్రమేపీ పుంజుకున్నాయి.

నైరుతి సగం పూర్తి.. వెల్లువెత్తిన వానలు

ఏపీలో 9.1 శాతం ఎక్కువ వర్షపాతం

554 మండలాల్లో విస్తారంగా వర్షాలు

125 మండలాల్లో లోటు వర్షపాతం


రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి జూలై 31 వరకు వర్షపాతం నమోదు తెలిపే మ్యాప్‌. ఎరుపు రంగులో ఉన్న ప్రాంతం లోటు, పసుపు రంగు ప్రాంతం తీవ్ర లోటు, నీలం, ఆకుపచ్చ, ముదురు నీలం రంగుల్లో ఉన్న ప్రాంతాలు సాధారణం, సాధారణం కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదైన ప్రాంతాలు.


విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయ రంగానికి ప్రధాన ఆయువుపట్టు వంటి నైరుతి రుతుపవనాల నాలుగు నెలల సీజన్‌లో తొలి అర్ధ భాగం ముగిసింది. తొలుత మందకొడిగా ప్రారంభమైన వర్షాలు తర్వాత క్రమేపీ పుంజుకున్నాయి. దీంతో రాష్ట్రంలో వానలు వెల్లువెత్తాయి.  ప్రధాన రిజర్వాయర్లలోకి పుష్కలంగా నీరు చేరడం రైతులకు కొంత ఊరటనిచ్చిన అంశం. గడచిన రెండు నెలల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సాధారణ వర్షపాతం 251.1 మి.మీ.లకుగాను 274 మి.మీ. (9.1శాతం ఎక్కువ) నమోదైంది. ఏపీఎ్‌సడీపీఎస్‌ గణాంకాల మేరకు బాపట్లలో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా, విజయనగరం, కోనసీమ అంబేడ్కర్‌, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 679 మండలాలకుగాను 101 మండలాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువ, 187 మండలాల్లో ఎక్కువగా, 266 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.


118 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడగా, ఏడు మండలాల్లో దుర్భిక్ష  పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే తక్కువ/దుర్భిక్షంగా ఉండే ప్రాంతాల్లో తిరుపతి, నంద్యాలలో 13, అన్నమయ్యలో 10, శ్రీసత్యసాయి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తొమ్మిది, వైఎస్సార్‌ జిల్లాలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇంకా పల్నాడు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ అంబేడ్కర్‌, కాకినాడ జిల్లాల్లో అన్ని మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే ఈ 2 నెలల కాలానికి 445.8 మి.మీ.లకు 480మి.మీ.ల వర్షపాతం (సాధారణంకంటే 8ు ఎక్కువ) నమోదైంది. 


సెకండా్‌ఫలోనూ అనుకూలమే..!

నైరుతి తొలి అర్ధ భాగంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ వాయుగుండాలు లేకుండా కేవలం ఉపరితల ఆవర్తనాలు, వాటికి తోడుగా ద్రోణులు బలమైన ప్రభావం చూపడంతో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కాగా.. నైరుతి సీజన్‌ సెకండా్‌ఫలో ఆగస్టు, సెప్టెంబరు నెలలు ఎంతో కీలకం. ఖరీ్‌ఫలో పంటల సాగుకు ఢోకా లేకుండా ఉండాలంటే ఈ రెండు నెలల్లో వర్షాలు పుష్కలంగా కురవాలి. నైరుతి సీజన్‌ ముగిసే వరకు పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా పరిస్థితులు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ నివేదిక మేరకు వర్షాలకు వాతావరణం కొంత అనుకూలంగా ఉందని నిపుణులు అంచనాకు వచ్చారు. 


రెండు నెలల్లో తక్కువగా అల్పపీడనాలు

నైరుతి సీజన్‌ ప్రారంభమైన జూన్‌లో ఒకటి నుంచి రెండు, జూలైలో కనీసం నాలుగు అల్పపీడనాలు బంగాళాఖాతంలో ఏర్పడాలి. కానీ ఈ ఏడాది జూన్‌లో ఉత్తర ఒడిశా పరిసరాల్లో భూఉపరితలంపై ఒక అల్పపీడనం వచ్చింది. జూలైలో బంగాళాఖాతంలో ఒక్క అల్పపీడనమే ఏర్పడగా జార్ఖండ్‌ పరిసరాల్లో మరొకటి, గుజరాత్‌లో వాయుగుండం ఒకటి, రాజస్థాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోయినా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడంతో వానలు పుష్కలంగా కురిశాయి. హిందూ మహాసముద్రంలో ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (ఐవోడీ) నెగెటివ్‌గా ఉండడంతో రెండు నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ వాయుగుండాలు ఏర్పడలేదని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. వాటికి బదులు ఉపరితల ఆవర్తనాలు, రుతుపవన ద్రోణి, తూర్పు-పడమర ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి అటు అరేబియా సముద్రంలో, ఇటు బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం ఏర్పడి వానలు కురిశాయన్నారు. వాతావరణ మార్పులకు ఇదో నిదర్శనమని విశ్లేషించారు.



Updated Date - 2022-08-01T09:27:20+05:30 IST