ప్రాజెక్టులకు వరద పోటు!

ABN , First Publish Date - 2022-08-10T10:05:01+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది.

ప్రాజెక్టులకు వరద పోటు!

కృష్ణా, గోదావరి ఉధృత ప్రవాహం.. శ్రీశైలానికి 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా మంగళవారం ఏపీ, తెలంగాణ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్త్తితో పాటు 8 స్పిల్‌ వే గేట్లను ఎత్తి 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు (885 అడుగులు) కాగా, ప్రస్తుతం 213.40 టీఎంసీల (884.60 అడుగులు) నీరుంది. సాగర్‌కు 2.30 లక్షల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578 అడుగులకు(276.0932టీఎంసీలకు) చేరుకుంది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఈనెల 12న సాగర్‌ గేట్లను ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్ల నుంచి జూరాలకు భారీగా వరద వస్తుండటంతో 16 గేట్లు ఎత్తి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 33 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.


ఇక తుంగభద్ర డ్యాంకు 1.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 1.54 లక్షల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. ఆల్మట్టికి 78,056, నారాయణపూర్‌కు 1.35 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాలకు 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 1,00,724 క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలానికి బుధ, గురువారాల్లో ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉంది. పులిచింతల ప్రాజెక్టులో మూడు, మూసీ ప్రాజెక్టులో 4 క్రస్ట్‌గేట్లను ఎత్తి మూసీకి నీటిని వదులుతున్నారు. శ్రీరామసాగర్‌కు 39,680 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ఇక్కడ నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు, భారీ వర్షాలకు పెన్‌గంగ, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూట్‌ (టీ)లోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పోడ్సా వంతెనపై వరద చేరి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 


ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి

ప్రాణహిత, ఇంద్రావతిల నుంచి భారీగా వరద నీరు వస్తుండటం, దిగువన శబరి సైతం ఉప్పొంగడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నీటి మట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు 45.2 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయానికి 55 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఈ తరుణంలో భద్రాచలం ఏటూరునాగారం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 


కాళేశ్వరం బ్యారేజీల నుంచి నీటి విడుదల

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం అన్నారం (సరస్వతీ) బ్యారేజీలోకి 1,63,995 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 66 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోకి 7,21,140 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీ 85 గేట్లను ఎత్తారు. కాగా, లక్ష్మీ పంప్‌హౌ్‌సలో డీ వాటరింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది.

Updated Date - 2022-08-10T10:05:01+05:30 IST