Deoghar airport: ఇద్దరు బీజేపీ ఎంపీలపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-03T17:23:22+05:30 IST

జార్ఖండ్‌ (Jharkhand)లోని దేవ్‌గఢ్ విమానాశ్రయం (Deoghar

Deoghar airport: ఇద్దరు బీజేపీ ఎంపీలపై కేసు నమోదు

రాంచీ : జార్ఖండ్‌ (Jharkhand)లోని దేవ్‌గఢ్ విమానాశ్రయం (Deoghar airport)లో అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై కేసు నమోదైంది.  రాత్రి వేళలో తమ చార్టర్ విమానం బయల్దేరడానికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇవ్వాలని వీరంతా విమానాశ్రయం అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు నమోదు చేశారు. ఈ విమానాశ్రయం డీఎస్‌పీ సుమన్ అనన్ (Suman Anan) ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. 


బీజేపీ ఎంపీలు నిశికాంత దూబే, మనోజ్ తివారీ, విమానాశ్రయం డైరెక్టర్ సహా తొమ్మిది మందిపై ఈ కేసు నమోదైంది. నిందితుల్లో దూబే కుమారులు కనిష్క్ కాంత్, మహీకాంత్ కూడా ఉన్నారు. 


ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, గొడ్డా నియోజకవర్గ ఎంపీ నిశికాంత్ దూబే, ఆయన కుమారులు కనిష్క్ కాంత్, మహీకాంత్, ఎంపీ మనోజ్ తివారీ, ముకేశ్ పాఠక్, దేవతా పాండే, పింటూ తివారీ దేవ్‌గఢ్ విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి చొరబడ్డారు. తమ చార్టర్డ్ విమానానికి అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేశారు. 


ఈ విమానాశ్రయం నుంచి రాత్రి వేళలో విమానాలు బయల్దేరడానికి అనుమతి లేదు. సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు మాత్రమే విమానాలు ఇక్కడి నుంచి బయల్దేరవచ్చు. ఈ సంఘటన జరిగిన రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6.03 గంటలు. అయితే వీరి చార్టర్డ్ విమానం సాయంత్రం 6.17 గంటలకు బయల్దేరింది. 


నిశికాంత్ దూబే మీడియాతో మాట్లాడుతూ, తమ విమానం బయల్దేరడానికి విమానాశ్రయం అధికారులు అభ్యంతరం తెలియజేయలేదన్నారు. విమానాశ్రయం డైరెక్టర్ నుంచి తాము అనుమతి తీసుకున్నామని, దీనిపై పోరాడటానికి తాను సిద్ధమేనని తెలిపారు. 


దేవ్‌గఢ్ జిల్లా కలెక్టర్ మంజునాథ్ భజంత్రి ట్విటర్ వేదికగా ఎంపీ దూబేను దుయ్యబట్టారు. దూబే తన విమానానికి నిర్బంధంగా అనుమతి పొందారని, భద్రత సంబంధిత నిబంధనలను ఉల్లంఘించారని, ఇది జాతీయ భద్రతను ఉల్లంఘించడమేనని తెలిపారు. మీరు, మీ పిల్లలు, మద్దతుదారులు ఏటీసీ రూమ్‌లోకి ప్రవేశించడానికి ఎవరు అధికారం ఇచ్చారని నిలదీశారు. 


దీనిపై దూబే స్పందిస్తూ, విమానయాన నిబంధనలను మళ్లీ చదువుకోవాలని కోరారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఈ దేశం మంచిని ఆశిస్తోందన్నారు. ప్రస్తుతం  ఈ విషయం దర్యాప్తులో ఉందన్నారు. విమానయాన, విమానాశ్రయ నిబంధనలను క్షుణ్ణంగా చదువుకున్న తర్వాతే వ్యాఖ్యలు చేయాలని సలహా ఇచ్చారు.


Updated Date - 2022-09-03T17:23:22+05:30 IST