ఆపద్బాంధవులు

ABN , First Publish Date - 2020-03-29T10:36:23+05:30 IST

దేశానికిప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. ఈ విపత్తు నుంచి బయటపడేందుకు లాక్‌డౌన్‌ తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనసున్న మారాజులు ముందుకొచ్చారు. అన్నార్తుల

ఆపద్బాంధవులు

  • పేదల ఆకలి తీరుస్తున్న మనసున్న మారాజులు


దేశానికిప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. ఈ విపత్తు నుంచి బయటపడేందుకు లాక్‌డౌన్‌ తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది మనసున్న మారాజులు ముందుకొచ్చారు. అన్నార్తుల కడుపునింపేందుకు సేవబాట పట్టారు. అదీ సంపూర్ణ ఆరోగ్య జాగ్రత్తలతో.. విపత్కర పరిస్థితుల వేళ భాగ్యనగరంలోని పేదల నోటికి అన్నంముద్దను అందిస్తోన్న కొంతమంది  సేవాతత్పరతపై కథనం. 


హైదరాబాద్‌ సిటీ, మార్చి28 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పునాదులపై నిర్మితమైన భాగ్యనగరానికి ఖాళీ కడుపు ఆకలి తెలుసు. కనుకే 425ఏళ్ల నగర చరిత్రలో విపత్తులు సవాల్‌ విసిరిన ప్రతిసారీ మానవత్వమే పైచేయిగా నిలిచిన సందర్భాలెన్నో. సాటి మనిషి ఆకలితో అలమటిస్తుంటే ఈ నేల చూస్తూ ఊరుకుంటుందా.! నగరంలో రెక్కల కష్టంపై బతుకీడ్చే వలసజీవుల సంఖ్య సుమారు ఇరవై లక్షలపైమాటే. వారిలో గుడిసెలు, పరదా డేరాలలో తలదాచుకునేవారే అధికం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకొని వచ్చిన వారికి లాక్‌డౌన్‌ నేపథ్యంలో పుట గడవడం కష్టమే. తెలుగు ప్రాంతాల నుంచేకాదు, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పొట్టచేతపట్టుకొని వచ్చినవారే. కరోనా ఇప్పుడు ఆ పేద, బడుగుజీవుల పొట్టపై పెద్ద దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్‌తో వారంతా గుడిసెలకే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది సేవామూర్తులు ముందుకొచ్చారు. నగరాన్ని నమ్ముకున్న బడుగు జీవుల  ఆకలి తీర్చేందుకు శ్రీకారం చుట్టారు. 


పస్తులు లేని నగరం కోసం

లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటినుంచి అసంఘటిత రంగ కార్మికులు, నిరాశ్రయులు, దినసరి వేతనంతో బతికే వాళ్ల గురించి పలు సందర్భాలలో ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. నాలుగు రోజుల క్రితమే అన్నపూర్ణ క్యాంటీన్లు, నైట్‌ షెల్టర్లు, అంబులెన్స్‌ సేవలు, పేదల మెడికల్‌ సర్వీస్‌ వంటి పది అంశాలపై మెమొరాండం కూడా సమర్పించాం. నగరంలో రెక్కాడితేగానీ డొక్కాడని వారెందరో ఉన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడుగు జీవులను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి ముందుకొచ్చాయి. ఖలీదా పర్వీన్‌, బిలాల్‌ తదితరులు ఆహార పొట్లాలను పంచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే నగరాన్నే నమ్ముకొన్న వలసజీవులు చాలామంది ఉన్నారు. వారందరికీ సేవలు అందాలి. నగరంలో ఏ వ్యక్తీ పస్తులతో ఉండకూడదు అని ప్రభుత్వం, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు సంకల్పించాల్సిన సమయం ఇది. మా సేవలకు సహకారం అందించాలనుకొనేవారు 99483 52008 నెంబర్లో సంప్రదించవచ్చు. 

సజయ కాకర్ల, సామాజిక కార్యకర్త


చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అలీ. ఆయన సంపన్నుడేమీ కాదు. సామాన్య మధ్యతరగతికి చెందిన యువకుడు. లాక్‌డౌన్‌ వేళ రోడ్డుమీద ఆకలితో గడిపే అన్నార్తుల కోసం తనవంతు సేవలందించేందుకు ముందుకు కదిలాడు.  శుక్రవారం పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నెంబర్‌ 207 వద్ద కొంతమంది యాచకులు, నిరాశ్రయులకు ఆహారపదార్థాల పంపిణీ చేస్తూ కనిపించాడు.  

ఆటోలో ఆహారపదార్థాలు పంపిణీ చేస్తున్న అలీ


హష్మీ ఆధ్వర్యంలో 1500 మందికి భోజనం

ఎస్‌కేఏహెచ్‌ గ్రూప్స్‌ అధినేత సయ్యద్‌ ఖాజీం అలీ హష్మీ.  ఆయన లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం నగరంలో నిత్యం 1500 మందికి ఆహారం పంపిణీ చేసే బృహత్‌కార్యానికి నడుం బిగించాడు.  కొంతమంది యువకులను ఒకచోట చేర్చి, వంట పనులు మొదలుపెట్టాడు. రోజూ సాయంత్రం మలక్‌పేట ప్రాంతంలోని నిరాశ్రయులు, అనాథలు, యాచకులు, బడుగుజీవులకు ఆహారపొట్లాలు, వాటర్‌ప్యాకెట్లను పంచుతున్నారు. అన్నం  తినని వారికి  రెండు నుంచి ఐదు కేజీల గోధుమపిండి ప్యాకెట్లనూ అందిస్తున్నారు. ‘‘లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ప్రతిరోజూ సుమారు 1,500మందికి భోజనాలు అందించాలనేది మా ఉద్దేశం.’’ అని అలీ హష్మీ చెబుతున్నారు.


 స్వచ్ఛ కార్మికులకు స్నేహహస్తం

ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతూ, తలుపు తట్టి మరీ ప్రతి ఇంట పోగైన చెత్తను మోసుకెళ్లే  నిజమైన నగర నావికులు స్వచ్ఛ కార్మికులు. సేకరించిన వ్యర్థాలను తడి, పొడిగా వేరుచేసి డపింగ్‌ యార్డుకు తరలించడం వారి విధినిర్వహణలో భాగం. నిత్యం దుమ్ము, ధూళి, వ్యర్ధాల మధ్య గడిపే స్వచ్ఛ కార్మికులకు కనీసం ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌవ్స్‌ లేని పరిస్థితిని చూసి సీనియర్‌ న్యాయవాది వసుధ నాగరాజ్‌ చలించారు. నగరాన్ని నిత్యం స్వచ్ఛతగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న వాళ్లకి తనవంతు సహకారం అందించాలనుకున్నారు. సికింద్రాబాద్‌లోని మడ్‌ ఫోర్ట్‌, కృష్ణానగర్‌, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు వెయ్యి మందికి నాణ్యమైన గ్లౌవ్స్‌ను అందించారు. మరో వెయ్యి గ్లౌవ్స్‌ను పంపిణీచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతటితో ఆగక, గ్లౌవ్స్‌ని ఉపయోగించే పద్ధతిపై తానొక వీడియో రూపొందించారు. తద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఆమె  తన ఇంటి నుంచి చెత్త సేకరించే కార్మికుడికి  నెలకు రూ.700 చెల్లిస్తారు. శ్రమ విలువ తెలిసిన వ్యక్తి కదా.! 


ఐజాజుద్దీన్‌ సేవకు సలాం...

షహనాజ్‌, మహమ్మద్‌ ఐజాజుద్దీన్‌ దంపతులు. వారి నివాస స్థలం ఆరాంఘర్‌. సాయంత్రం వేళ ఇద్దరూ కలిసి ఒక ఆటోలో బయలుదేరతారు. ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్లపై బతుకీడుస్తున్న యాచకులు, నిరాశ్రయులకు ఆహారపొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందజేస్తారు. ఆపై దుర్గానగర్‌ జోప్డీ, చింతల్‌మెట్‌, హసన్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని పేదలకు అన్నం ప్యాకెట్లు పంపిణీచేస్తారు.  ఐజాజ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. షహనాజ్‌ గృహిణి. వారికి నలుగురు పిల్లలు. అన్నదాన సేవను మార్చి 22న మొదలు పెట్టారు. లాక్‌డౌన్‌ ముగిసేవరకూ కొనసాగిస్తామని ఆ దంపతులు చెబుతున్నారు. షహనాజ్‌ తన అనారోగ్యాన్ని సైతం లక్ష్యపెట్టక నలుగురి మంచికోసం ముందుకొచ్చారు. నిత్యం 150మంది కడుపునింపుతున్నారు. ‘‘ఆహారపదార్థాలను మేమిద్దరమే తయారుచేస్తాం. మాకు ఒమ్మి రమేశ్‌బాబు, సజయ సహకారం కూడా తోడవడంతో మా పని ఇంకా సులువు అయింది’’ అని ఐజాజ్‌ చెబుతున్నారు.  


మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు

లాక్‌డౌన్‌ వేళ నగరంలోని పేదల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, పౌరహక్కుల సంఘాలు కొత్త సేవ బాటపట్టాయి. కరోనా వేళ ప్రతిఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, తమ సామర్థ్యం మేరకు ఆహారపదార్థాలు, నిత్యావసరాలను అందిస్తున్నారు. బంజారాహిల్స్‌ బస్తీలో సుమారు 150 వలస కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ బస్తీకి సామాజిక ఉద్యమకారిణి సజయ కాకర్ల ఒకరోజు వెళ్లారు. అక్కడి పరిస్థితిని గమనించారు. వారందరికీ సులువుగా అర్థమయ్యేలా కరోనా గురించి వివరించారు. మహిళా, ట్రాన్స్‌జెండర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, దళిత్‌ ఉమెన్స్‌ కలెక్టీవ్‌, భూమిక, మామ్‌టూ ఫోన్ట్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌, పీవోడబ్ల్యూ, అంకురం, రైతు స్వరాజ్యవేదిక, హ్యూమన్‌రైట్స్‌ ఫోరం, సావిత్రీబాయి ఫూలే అధ్యయనవేదిక, అమన్‌వేదిక, కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టీవ్‌ తదితర సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చారు. వారందరి సహకారంతో భవననిర్మాణ కార్మికులు, వలసజీవుల అడ్డాలైన వాడలు, బస్తీల్లోకెళ్లి అవసరమైన కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తున్నారు. ని


సేవలో ఇంజనీరింగు కుర్రాళ్లు

బోరబండ, శివాజీనగర్‌కి చెందిన కొందరు యువకులు మాత్రం సాటి మనిషికి సాయమందించేందుకు ముందుకొచ్చారు. పస్తులతో రోజులెళ్లదీయాల్సిన పరిస్థితుల్లో కూరుకుపోయిన వలస కార్మికులకు బాసటగా నిలిచారు. హెల్పింగ్‌ సొసైటీ పేరుతో సుశీల్‌, తరుణ్‌, రమణ, బాబి, జనార్దన్‌, సందీప్‌ కలిసి బస్తీ, వాడల్లోని కొంతమంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలనూ వివరిస్తున్నారు. ఈ యువకులంతా ఇంజనీరింగు విద్యార్థులే.!

Updated Date - 2020-03-29T10:36:23+05:30 IST