కానుక లేని పండుగ

ABN , First Publish Date - 2022-07-05T06:36:30+05:30 IST

వేసవి సెలవుల తర్వాత పిల్లలు నేడు బడి గడప తొక్కనున్నారు.

కానుక లేని పండుగ

నేటి నుంచి బడికి విద్యార్థులు

అరకొరగా విద్యా కానుక కిట్లు

తొలిరోజే పండుగ చేయాలని ఆదేశం

కొందరికే ఇస్తే తలనొప్పి తప్పదు

గురువుల గుండెల్లో గుబులు


 అనంతపురం విద్య, జూలై 4: వేసవి సెలవుల తర్వాత పిల్లలు నేడు బడి గడప తొక్కనున్నారు. 2022-23 విద్యా ఏడాది మంగళవారం న ుంచి ప్రారంభం అవుతోంది. బడికి వెళ్లగానే తమకు కొత్త బూట్లు, పుస్తకాలు, బ్యాగులు ఇస్తారని పిల్లలు సంతోషంగా ఉన్నారు. కానీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాత్రం బిక్కుబిక్కుమంటూ  బడిబాట పడుతున్నారు. జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లు బడి తెరిచిన రోజే అందికీ ఇవ్వండి.. పండుగలా చేయండి అని ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయికి కిట్లను చేర్చలేదు. ‘ఒక స్కూల్‌ నుంచి మరో స్కూల్‌ మెటీరియల్‌ ఇచ్చి పుచ్చుకోండి’ అని సర్దుబాటు  మాటలు చెబుతోంది. ఇదెక్కడి గోల అని ప్రధానోపాధ్యాయులు తలలు

పట్టుకుంటున్నారు. 


 కిట్లు.. కిరికిరి..


 జిల్లాకు ఇండెంట్‌ మేరకు నోట్‌ పుస్తకాలు 12.11 లక్షలు, బెల్టులు 1.76 లక్షలు, బూట్లు 2.34 లక్షల జతలు, బ్యాగులు 2.34 లక్షలు,  ప్రైమరీ డిక్షనరీలు 19,139, హైస్కూల్‌ డిక్షనరీలు 22,952, యూనిఫామ్స్‌ 2.34 లక్షల మందికి మూడు జతల చొప్పున సప్లై చేయాలి. జిల్లా వ్యాప్తంగా చాలా స్కూళ్లకు కేవలం బ్యాగులు, బెల్టులు, నోట్‌ పుస్తకాలు మాత్రమే ఇచ్చారు. అవి కూడా అరకొరగానే. జేవీకే కిట్ల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది.  మొదటి రోజే అన్నీ ఇస్తామని చెప్పారు. కానీ రెండు, మూడు వస్తువులు ఇచ్చి.. ‘పండుగ చేసుకోండి’ అని ప్రభుత్వం చెప్పడం ఏమిటని హెచఎంలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి ఎక్కడ  వ్యతిరేకత వస్తుందోనని జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు సైతం భయపడుతున్నారు. మొదటి రోజు ఐదుగురి నుంచి 10 మందికి కిట్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరైనా కిట్ల కోసం ఒత్తిడి తెస్తే, ఇది 24 రోజుల పండుగ అని, 24 రోజులూ ఇస్తామని చెప్పాలని ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలకు అధికారులకు బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది జేవీకే కిట్ల సప్లై చాలా వరకూ ఫెయిల్యూర్‌ అనే చెప్పాలి. 



గురువులదే భారం...


స్కూళ్లు మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. టీచర్లను మాత్రం గత నెల 28 నుంచే బడికి రమ్మన్నారు. సంసిద్ధత పేరిట కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. ఆ రోజు నుంచి టీచర్లు, హెచఎంలు గదులను, స్కూల్‌ ఆవరణను శుభ్రం చేసుకోడానికి నానా తంటాలు పడ్డారు. ఆయాలు సరిగా పనిచేయకపోవడంతో కూలీలను పెట్టి చేయించారు. దీంతో హెచఎంలపై అదనంగా రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ భారం పడింది. ఇప్పటి వరకూ జేవీకే కిట్లు కాంప్లెక్స్‌ స్కూళ్లకు మాత్రమే చేర్చారు. అక్కడి నుంచి తమ స్కూళ్లకు తరలించేందుకు వాహన రవాణా ఖర్చు మరో రూ.1500 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో హెచఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Updated Date - 2022-07-05T06:36:30+05:30 IST