కదం తొక్కిన రైతన్న

ABN , First Publish Date - 2022-09-23T08:08:11+05:30 IST

కదం తొక్కిన రైతన్న

కదం తొక్కిన రైతన్న

హారతులు పట్టి ఆశీర్వదించిన ప్రజలు  

ఇతర జిల్లాల నుంచీ తరలివచ్చి మద్దతు 

జనసంద్రంగా మారిన బందరు

హోరెత్తిన ‘జై అమరావతి’ నినాదాలు

మహాపాదయాత్రకు సాదర స్వాగతం

చిన్నాపురం నుంచి పెడన వరకూ నడక 

11వ రోజు 18 కిలోమీటర్లు సాగిన యాత్ర 


మచిలీపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని కోసం రైతులు కదం తొక్కుతున్నారు. గురువారం కృష్ణాజిల్లా బందరు మండలం చిన్నాపురం నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర మచిలీపట్నం నగరం మీదుగా పెడన రోడ్డులోని హర్షా కాలేజీ వరకు కొనసాగింది. ముందుగా  చిన్నాపురంలోని అయ్యప్పస్వామి ఆలయంలో రైతులు, గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యరథానికి, శ్రీ వేంకటేశ్వర స్వామికి మహిళలు హారతులిచ్చారు. రథం ఎదుట కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు. అనంతరం ఉదయం 9గంటలకు మహాపాదయాత్ర ప్రారంభమైంది. చిన్నాపురం ప్రధాన సెంటర్‌లో పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతు పలికేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివచ్చారు. ‘జై అమరావతి, ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ‘అమరావతి రాజధాని ముద్దు.. మూడు రాజధానులు వద్దు, సీఎం డౌన్‌డౌన్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దారి పొడవునా పూలు చల్లి పాదయాత్ర చేస్తున్న రైతులకు స్థానికులు ఆహ్వానం పలికారు. గుండుపాలెం గాంధీబొమ్మ సెంటరులో మహాత్మాగాంధీ విగ్రహానికి రైతులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాదయాత్రకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ సంఘీభావం తెలిపి రైతులతో అడుగు కలిపారు. జనసేన, సీపీఐ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. శారదానగర్‌ వద్ద బందరు నియోజకవర్గ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు రైతులకు స్వాగతం పలికి, జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావును భుజాలపైకి ఎత్తుకుని కొద్దిదూరం నడిచారు. రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. గుండుపాలెం, శివగంగ, శారదానగర్‌, ఖాలేఖాన్‌పేట, చింతగుంటపాలెం తదితర ప్రాంతాల్లో సూర్య రథానికి మహిళలు హారతులిచ్చారు. రాజుపేట షాదీఖానా సెంటరు నుంచి భోజన విరామ అనంతరం కోనేరు సెంటరు, వల్లూరు రాజా సెంటరు, బస్టాండ్‌, సాయిబాబా గుడి సెంటర్‌, జడ్పీ సెంటర్‌ , హుస్సేన్‌పాలెం మీదుగా పెడన రోడ్డులోని హర్షా కాలేజీ వరకు పాదయాత్ర కొనసాగింది. గురువారం 11వ రోజు మొత్తం 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 


పల్నాడు వాసుల మద్దతు

అమరావతి రైతుల పాదయాత్రకు ఉమ్మడి గుంటూరు జిల్లావాసులు మద్దతు పలికారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌(రాము) నేతృత్వంలో 200 మందికి పైగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. చిలకలూరిపేటకు చెందిన తెలుగు రైతులు పెద్దఎత్తున తరలివచ్చి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. 


ముఖ్యమంత్రిది నయవంచన: కొల్లు

రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నయవంచనకు గురిచేసి నమ్మించి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా 3రాజధానులు అంటూ సీఎం జగన్‌ కాలయాపన చేస్తున్నారన్నారు. రైతుల పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసైనా సీఎం జగన్‌... మూడు రాజధానులనే మూర్ఖపు వాదనను వదిలిపెట్టి అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు హితవు పలికారు. రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేసి ఉంటే రెండో విడత మహాపాదయాత్ర చేయాల్సిన అవసరం ఉండేది కాదని జేఏసీ ప్రతినిధి రాయపాటి శైలజ అన్నారు.  


డీజీపీ గారూ... రక్షణ కల్పించండి: జేఏసీ 

మచిలీపట్నం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా పెడన, గుడివాడ నియోజకవర్గాల పరిధిలో శుక్ర, శనివారాల్లో జరిగే అమరావతి రైతుల మహాపాదయాత్రలో రైతులపై రాళ్లురువ్వి అలజడి సృష్టించేందుకు వ్యూహం రచించారని తమకు సమాచారం ఉందని, డీజీపీ స్పందించి తమకు రక్షణ కల్పించాలని అమరావతి జేఏసీ నాయకులు ఎ.శివారెడ్డి, గద్దె తిరుపతిరావు కోరారు. పాదయాత్రకు ప్రజలు, పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. శుక్రవారం హర్ష కళాశాల నుంచి పెడన మీదుగా కౌతవరం వరకు, శనివారం గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుందన్నారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై రాళ్లు రువ్వేందుకు కొందరు వ్యూహరచన చేశారని స్థానికులు చెబుతున్నారని.. దీనిపై డీజీపీ వెంటనే స్పందించి రైతులకు రక్షణ కల్పించాలని కోరారు.

Updated Date - 2022-09-23T08:08:11+05:30 IST