ముంచిన గుజరాత్ సీడ్‌

ABN , First Publish Date - 2022-06-22T07:06:29+05:30 IST

సొంత ప్రాంతంలో మోసపోతేనే దిక్కుండదు. అలాంటిది పొరుగు రాషా్ట్రనికి వెళ్లి విత్తనం తెచ్చుకున్నారు.

ముంచిన గుజరాత్ సీడ్‌
కాయలు లేని వేరుశనగ కట్టెను చూపుతున్న రైతు..

రూ.కోటికి పైగా పెట్టుబడి నష్టం

పాల్తూరులో ట్యాగ్‌-24

వేరుశనగతో దగా 

బళ్లారి నుంచి కొని తెచ్చుకున్న రైతులు


సొంత ప్రాంతంలో మోసపోతేనే దిక్కుండదు. అలాంటిది పొరుగు రాషా్ట్రనికి వెళ్లి విత్తనం తెచ్చుకున్నారు. బాగా పండుతుందని ఏజెన్సీవారు చెబితే రైతులు నమ్మారు. పంట సాగు చేసి మూడు నెలలు గడిచింది. రెండు అడుగుల ఎత్తు పెరిగిందేగాని, రెండు కాయలు కూడా కాయలేదు. ఆ ఊరి రైతులు పెట్టుబడి రూపంలో ఏకంగా రూ.కోటి నష్టపోయారు.  ఇప్పుడు తమను ఆదుకునేది ఎవరు..? ఎవరికి ఫిర్యాదు చేయాలి..? అని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.


విడపనకల్లు, జూన్ 21: అధిక దిగుబడి వస్తుందని ఆశించి తెచ్చిన విత్తనం రైతులను నట్టేట ముంచింది. నవంబరులో పాల్తూరు గ్రామ రైతులు కొందరు సాగు చేసిన విత్తనం.. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చింది. దీంతో అదే గ్రామానికి చెందిన మరికొందరు అదే విత్తనం కొని సాగు చేశారు. కానీ రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చేలా లేదని బాధితులు లబోదిబోమంటున్నారు. బళ్లారిలోని కరిబసవన గౌడ్‌ అనే ఏజెంట్‌ వద్ద గుజరాత్‌కు చెందిన ట్యాగ్‌-24 రకం వేరుశనగ విత్తనాన్ని కొన్న రైతుల గోడు ఇది. క్వింటానికి రూ.14 వేలు పెట్టి రైతులు విత్తనాన్ని కొనుగోలు చేశారు. ఎకరానికి 22 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఏజెన్సీవారు రైతులను నమ్మించారు. దీంతో బోరు బావుల కింద ఖరీఫ్‌ పంటగా 200 ఎకరాల్లో సాగు చేశారు. రైతు నీరావరి పొలంలో నీటి తడుల కింద ఎకరాకు 125 కేజీలు విత్తారు. పంటను సాగు చేసి దాదాపు 90 రోజులు అయింది వేరుశనగ కట్టె 2 అడుగుల వరకూ పెరిగింది. కానీ చెట్టుకు ఒకటి రెండు కాయలు మాత్రమే వచ్చాయి. దీంతో మోసపోయిన రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 



భారీగా పెట్టుబడి..

గుజరాత సీడ్‌ సాగుకు రైతులు భారీగా పెట్టుబడి పెట్టారు. ఎకరానికి 125 కేజీల విత్తనం వేశారు. దీనికి రూ.16,800 వెచ్చించారు. ఎకరానికి 5 బస్తాల ఎరువులకు రూ.10 వేలు, ఐదు రౌండ్ల మందుల పిచికారీకి  రూ.10 వేలు, కలుపు, సేద్యపు ఖర్చులు రూ.10 వేలు, ఇలా.. ఇప్పటికే ఎకరానికి రూ.46 వేలు పెట్టుబడి అయిం ది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. క్వింటా రూ.5 వేల నుంచి రూ.6 వేలు ధర పలికితే ఎకరాకు దాదాపుగా రూ.1.20 లక్షలు వచ్చేది. పెట్టుబడి రూ.46 వేలు పోనూ రైతుకు రూ.75 వేల వరకూ మిగిలేది. నాణ్యత లేని సీడ్‌ కారణంగా రైతులు రూ.లక్షల్లో పె ట్టుబడి నష్టపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. 


రూ.4 లక్షలు నష్టపోయా..

నేను 8 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఎకరాకు రూ.46 వేలు పెట్టుబడి పెట్టాను. ఎకరాకు రెండు క్వింటళ్ల దిగుబడి కూడా వచ్చేలా లేదు. రబీలో మిరప పంట ముంచింది. ఖరీ్‌ఫలో వేరుశనగ ముంచింది. పూర్తిగా అప్పుల పాలు అయ్యాను. ట్యాగ్‌-24 రకం విత్తనం పూర్తిగా నకిలీ విత్తనం. ఏజెన్సీవారు మోసం చేశారు.

- కాలువ మారయ్య, రైతు, పాల్తూరు


అప్పులపాలయ్యా..

నేను మూడు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. ఎకరాకు 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అనుకుంటే.. కనీసం రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాను. పెట్టుబడి కూడా తిరిగి రావటంలేదు.

- పుండికూర హనుమంతు, రైతు, పాల్తూరు 


పూర్తిగా మోసపోయా..

నేను 4 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. పెట్టుబడి రూ.1.80 లక్షలు పెట్టాను. ఒక్క రూపాయి కూడా తిరి గి వచ్చేలా లేదు. వేరుశనగ కట్టె మాత్రం రెండు అడుగుల ఎత్తు పెరిగింది. కాయలు మాత్రం లేవు. మోసపోయి.. అప్పుల పాలయ్యాను.

- వెంకటేశులు, రైతు, పాల్తూరు


Updated Date - 2022-06-22T07:06:29+05:30 IST