దూసుకెళ్లిన మృత్యువు

ABN , First Publish Date - 2022-08-06T05:56:12+05:30 IST

పొట్టకూటి కోసం నిత్యం కష్టపడే కూలీలు వారు. వేకువ జామునే పనులకు వెళుతూ.. మార్గ మధ్యంలో పరవళ్లు తొక్కే నీటి అందాలను చూసేందుకు కాసేపు ఆగారు.

దూసుకెళ్లిన మృత్యువు
విలపిస్తున్న బంధువులు.. సుగాలి సరస్వతి ( ఫైల్‌) , సుగాలి లక్ష్మీదేవి(ఫైల్‌)

సిమెంటు లారీ ఢీ..  ఇద్దరు మహిళల మృతి

నీటి పరవళ్లు చూస్తుండగా  ఘోర ప్రమాదం

కాలువపల్లి వద్ద పెన్నానది బ్రిడ్జిపై దుర్ఘటన

బెళుగుప్ప, ఆగస్టు 5: పొట్టకూటి కోసం నిత్యం కష్టపడే కూలీలు వారు. వేకువ జామునే పనులకు వెళుతూ.. మార్గ మధ్యంలో పరవళ్లు తొక్కే నీటి అందాలను చూసేందుకు కాసేపు ఆగారు. అక్కడ లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి క్షణాల్లో కబళించింది. రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెళుగుప్ప మండల పరిధిలోని కాలువపల్లి వద్ద  శుక్రవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్‌ లారీ దూసుకువెళ్లడంతో సుగాలి సరస్వతి (36),  లక్ష్మీదేవి (45) అనే మహిళలు మృతి చెందారు. వీరిద్దరూ కాలువపల్లి తండాకు చెందిన కూలీలు. పేరూరు ప్రాజెక్టు గేట్లు గురువారం రాత్రి ఎత్తారు. దీంతో కాలువలో భారీగా నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం తెల్లవారు జామున కూలి పనులకు వెళుతున్న పలువురు అనంతపురం-కళ్యాణదుర్గం ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిమీద నిలబడి నీటి ప్రవాహాన్ని చూస్తుండగా, సిమెంటు లారీ దూసుకువచ్చింది. సరస్వతి, లక్ష్మిదేవి మీదుగా లారీ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జు అయ్యాయి. డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా వెళుతుండగా మిగిలిన కూలీలు వెంబడించి, గోళ్ల సమీపంలో పట్టుకున్నారు. ఈ ప్రమాదంతో గిరిజన తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ప్రభాకర్‌రెడ్డి, నాగరాజు బాధిత కుటుంబాలను పరామర్శించారు.


పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం

పేరూరు డ్యాం నుంచి గురువారం రాత్రి నీరు వదిలిన విషయం తెలిసినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని, అందుకే ఘోర ప్రమాదం జరిగిందని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ వైపు జనం వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెల్లవారుజామున ప్రమాదం జరిగితే ఉదయం 8 గంటలైనా పోలీసులు ఒక్కరూ ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో గ్రామస్థులు పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. అనంతపురం-కళ్యాణదుర్గం రోడ్డుపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్డీవో నిషాంతరెడ్డి, తహసీల్దారు ఈశ్వరయ్యశెట్టి, సీఐ శ్రీనివాసులు అక్కడికి వెళ్లి మాట్లాడారు. అధికారులు తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో జనం శాంతించారు.


Updated Date - 2022-08-06T05:56:12+05:30 IST