పసలేని ప్రసంగమా?

ABN , First Publish Date - 2022-08-17T06:31:39+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం నాడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగానికి అమిత ప్రాధాన్యం ఉన్నది. అనేక వ్యాఖ్యలకు, వివరణలకు, చర్చలకు ఆస్కారం ఉన్న ప్రసంగం అది...

పసలేని ప్రసంగమా?

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం నాడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగానికి అమిత ప్రాధాన్యం ఉన్నది. అనేక వ్యాఖ్యలకు, వివరణలకు, చర్చలకు ఆస్కారం ఉన్న ప్రసంగం అది. ప్రధాని ప్రసంగం అన్న దాని కన్న, డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్ర్య దిన సందర్భం విశేషమైనది. గడచిన ప్రయాణానికి సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష ప్రస్తావనలు, శతాబ్ది గమ్యానికి జరిగే ప్రస్థానానికి సంబంధించిన నిర్దేశాలతో నిండిన సందేశం అది.


సందర్భం గొప్పదే కానీ, ప్రధాని ఉపన్యాసం ఏమంత గొప్పగా లేదన్నది విస్తృతంగా వినిపిస్తున్న అభిప్రాయం. చెప్పిన విషయాలలో కొత్తదనం కానీ, స్ఫూర్తిదాయకమైనవి కానీ ఏమీ లేవని, ఆహార్యం మీద పెట్టినంత శ్రద్ధ ప్రసంగం మీద పెట్టి ఉంటే బాగుండేదని విమర్శలు వస్తున్నాయి. ఇది మోదీ వ్యక్తిగత వైఫల్యం కాదని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి, పార్టీకి భావదారిద్ర్య దశ వచ్చిందని, కొత్త ఆలోచనలు చేసే శక్తి లోపించిందని పాత్రికేయ వ్యాఖ్యాతలు రాస్తున్నారు. సమృద్ధ అభివృద్ధి అన్న లక్ష్యం కానీ, వారసత్వానికి గర్వించడం, బానిసతత్వాన్ని విడనాడడం, సమైక్యత, పౌరవిధులకు కట్టుబాటు.. ఈ అయిదు అంశాలూ బిజెపి కానీ, ప్రధాని కానీ తరచు చెబుతూ వస్తున్నవేనని వారు గుర్తుచేస్తున్నారు. పైగా, ప్రజావర్గాల మధ్య ద్వేషభావాలను కలిగించడానికి ప్రయత్నాలు నిరాఘాటంగా సాగుతున్నప్పటికీ, సాధారణ ప్రజానీకంలో సానుకూల స్పందనలు క్రమంగా తగ్గుతున్న విషయం ప్రధాని ఇంకా గమనించినట్టు లేరు. ఉద్వేగ అంశాలు ప్రభావం వేయలేనంతగా, దైనందిన భౌతిక సమస్యలు ప్రజాజీవితాన్ని బాధిస్తున్నాయి. పైగా, సృజనాత్మకత లోపించిన ద్వేషవాదం, జనానికి క్రమంగా విసుగు తెప్పిస్తున్నట్టున్నది.


ఎర్రకోట ప్రసంగం మీద వస్తున్న విశ్లేషణలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి.. ఆ ప్రసంగం విస్మరించిన కీలక, ప్రధాన అంశాలు, రెండు... ప్రధాని చెప్పిన సంకల్పాలకు భిన్నంగా కనిపిస్తున్న ప్రభుత్వ సరళి. 


ప్రతిపూటా పరగడుపే అన్నట్టు ప్రధానమంత్రికి పాతవిషయాలేవీ గుర్తుండవు. 2014లో చెప్పిన సహకార ఫెడరలిజమ్ కానీ, ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు కానీ, నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి రప్పించడం కానీ క్రమంగా ఆయన మరచిపోయారు. మరి దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలలో నిరుద్యోగం ఉన్నట్టా లేనట్టా? ఎందువల్ల, పంచప్రాణాల్లో అది ఒకటి కాలేకపోయింది? ఇక నుంచి రానున్న పాతికేళ్ల కాలం ‘అమృతకాలం’ అని మోదీ నామకరణం చేశారు. నిరుద్యోగంతో ద్రవ్యోల్బణంతో నిలువుదోపిడి చేసే జీఎస్టీలతో కాలం అమృతం ఎట్లా అవుతుంది? 


‘అచ్ఛేదిన్’ను వాగ్దానం చేసిన 2014ను మరచిపోదాం. మరి 2019లో చెప్పినవేమిటి? సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్.. ఈ నినాదం ఏమయింది? సబ్ అంటూ అందరూ కాదు, కొందరే అనే నిర్వచనం మరింత తీవ్రమయింది ఈ మూడేళ్ల కాలంలోనే కదా? కలసికట్టుగా ముందుకు సాగడాన్ని పంచప్రాణాల్లో ఒకటిగా చెప్పిన ప్రధానమంత్రి, ప్రజలు జట్టుగా కట్టుగా ఉండకుండా విభజన రేఖలు గీస్తున్న పరిణామాలను నిజంగానే నిరోధించాలనుకుంటున్నారా? 


దేశమంతా పరిచితమైన గుజరాత్ బిల్కిస్ బానో కేసులో దోషులను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయడం, స్త్రీ గౌరవం గురించి ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని ప్రసంగం స్ఫూర్తికి ఏ విధంగా అనుగుణంగా ఉన్నదని ప్రతిపక్ష నేతలు, ఇతర విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. పధ్నాలుగు సంవత్సరాల ఖైదు పూర్తి అయిందని విడుదల చేశామని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. ఎన్నో న్యాయమైన కేసులలో, ఇరవయ్యేళ్లు ముప్పయ్యేళ్లు గడచి కూడా విడుదల కాని జీవిత ఖైదీలు ఉన్నారు. మతహింస, అందులో భాగంగాను, అనుబంధంగానూ జరిగిన లైంగిక అత్యాచారాల విషయంలో కేంద్రం, గుజరాత్ రాష్ట్రప్రభుత్వాల వైఖరిని బిల్కిస్ బానో ఖైదీల విడుదల తెలియజేస్తున్నది.


ముప్పాతిక నుంచి నాలుగుపాతికల శతాబ్దానికి చేసే ప్రయాణం, భారత్ వంటి వైవిధ్యభరిత, పురోగామి సమాజానికి ఉద్వేగపూరితమైనది. అవరోధాలను, అవకాశాలను పారదర్శకంగా చర్చించి, భవిష్యత్ మార్గాన్ని సూచించడం విజ్ఞత అవుతుంది. ప్రధాని ప్రాధాన్యాలు ఏమైనా, ప్రజల అనుభవంలో కనిపిస్తున్న సమస్యలు వేరు. ‘పెన్ అమెరికా’ సంస్థ 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అనేక మంది రచయితల అభిప్రాయాలను సేకరించింది. అందులో సుప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ వ్యక్తం చేసిన అభిప్రాయంలో ఒక భాగం ఇది: స్వాతంత్ర్యానంతరం లౌకికవాద ప్రజాస్వామిక దేశాన్ని రూపొందించడం మన ఆకాంక్ష కాగా, ఆ ప్రయాణంలో అవరోధాలు కలిగాయి, అయినా సంకల్పం చెదరలేదు.. ఆ స్థిరత్వంలోనూ సమస్యలు ఉన్నాయి... పౌరసత్వహక్కులేమిటో, భారతీయ అస్తిత్వపు భావన ఏమిటో ఇప్పటికీ ఖరారు కాలేదు. అందుకే, అనేక సమస్యలు. పేదరికం, నిరుద్యోగం కొనసాగుతూనే ఉన్నాయి, జాతీయవాదం స్థానంలో మెజారిటీ ఆధిపత్యవాదం ఏర్పడింది. భావప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం రానురాను పెరిగిపోయింది, పౌరసత్వ హక్కులే అణగారిపోతున్నాయి, ఇటువంటప్పుడు, జాతీయోద్యమ ఆకాంక్షలను మనమెలా పరిపూర్తి చేయగలం? మనం అడగవలసిన ప్రశ్న ఇదీ!

Updated Date - 2022-08-17T06:31:39+05:30 IST