ఆరని ఆగ్రహ జ్వాల

ABN , First Publish Date - 2022-06-17T09:26:23+05:30 IST

బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ) విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.

ఆరని ఆగ్రహ జ్వాల

  • 3వ రోజూ బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల నిరసన
  • కరెంటు, నీళ్లు ఆపేసినా అదే పట్టు..
  • సీఎం పర్యటన, రెగ్యులర్‌ వీసీ కోసం డిమాండ్‌
  • వివిధ విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు..
  • బాసర దారుల్లో అడుగడుగునా  పికెట్‌ 
  • విద్యార్థుల సమస్యలు సిల్లీగా కనిపిస్తున్నాయా?..
  • మంత్రి సబితపై నారాయణ ధ్వజం
  • విద్యార్థుల మద్దతు కోసం బాసరకు..
  • ఆయనను అరెస్టు చేసిన పోలీసులు
  • దొరల బానిసగా  సబిత: అరవింద్‌..
  • నేడు బాసరకు బండి సంజయ్‌
  • బాసర ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ సతీశ్‌కుమార్‌ నియామకం
  • ‘బాసర’ విద్యార్థులను చూస్తే బాధేస్తోంది: గవర్నర్‌ తమిళిసై
  • తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరిచారా?: రాహుల్‌గాంధీ
  • సీఎం పర్యటన, రెగ్యులర్‌ వీసీ కోసం పట్టు 
  • విద్యార్థుల సమస్యలు సిల్లీగా కనిపిస్తున్నాయా?
  • మంత్రి సబితపై నారాయణ మండిపాటు 


 బాసర, హైదరాబాద్‌, జూన్‌, 16 (ఆంధ్రజ్యోతి):  బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ) విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. వర్సిటీలో సమస్యలు పరిష్కరించాల్సిందేనంటూ వరుసగా మూడోరోజూ ఆందోళన నిర్వహించారు. అధికారులు నచ్చజెప్పినా.. దారికి తెచ్చుకునేందుకు విద్యుత్తు, మంచినీటి సరఫరా బంద్‌ చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థులు మరింత పట్టుదలతో ఆందోళన నిర్వహించడంతో ఆ సౌకర్యాలను అధికారులు పునరుద్ధరించక తప్పలేదు. మూడో రోజైన గురువారం వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. మధ్యాహ్నం పరీక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాటిని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.  మరోవైపు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా ఓయూ ప్రొఫెసర్‌ సతీష్‌ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు. వర్సిటీలో సీఎం పర్యటన, రెగ్యులర్‌  వీసీ నియామకమే తమ ప్రధాన డిమాండ్‌ అంటూ ఆందోళన కొనసాగించారు. యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి తమ సమస్యలు విని.. పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. కాగా.. వర్సిటీ పరిసరాలతో పాటు బాసరలో భారీగా పోలీసులను మోహరించారు. పలు ప్రాంతాల నుంచి బాసరకు వచ్చి.. వెళ్లే దారుల్లో అడుగడుగునా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మద్దతుగా బాసరకు తరలివచ్చిన పలు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను కూడా యూనివర్సిటీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి అతన్ని ముథోల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 


పరిష్కారమయ్యేదాకా బాసరలోనే: నారాయణ

 బాసరలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన విద్యాశాఖ మంత్రి ఆ సమస్యలను తక్కువ చేసి మాటాలడటం ఎంతవరకు సమంజసం అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు గురువారం ఆయన బాసరకు రాగా పోలీసులు అరెస్టు చేసి బాసర పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నారాయణ పోలీసుస్టేషన్‌ నుంచే మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. వర్సిటీలో రెండేళ్లుగా వీసీ నియామకం లేదని, బోధనకు సరిపడా అధ్యాపకులు లేరన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేయాలని చూడడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు తాను బాసర పోలీసు స్టేషన్‌లోనే ఉంటానని నారాయణ ప్రకటించారు. ఇదిలా ఉండగా నారాయణతో పాటు విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలపడానికి వెళ్లిన ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లి ఖాద్రి, సీపీఐ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య, కార్యవర్గ సభ్యులు షేక్‌ బాపు తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేసి బాసర పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్‌, శుక్రవారం బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లనున్నారు. ఉదయం 7 గంటలకు ఆయన, రాష ్ట్రపార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి వెళతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.  


దొరల బానిసగా సబిత: అరవింద్‌ 

 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దొరల బానిసగా మారారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ విమర్శించారు. కాంగ్రె్‌సలో ఉన్నప్పుడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. సబితను చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు తీసుకురాగా, ప్రస్తుతం ఆమె తన స్థాయిని తానే తగ్గించుకున్నారని చెప్పారు.బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులవి సిల్లీ డిమాండ్‌లు అంటూ సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్య చూస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యావ్యవస్థ పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్‌ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడకు వెళుతున్నాయని సీఎంను ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటనకు కేటాయించిన బడ్జెట్‌ రూ.2 కోట్లు. కానీ ఆయన పర్యటన ఖర్చు రూ.13 కోట్లయిందని, రూ.11 కోట్లు ఏం చేశారని నిలదీశారు. కాగా, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కలిసే ఎన్నికలకు వెళతాయని అరవింద్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ను ఈడీ విచారణ చేస్తే తప్పేంటని కాంగ్రె్‌సను ప్రశ్నించిన అరవింద్‌, మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఈడీ రోజుల తరబడి విచారించిందని చెప్పారు. ఇక ఇంద్రారెడ్డి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిందని ఆయన అన్నారు. ఆయన వాహనాన్ని ఢీకొన్న లారీ ఎవరిదో ఇప్పటికీ గుర్తించలేదన్నారు.


ఐఐఐటీ డైరెక్టర్‌గాసతీష్‌కుమార్‌

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌గా ఆచార్య సతీష్‌ కుమార్‌ను నియమించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎలక్ట్రిక్‌ విభాగంలో పనిచేస్తున్న సతీష్‌ కుమార్‌ ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలోని సమస్యలపై బుధవారం విద్యా శాఖ మంత్రి సబిత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే సతీష్‌ కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. కాగా, విద్యార్థులు వెంటనే తమ ఆందోళనను విరమించాలని మంత్రి సబిత సూచించారు. విద్యార్థుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని ఆమె గురువారం ట్వీట్‌ చేశారు. కాగా, బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రె సివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) కోరింది.


‘బాసర’ విద్యార్థులను చూస్తే బాధేస్తోంది: గవర్నర్‌ 

హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా బాసరలోని ఆర్‌జీయూకేటీ విద్యార్థులు చేపట్టిన నిరసనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. వర్షంలో తడుస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులను చూస్తే... తనకు చాలా బాధ కలుగుతోందన్నారు. ‘‘మీరు (విద్యార్థులు) ఇంకా భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. మీ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాల్సి ఉంది. అందుకని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. విద్యార్థులు ఇచ్చిన వినతులను అధికారులకు తెలియజేసి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కాగా..  గవర్నర్‌, సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుకు, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీకి ట్విటర్‌ ద్వారా విద్యార్థులు తమ విన్నపాన్ని పంపారు. ఆర్‌జీయూకేటీని సీఎం కేసీఆర్‌ ఓసారి సందర్శించాలని కోరారు. వర్షం తడుస్తున్న మాట నిజమే.. కానీ, అంతకంటే ఎక్కువ బాధల్లో ఉన్నామని విద్యార్థులు ఆ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే అన్యాయం చేసిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు.

Updated Date - 2022-06-17T09:26:23+05:30 IST