డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ABN , First Publish Date - 2022-05-17T05:36:42+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసీడింగ్స్‌ అందిస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

- మంత్రి గంగుల కమలాకర్‌

- 40 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణి


కరీంనగర్‌ రూరల్‌, మే 16: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల  పట్టాల పంపిణీతో పేదల సొంతింటి కల సాకారమైందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ రూరల్‌ మండలం మొగ్దుంపూర్‌ గ్రామంలో 40 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల  పంపిణి కార్యక్రమం  చేపట్టారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. మొగ్దుంపూర్‌లో అర్హులు 52 మంది ఉండగా 40 మందికి ఇళ్లను అందజేశామని, మిగిలిన 12  మందికి త్వరలోనే అందజేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి డ్రా పద్ధతిలో నలభై మందిని ఎంపిక  చేసి వారందరికి పట్టాల కాపిలను అందజేశారు. అనతరం వారికి వచ్చిన ఇళ్లలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం లబ్ధిదారులతో మంత్రి, అధికారులు, నాయకులు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, సర్పంచ్‌ జక్కం నర్సయ్య, ఎంపీటీసీు దేవనపల్లి పుష్పఅంజిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు శ్యాంసుందర్‌రెడ్డి, ఆనందరావు, తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాశెట్టి శ్రీనివాస్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  


 ఇళ్లు రాని దరఖాస్తుదారుల నిరసన 


మొగ్దుంపూర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రాని దరఖాస్తుదారులు ఇళ్ల్లు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి  గంగుల కమలాకర్‌ ఎదుట నిరసన తెలిపారు. మొదటి లిస్టులో తమ పేర్లు ఉన్నాయని, తుది జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభానికి ముందు నుంచే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు రాని లబ్ధిదారులు గృహ సముదాయాల వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రావడంతో ఒక్కసారిగా మహిళలు తమకు ఇళ్లు ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. మంత్రి ప్రసంగం జరిగేంత సేపు నిరసన వ్యక్తం చేశారు. వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.... డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీలో రాజకీయాలు చేయడం తగదని, అర్హులైన వారిని అధికారులు పారదర్శకంగా ఎంపిక చేశారని అన్నారు. మిగతా 12 మందికి పట్టాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 



ఐలాండ్‌లను ఆధునీకరించాలి 

- నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యం 

- మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, మే 16: నగరంలోని ప్రధాన ఐలాండ్‌లను రకరకాల వాటర్‌ పౌంటేన్లు, గ్రీనరీ, కల్చర్‌ చిత్రాలతో అందంగా ఆధునీకరించాలని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులు, కన్సల్‌టెంట్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం మీసేవలో  ఐలాండ్ల సుందరీకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యంగా పెట్టుకున్నామని, పెండింగ్‌లోని ఐలాండ్‌లన్నిటిని సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఐలాండ్‌లను మహాభారతం వంటి చరిత్ర, సంస్కృతితో కూడిన చిత్రాలతో భావితరాలకు అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. అల్గునూర్‌ జంక్షన్‌, తెలంగాణ తల్లి జంక్షన్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అల్గునూర్‌ చౌరస్తాలో ఆమరణ నిరాహారదీక్ష వెళ్తూ కేసీఆర్‌ అరెస్టు అయిన ప్రాంతం కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు బతుకమ్మ పండుగ చిహ్నాలతో జంక్షన్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. సమావేశంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్‌, ఆర్వీ అధికారి సందీప్‌, ఏజెన్సీ ప్రతినిధి సంతోష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T05:36:42+05:30 IST