కలెక్షన్‌లో పావలా మాకు!

ABN , First Publish Date - 2022-08-04T09:02:10+05:30 IST

కలెక్షన్‌లో పావలా మాకు!

కలెక్షన్‌లో పావలా మాకు!

ఏపీఎ్‌సఆర్టీసీకి జగన్‌ ప్రభుత్వం షాక్‌

ప్రయాణికులను పిండి పెంచిన ఆదాయం

కొత్త బస్సుల కొనుగోలు యోచనలో ఆర్టీసీ

అప్పులకొండను దించుకోడానికీ ప్రణాళికలు

ఇంతలోనే సర్కారు అల్టిమేటం

నెల ఆర్జనలో 25ు ఇవ్వాలని హుకుం

వడ్డనలు, సె్‌సలతో పెరిగిన అదనం నెలకు 100కోట్లు

ఖజానాకు జమచేయాల్సింది రూ.132కోట్లు


అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): గుంతలమయమైన రోడ్లు... కాలం చెల్లిన బస్సులు... రాష్ట్రంలో ప్రయాణమంటేనే నరకప్రాయం... వీటికి అదనంగా ఇటీవల రెండుసార్లు డీజిల్‌ సెస్‌ పేరుతో వడ్డింపు! విద్యార్థుల బస్‌పా్‌సలు సైతం వదలకుండా భారీగా వడ్డించింది. తమ నడ్డి విరిసి పెంచుకున్న ఆదాయంతో ఆర్టీసీ ఇకనైనా కొత్త బస్సులు కొనుగోలు చేసి సుఖమయ ప్రయాణాన్ని అందిస్తుందని ప్రయాణికులు ఆశపడ్డారు. కానీ ఆ ఆశనూ జగన్‌ ప్రభుత్వం చెరిపేసింది. నెలవారీ పెరిగిన ఆదాయంలోంచి పావలాను సర్కారుకు జమ చేయాలని తాజాగా ఆర్టీసీకి అల్టిమేటం జారీ చేసింది. వడ్డనలు, సెస్‌లతో ఏడాదికి 1200 కోట్లు దాకా ఆర్టీసీ ఆదాయం పెంచుతుంది. అంటే నెలకు రూ. 100 కోట్లు అదనంగా ఆర్జిస్తోంది. కార్గో, ప్రయాణికుల టికెట్‌, ఇతర సర్వీసులు కలుపుకొని ఆర్టీసీకి రూ. 528 కోట్ల ఆదాయం వస్తోందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 25శాతం, అంటే దాదాపు రూ. 132 కోట్లు నెలకు  సర్కారు ఖజానాకు చేర్చాలని హుకుం జారీ చేసింది. దీంతో నెలకు పెరిగిన అదనపు ఆదాయం కన్నా ఎక్కువగా ప్రభుత్వం అడుగుతుంటే ఇంకేం కొత్త బస్సులు కొంటాం అంటూ ఆర్టీసీ నిట్టూరుస్తోంది. రాష్ట్రంలోని 128 డిపోల నుంచి బాగా పాతవైన బస్సుల వివరాలు సేకరించగా, సుమారు 1500బస్సులు గుజిరీకి తప్ప ఎందుకూ పనికిరావంటూ ఆర్‌ఎంల నుంచి నివేదికలు వచ్చాయి. వాటిని నిర్వీర్యం చేసేసి ప్రయాణికులపై అదనంగా బాదిన సొమ్ముతో వెయ్యి బస్సులు కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ ఆ సొమ్ము చేతికి వచ్చేలోపే జగనన్న ప్రభుత్వం మాకు 25శాతం కలెక్షన్‌ ఇవ్వాలి అనడంతో తల పట్టుకుంది. డీజిల్‌ ఖర్చులకు సగానికి పైగా పోతుంటే పావలా ప్రభుత్వానికి ఇచ్చేస్తే సంస్థకున్న నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు తీర్చెదెలా.? సిబ్బంది బకాయిలు చెల్లించేదెలా.? అంటూ దిక్కులు చూస్తోంది. 


అప్పుడు దీర్ఘాలు తీసి...

ప్రతిపక్షంలో ఉండగా పొరుగు రాష్ట్రాల్లో డీజిల్‌, పెట్రోలు ధరలు తక్కువ, వాహనాలు అక్కడికి తీసుకెళ్లి ఆయిల్‌ నింపండి.. అంటూ దీర్ఘాలు తీసిన జగన్‌ అధికారంలోకి రాగానే దేశంలోనే అత్యధికంగా ఆయిల్‌ ధరల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపారు. అలాంటిది ఇప్పుడు ప్రయాణికుడి నుంచి పెంచుకున్న ఆదాయాన్ని సైతం జగన్‌ ప్రభుత్వం లాక్కొంటోంది. ప్రయాణికుల ముక్కుపిండి తాము తీసుకుంటే తమ ఖజానా నుంచి ప్రభుత్వం తీసుకెళ్లిపోతుండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా, ప్రయాణికులపై ఆర్టీసీ ఏప్రిల్‌, జూన్‌లో బాదిన బాదుడుతో సరాసరి రోజువారీ ఆదాయం 12కోట్ల నుంచి 17.58కోట్లకు చేరింది. ప్రతి బస్సు రోజుకు సరాసరి 371 కిలోమీటర్లు తిరుగుతూ 15,548 రూపాయలు ఆర్జిస్తూ 11వేల బస్సులు నెలకు రూ.528కోట్లు ఆర్టీసీ ఖజానాలో జమచేస్తున్నాయి. అయితే ఈ మొత్తంలో 25శాతం ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశాలు రావడంతో ఈనెల 1నుంచి అమలు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అయిష్టంగానే తలూపినట్లు తెలిసింది.

Updated Date - 2022-08-04T09:02:10+05:30 IST