Abn logo
May 5 2020 @ 09:54AM

కరోనా కన్నా... భయమే పెద్ద జబ్బు

ఆంధ్రజ్యోతి(05-05-2020):

మార్చి 29... సాయంత్రం.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రిలో ఒక్కసారిగా కలకలం.. ‘‘మర్కజ్‌ నుంచి వచ్చిన వారిని పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వచ్చినట్టు తెలిసింది.


మొదట కంగారుపడ్డా తేరుకున్నాం. ఒకేసారి 24 మందిని పరీక్షల  కోసం తీసుకువచ్చారు. వారిలో కొంతమందికి పాజిటివ్‌గా తేలింది. అయితే ఏం చేయాలి? ఎలా ట్రీట్‌ చేయాలి? అంతా గందరగోళం.. వైద్యవిద్య పూర్తిచేసి వచ్చిన నాకు కరోనా కొత్త పాఠాలు నేర్పింది’’ అంటూ చెప్పుకొచ్చారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో పనిచేసే వైద్య బృందంలో ఒకరైన జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ దివ్యా సరోజ. కరోనా అనుభవం ఆమె మాటల్లోనే...


‘‘వైద్య విద్యార్థిగా వున్న సమయంలో వైర్‌సల గురించి చదివాను. ఏ వైరస్‌ అయినా కొంతకాలం ఉండి అంతమవుతుంది. దాన్ని నియంత్రించే ఔషధాలను శాస్త్రవేత్తలు కనుగొంటూనే ఉన్నారు. కానీ కరోనా వైరస్‌ వైద్యులకే సవాల్‌గా మారింది. దీనిగురించి చర్చంచని రోజులేదు. మార్చినెల మొదటి వారం నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులను, కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందంలో జనరల్‌ ఫిజీషియన్‌గా నేనున్నాను. తొలుత అనుమానిత కేసులుగా వచ్చాయి. జాగ్రత్తలు తీసుకుని వారికి  వైద్య పరీక్షలు నిర్వహించాం.  


మార్చి 29న వైద్యాధికారులు ‘మర్కజ్‌ వెళ్లిన వారికి కరోనా వైరస్‌ సోకినట్టు అనుమానం ఉందని వారందరికి వైద్య పరీక్షలు చేయాల’ని చెప్పారు. ఆ రోజు సాయంత్రం 24 మందిని తీసుకువచ్చారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం ఇవన్నీ వైరస్‌ లక్షణాలని తెలుసు కానీ వారిని చూస్తే ఎవరికీ ఆ లక్షణాలు కనిపించలేదు. వారి నుంచి శ్వాబ్‌ తీసి పరీక్ష నిమిత్తం పంపించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ రాత్రి పిడుగులాంటి వార్త మా చెవిన పడింది. పరీక్షలలో 14 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఒక్కసారిగా తెలియని భయం.. ఒక విధమైన గందరగోళం మమ్మల్ని ఆవహించాయి. అందరిదీ ఒకటే ఆలోచన... వారికి వైద్యం ఎలా అందించాలా అని? మొత్తం మీద వారికి వైద్యం ప్రారంభించాం. వారి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశాం. అందరూ 45 ఏళ్ల లోపు వయసువారే. మాకు తెలియని రోగంపై పోరాటానికి సిద్ధమయ్యాం. వైద్యులతోపాటు నర్సులు, సిబ్బంది అంతా చేయి కలిపారు.


నా దృష్టిలో రోగం కంటే భయమే పెద్ద జబ్బు. వారిలో నాకు కనిపించింది కూడా అదే. పాజిటివ్‌ అని తెలియడంతో వారిలో కొందరు కుమిలికుమిలి ఏడ్చారు. మాకేమైనా అయితే మా కుటుంబ పరిస్థితి ఏమిటంటూ కంగారుపడ్డారు. ఇది గమనించి ముందుగా వారిలో ఆత్మస్థయిర్యం నింపడానికి చర్యలు తీసుకున్నాం. మీ ప్రాణాలకు ఏమీ కాదు. మేమున్నామంటూ పదే పదే ధైర్యం కల్పించాం. మా కుటుంబ సభ్యులను కలవకుండా ఒంటరిగా గడిపాం. ఇంటికి వెళ్లినా నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. 


ఏప్రిల్‌ 18.. ఉదయం.. ఆసుపత్రిలో మళ్లీ హడావుడి. ఈసారి ఇంతకు ముందులా ఎవరి ముఖంలోనూ భయం కనిపించలేదు. కొంత సంతోషం... గెలిచామన్న ఆనందం. మేము వైద్యం అందించిన వారిలో తొమ్మిది మందిని ఆ రోజు డిశ్చార్జి చేస్తున్నారు. మీ రుణం తీర్చు కోలేనిదని వారు కృతజ్ఞతలు చెప్పినప్పుడు మా కళ్లల్లో ఆనంద భాష్పాలు... చప్పట్లతో వారికి వీడ్కోలు పలికాం. మాకు కరోనా చాలా పాఠాలు నేర్పింది. వాటిలో సహనం, ధైర్యం ముఖ్యమైనవి. భవిష్యత్తులో మరిన్ని కేసులు రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వచ్చినా పోరాటం చేయడానికి వెనుకడుగు వేయను.’’ 


- గంజి బెనర్జీ, ఏలూరు