పాజిటివ్‌ నుంచి ప్లాస్మా డోనర్‌గా!

ABN , First Publish Date - 2020-05-06T16:39:58+05:30 IST

కరోనా సోకిందంటే ఎవరైనా సరే ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. ఒకవైపు వ్యాధి భయం... మరోవైపు ఒంటరితనంతో ఏర్పడే మానసిక ఆందోళనలు... వీటన్నింటి రెండు నుంచి మూడు వారాల పాటు భరించాల్సి ఉంటుంది. యుకెలో నివాసముంటున్న

పాజిటివ్‌ నుంచి ప్లాస్మా డోనర్‌గా!

ఆంధ్రజ్యోతి(06-05-2020):

కరోనా సోకిందంటే ఎవరైనా సరే ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. ఒకవైపు వ్యాధి భయం... మరోవైపు ఒంటరితనంతో ఏర్పడే మానసిక ఆందోళనలు... వీటన్నింటి రెండు నుంచి మూడు వారాల పాటు భరించాల్సి ఉంటుంది. యుకెలో నివాసముంటున్న భారతీయ డాక్టర్‌ మహబూబ్‌ అలీ (సర్జన్‌, రస్సెల్స్‌ హాల్‌ హాస్పిటల్స్‌) ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆయన సుమారు తన నెలరోజుల ఐసోలేషన్‌ అనుభవాలను పంచుకుంటున్నారిలా... 


‘‘కోపెన్‌హాగ్‌ నుంచి బెర్లిన్‌ వరకు 400 కిలోమీటర్ల సైక్లింగ్‌ హాలీడే జరుగుతుంది. ఈ ఏడాది అందులో పాల్గొనేందుకు (కరోనా కారణంగా ప్రస్తుతం క్యాన్సిల్‌ అయ్యింది) సిద్ధమవుతున్నా. మార్చి 14 వీకెండ్‌లో బర్మింగ్‌హామ్‌లోని మా ఇంటి దగ్గరే సైకిల్‌ మీద 70 కిలోమీటర్ల రైడ్‌ పూర్తి చేశా. ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. మరుసటి రోజు అలసటగా ఉన్నట్టనిపించడం, ఆదివారం కూడా కావడంతో ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకున్నా. ఆ తర్వాత మూడు రోజులు ఎలాంటి సమస్య లేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లి నా డ్యూటీ నేను చేశా. అయితే బుధవారం సాయంత్రం హాస్పిటల్‌ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా జ్వరంతో పాటు కడుపునొప్పి మొదలయ్యింది. ఒక డాక్టర్‌గా నాకు వాటి లక్షణాలు అర్థమవుతూనే ఉన్నాయి. నా భార్యను పిలిచి, ఇంటి వెనుక ఉన్న గదిలో నాకు రెండు మూడు వారాలకు సరిపడా పదార్థాలను, వస్తువులను ఉంచాల్సిందిగా కోరాను. 


‘కొవిడ్‌ 19’ పేషెంట్లతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయని తెలిసిందే. అందుకే బ్రిటన్‌ ప్రభుత్వం సలహా మేరకు నేను ఇంట్లోనే సెల్ఫ్‌ క్వారంటైన్‌ అవ్వాలనుకున్నా. మరుసటి రోజు ఉదయానికి నాలో జ్వరం (101 డిగ్రీలు), దగ్గు లక్షణాలు మొదలయ్యాయి. ‘కొవిడ్‌ 19’ పేషెంట్లను పరీక్షించే నా పల్మొనాలజిస్ట్‌ మిత్రుడికి విషయం చెప్పాను. జ్వరం, ఒళ్లునొప్పులకు పారాసిటమోల్‌ వాడమని సలహా ఇచ్చాడు. మొదటివారం అలసిపోయినట్టుగా ఉండి ఎక్కువసేపు నిద్రపోయేవాణ్ణి. జ్వరం లక్షణాలు ఇంకా అలాగే కొనసాగడంతో మార్చి 25న స్వాబ్‌ టెస్ట్‌ చేయించుకున్నా. మూడురోజుల తర్వాత నాకు కరోనా పాజిటివ్‌ ఉందనే విషయం బయటపడింది.


ఐసోలేషన్‌ బాధలు...

సాధారణంగా ఎవరైనా అనారోగ్యం బారిన పడితే, చుట్టూ చాలా మంది జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ కరోనా మహమ్మారి సోకిందంటే ఎవరూ మన దగ్గరకు రారు. దాంతో మానసికంగా భయాందోళన మొదలవుతుంది. అయితే నేను డాక్టర్ని కావడంతో పరిస్థితులను అంచనా వేసే అవగాహన ఉంది. నా శరీరంలో జరుగుతున్న ప్రతీ చిన్న మార్పును విశ్లేషించేవాణ్ణి. సాధారణంగా ‘కొవిడ్‌ 19’ సోకిన పేషెంట్లలో 10 నుంచి 14 రోజుల్లో సైటోకైన్‌ అనే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్‌ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచుతుంది. నేను దాన్ని ఊహించి, ఊపిరితిత్తులు సరిగా పనిచేసేందుకు రకరకాల భంగిమల్లో నిద్రపోయేవాణ్ణి. శరీర ఉష్ణోగ్రత, పల్స్‌ రేట్‌, రక్తంలో ఆక్సిజన్‌తో పాటు వికారం, తలనొప్పి, ఒళ్లునొప్పులు... తదితర విషయాల పట్ల అప్రమత్తంగా ఉండేవాణ్ణి. వాటి గురించి క్రమం తప్పకుండా నా కుటుంబసభ్యులు, మిత్రులతో షేర్‌ చేసుకునేవాణ్ణి. దాంతో వారంతా నా ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారనే ధైర్యం ఉండేది.


వాళ్లు నా ఒంటరితనాన్ని పోగొట్టారు...

ఒంటరిగా ఒక గదిలో ఐసోలేషన్‌లో ఉండటమనేది ఎవరికైనా ఒకవిధంగా నరకమే. రోజంతా ఆందోళనగా, రాత్రిళ్లు వ్యాధికి సంబంధించిన ఆలోచనలతో నిద్ర పట్టేది కాదు. అయితే ప్రార్థనలు చేస్తూ పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నించా. బేసిక్‌ ఎక్సర్‌సైజులు చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం ద్వారా నెగిటివ్‌ ఆలోచనలకు దూరంగా ఉండొచ్చనుకున్నా. కరోనా నాకు ఎలా సోకిందనే విషయం తెలియరాలేదు. బహుశా పేషెంట్‌ ద్వారా కానీ, సరకులు కొంటున్నప్పుడు కానీ వచ్చి ఉండొచ్చు. నేను అనారోగ్యం పాలు కావడానికి వారం ముందు ఎవరెవరిని కలిశానో ఒక లిస్ట్‌ తయారుచేశా. సాధ్యమైనంత వరకు వారందర్నీ అప్రమత్తం చేశా.


అదృష్టమేమిటంటే వారిలో ఒక్కరు కూడా ఈ మహమ్మారి బారిన పడలేదు. జ్వరంతో బాధపడుతున్నాను కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారంతో రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకున్నా. ప్రతీరోజూ ఉదయమే ఓట్స్‌, పండ్లు తినేవాణ్ణి. మధ్యాహ్నం, రాత్రికి రసం అన్నం, పప్పన్నం కూరగాయలతో కలిపి తీసుకునేవాణ్ణి. శరీరం హైడ్రేట్‌గా ఉండాలని నీళ్లు బాగా తాగేవాణ్ణి. 16వ రోజు కూడా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో నా కుటుంబసభ్యులు కాస్త ఆందోళన పడ్డారు. అయితే 18వ రోజు (ఏప్రిల్‌ 5) నాలో కొత్త శక్తి ప్రవేశించినట్లయ్యింది. అయినప్పటికీ మరో పది రోజులు ఐసోలేషన్‌లో ఉన్నా. కరోనా నెగిటివ్‌ వచ్చి, బాగా కోలుకున్న తర్వాత ప్లాస్మా డోనర్‌గా రిజిస్టర్‌ చేసుకున్నా.’’



భయపడొద్దు...

కరోనా సోకగానే చాలామంది భయపడిపోతారు. అయితే ఐసోలేషన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారి నుంచి బయటపడొచ్చు. అందుకోసం ఈ చిట్కాలు పాటించాలి.


వేడినీళ్లలో ఉప్పు వేసి, ఆ నీటిని గొంతులో పోసుకుని కాసేపటి తర్వాత పుక్కిలించాలి. దీని వల్ల దగ్గు వల్ల ఏర్పడే నంజు పోతుంది. రోజుకు రెండుసార్లు ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.


డీప్‌, స్లో బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది.

 

కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే ఎక్కువ మోతాదులో గోరువెచ్చటి నీళ్లు తాగాలి. 


ఉమ్మి వల్ల వైరస్‌ వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు వ్యాపించే తుంపరల్లోని వైరస్‌ మూడు నాలుగు వారాల పాటు జీవించే ఉంటుంది. కావున అందరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి.


ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తిచేసే వాటిని జాగ్రత్తగా డబుల్‌ బిన్‌ లేయర్‌ ఉన్న ప్లాస్టిక్‌ బ్యాగుల్లో వేసి పారేయాలి.

Updated Date - 2020-05-06T16:39:58+05:30 IST