Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుటుంబ పార్టీలతో కృశిస్తున్న ప్రజాస్వామ్యం

భారతదేశ రాజకీయాల్లో నిజమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి స్థానం ఉన్నదా? దేశంలో జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల్లోనూ అధికారం చలాయించిన పార్టీలు ఈ ప్రశ్నను పురిగొల్పాయి. దేశాన్ని పటిష్ఠపరిచారని, సంస్థలను బలోపేతం చేశారని కాంగ్రెస్ నేతలు జవహార్ లాల్ నెహ్రూ గురించి తరుచూ ఊదరగొడుతుంటారు. కాని ఆయన ప్రధానంగా బలోపేతం చేసింది కుటుంబం అనే సంస్థను అని మాత్రం వారు ప్రకటించబోరు. నిజానికి దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించడంలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మాగాంధీ తన ఏ కుటుంబ సభ్యుడినీ తన వారసుడుగా ప్రోత్సహించలేదు. కాని జవహర్ లాల్ నెహ్రూ దేశ రాజకీయాల్లో తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత కల్పించి మరీ వెళ్లిపోయారు. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూను ప్రోత్సహిస్తే జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీని ప్రోత్సహించారు. ఇందిరాగాంధీ కూడా తన తండ్రి జాడలోనే నడిచి తన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజయ్‌లను ప్రోత్సహించారు. ఎమర్జెన్సీలో సంజయ్‌గాంధీ ఆధ్వర్యంలో జరిపించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. ఇందిర మరణం తర్వాత పెద్దగా రాజకీయ అనుభవం లేని రాజీవ్‌గాంధీకి పగ్గాలు అప్పజెబితే, ఆయన సతీమణి సోనియాగాంధీ తెరవెనుక పాత్ర పోషించారు. రాజీవ్ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు కుటుంబపాలనకు అతీతంగా స్వతంత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపుతిప్పడాన్ని సోనియా, ఆమె అనుయాయులు జీర్ణించుకోలేకపోయారు.


కుటుంబ సంస్కృతిని దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలంటే ఒక కుటుంబ పాలన అన్న విషయం ప్రజలకు బోధపడింది. జమ్ముకశ్మీర్‌లో షేక్ అబ్దుల్లా కుటుంబం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ పెత్తనం చలాయిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుటుంబం, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, హర్యానాలో దేవీలాల్ కుటుంబం, హిమాచల్‌ప్రదేశ్‌లో వీరభద్ర సింగ్ కుటుంబం, కర్ణాటకలో దేవెగౌడ కుటుంబం, ఒడిషాలో బిజూ పట్నాయక్ కుటుంబం, మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబంతో పాటు బాల్ థాకరే కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు అధికారం కోసం అర్రులు చాస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలకు అంతు లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా, అధికారంలో ఉన్నప్పటి నుంచే తన కుమారుడిని అందలమెక్కించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ హయాంలో కుమారుడు కేటిఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీశ్‌రావు, దగ్గరి బంధువు సంతోష్‌తో పాటు అనేక మంది కుటుంబీకులు ఇష్టారాజ్యంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు.


రాజకీయాల్లో కుటుంబాల ఆధిపత్యం పెరిగిపోతే ఏం జరుగుతుంది? నేతలు అవినీతికి, అకృత్యాలకు పాల్పడినా వారినే ఎన్నుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పశుగ్రాస కుంభకోణంలో వేల కోట్లు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ తన భార్య రాబ్రీదేవిని గద్దెనెక్కించారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్టీని చలాయిస్తున్నాడు. వారసత్వ పాలన వల్ల అసమర్థులు వారసుల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను దోచుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. సమర్థులైన నాయకులు పార్టీలో ఉన్నా వారు ఒకే కుటుంబానికి బానిసలుగా బతకాల్సిన పరిస్థితి కనపడుతుంది. అధికారమంటే తమ జన్మహక్కుగా భావించే వారికి చట్టాలంటే, న్యాయస్థానాలంటే భయం ఉండదు. పనులకోసం ప్రజలు కుటుంబ సభ్యులచుట్టూ తిరుగుతూ భజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారసత్వపాలన వల్ల ఒకరకంగా ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం అమలు అవుతుంది. 


అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవకాశం వచ్చినప్పుడల్లా దేశానికి వారసత్వ పాలనవల్ల జరిగిన అనర్థాల గురించి వివరిస్తున్నారు. వారసత్వ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పు అని, ఒక రోగమని ఆయన స్పష్టం చేశారు. వారసులైనంత మాత్రాన రాజకీయాల్లో పాల్గొనడం తప్పని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఒకే కుటుంబం తరతరాలుగా పార్టీని, ప్రభుత్వాలను హస్తగతం చేసుకునే సంస్కృతిని ఆయన ఖండించారు. ఈ ఏడాది జనవరిలో జాతీయ యువ పార్లమెంట్ ఉత్సవాల్లో మాట్లాడుతూ దేశంలో యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లో పాల్గొనాలని వారసత్వపాలనకు అవకాశం లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ వారసత్వం మూలంగా దేశం కన్నా కుటుంబం ప్రధానమై పోతుందని ఆయన వివరించారు. నవంబర్ 26న రాజ్యాంగ దినం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వారసత్వ పాలన వల్ల రాజ్యాంగానికి జరుగుతున్న నష్టాన్ని మరింత స్పష్టంగా వెల్లడించారు. కుటుంబం కోసం కుటుంబం నడిపే పార్టీలకు ప్రజాస్వామ్య లక్షణం లేకుండా పోతుందని, దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం హరించుకుపోతుందని ఆయన హెచ్చరించారు. తల్లితండ్రుల పేర్లతో రాజకీయాల్లో రాజ్యం చేస్తున్న వారిని ఆయన ఎండగట్టారు.


భారతీయ జనతా పార్టీలో ఒకే కుటుంబం పెత్తనం చేసే సంస్కృతి లేదు. పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారెవరికైనా బిజెపిలో అగ్రస్థానం అందుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఒక బడిపంతులు అయిన వాజపేయి; కరాచీ నుంచి కట్టుబట్టలతో భారత్ చేరుకుని, తండ్రి ఆస్తి పాస్తులను త్యజించి సాధారణ కార్యకర్తగా పనిచేసిన ఆడ్వాణీ, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు, చాయ్ వాలాగా పనిచేసిన నరేంద్ర మోదీ ఉన్నత స్థానాలకు రాగలిగారు. పార్టీ అగ్ర నాయకులు కుమార్తెలు, కుమారులు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నప్పటికీ సాధ్యమైనంత మేరకు వారిని విస్మరించి అంతకంటే సమర్థులైన వారికి అవకాశం కల్పించే సంప్రదాయం బిజెపిలో ఉన్నదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తండ్రులు పూర్తిగా పదవీవిరమణ చేశాకే వారి పిల్లలకు వారి సమర్థతను బట్టి మాత్రమే అవకాశం కల్పించడం కేవలం బిజెపిలోనే జరుగుతుంది.


ఇవాళ పార్లమెంట్‌లో మోదీ విధానాలను, ఆయన తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న పార్టీల్లో అత్యధికం వారసత్వ పాలన ఆధారిత పార్టీలే. తమ పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులకు భజన చేస్తూ పదవులు ఆర్జించే వారంతా ఢిల్లీకి వచ్చి దేశంలో ప్రజాస్వామ్యం లేదని నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ దేశంలో వారసత్వానికి తావు ఇవ్వకుండా, కేవలం సమర్థతను గీటురాయిగా భావించే పార్టీ కేవలం బిజెపి మాత్రమే. అందుకే దేశంలో యువతలో అత్యధిక శాతం బిజెపివైపు మొగ్గు చూపుతున్నారు. దేశాన్ని కొన్ని భ్రష్ట కుటుంబాలకు అప్పజెప్పాలా, లేక దేశ సంస్కృతికీ, ఆర్థిక పటిష్ఠతకూ కృషి చేసే బిజెపికి అప్పజెప్పాలా అన్న పరిస్థితి తలెత్తినప్పుడల్లా ప్రజలు బిజెపి వైపే మొగ్గుతున్నారు.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement