కెమికల్‌లో ర్యాంకుల పంట

ABN , First Publish Date - 2022-08-11T06:49:37+05:30 IST

ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశాల కోసం నిర్వహించిన (డిప్లమో విద్యార్థులకు) ఏపీ ఈసెట్‌-2022 (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు

కెమికల్‌లో ర్యాంకుల పంట
ర్యాంకర్లతో అధ్యాపకులు

ఏపీ ఈసెట్‌లో సత్తా చాటిన నగర విద్యార్థులు

మొదటి 9 ర్యాంకులు కైవసం

పెట్రో పాలిమర్స్‌ బ్రాంచ్‌లో పదో ర్యాంకు సాధించిన మరో విద్యార్థి

విశాఖపట్నం/కంచరపాలెం, ఆగస్టు 10: ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశాల కోసం నిర్వహించిన (డిప్లమో విద్యార్థులకు) ఏపీ ఈసెట్‌-2022 (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. పలు విభాగాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. గత నెల 22న జేఎన్‌టీయూకే నిర్వహించిన ఎంట్రన్స్‌ పరీక్షకు విశాఖ జిల్లా నుంచి 6,306 మంది హాజరు కాగా, 5,822 మంది (92.32 శాతం) అర్హత సాధించారు. అలాగే అనకాపల్లి జిల్లా నుంచి 184 మంది హాజరు కాగా, 170 మంది (92.39 శాతం) అర్హత సాధించారు. 

విద్యార్థులు సత్తా.. 

కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కంచరపాలెం ప్రభుత్వ కెమికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మొదటి తొమ్మిది ర్యాంకులు కైవసం చేసుకున్నారు. కళాశాలకు చెందిన జి.నాగరాజు మొదటి ర్యాంకు సాధించగా, ఎన్‌.యోషిత రెండో ర్యాంకు, కె.నరసింహనాయుడు మూడో ర్యాంకు, ఆర్‌.దుర్గాచంద్రకళాధర్‌ నాలుగు, కె.హేమంత్‌కుమార్‌ ఐదు, కె.దినేష్‌ కుమార్‌ ఆరు, కె.హేమంత్‌ ఏడు, కె.వినయ్‌కుమార్‌ ఎనిమిది, పి.నాగేంద్ర తొమ్మిదో ర్యాంకు సాధించారు. అలాగే, పెట్రో పాలిమర్స్‌ బ్రాంచ్‌ విభాగంలో ఐ.జగన్‌ రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. ర్యాంకర్లను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ రమణ, అధ్యాపకులు డాక్టర్‌ బీవీ లక్ష్మణరావు, వేణుమాధవ్‌, జయ ప్రకాష్‌రెడ్డి తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా  విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల అధ్యాపకులు అందించిన అత్యుత్తమ బోధన, ప్రోత్సాహంతో ర్యాంకులు సాధించగలిగినట్టు విద్యార్థులు తెలిపారు. 


Updated Date - 2022-08-11T06:49:37+05:30 IST