ఎముకలు కొరికే చలిలో దుప్పటి కప్పుకుని మరీ బైక్‌పై భార్యాభర్తల ప్రయాణం.. మధ్యలో ఆరేళ్ల కొడుకు శవం..!

ABN , First Publish Date - 2022-01-28T22:34:24+05:30 IST

తలకొరివి పెడతాడుకున్న కొడుకు, అనూహ్యంగా తమ కళ్ల ముందే తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు కొడుకు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్సులు అందుబాటులో లేవు. దీంతో అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో..

ఎముకలు కొరికే చలిలో దుప్పటి కప్పుకుని మరీ బైక్‌పై భార్యాభర్తల ప్రయాణం.. మధ్యలో ఆరేళ్ల కొడుకు శవం..!

‘‘తెల్లవారితే జెండా పండుగ ఉంది.. కొత్త చొక్కా వేసుకుని స్కూల్‌కి వెళ్తానంటివి.. ఇలా ఉన్నట్టుండి మమ్మల్నే వదిలేసి వెళ్లిపోయావా’’.. అంటూ నిర్జీవంగా ఉన్న తమ ఆరేళ్ల కొడుకును పట్టుకుని ఆ దంపతులు గుండెలవిసేలా రోధించారు. తలకొరివి పెడతాడనుకున్న కొడుకు, అనూహ్యంగా తమ కళ్ల ముందే తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు కొడుకు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్సులు అందుబాటులో లేవు. దీంతో అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో కొడుకు శవాన్ని బైక్‌పై పెట్టుకుని.. ఏకంగా 40కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా పరిధిలోని సదక్వాడి గ్రామంలో యువరాజ్ పార్ధి కుటుంబ నివాసం ఉంటోంది. వీరికి అజయ్ పార్ధి (6) అనే కొడుకు ఉన్నాడు. భవిష్యత్‌లో తమ కొడుకు తమలా కష్టపడకూడదని బాగా చదివిస్తున్నారు. ఇదిలావుండగా, మంగళవారం అజయ్‌కి జలుబు చేయడంతో అస్వస్థతతకు గురయ్యాడు. దీంతో వెంటనే జవహర్ అనే పట్టణంలోని ప్రభుత్వ కుటీర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చిన్నారి చనిపోయాడు. కొడుకు మరణవార్త వినగానే ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. మరోవైపు కనీసం కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్సులు కూడా లేకపోవడం.. వారిని మరింత బాధకు గురిచేసింది.

ఇలాంటి అత్త కూడా ఉంటుందా.! పెళ్లయిన ఆరు నెలలకే కొడుకు చనిపోయినా.. కోడలిని ఇంట్లోనే ఉంచుకుని.. చివరకు ఏం చేసిందంటే..


ఆస్పత్రి సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ భార్యాభర్తలకు దిక్కుతోచలేదు. ఎలాగైనా రాత్రికి ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఎముకలు కొరికే చలిలో కూడా కొడుకు మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బైకుపై పెట్టుకుని బయలుదేరారు. సుమారు 40కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి రాత్రికి రాత్రే తీసుకెళ్లారు. అనంతరం బుధవారం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రిలో మూడు అంబులెన్సులు ఉన్నా తమకు ఇవ్వడానికి వైద్యులు నిరాకరించారని అజయ్ కుటుంబీకులు ఆరోపించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.

భర్త అనుమానాస్పద మృతి.. ఇంట్లో దొరికిందో పగిలిపోయిన ఫోన్.. రిపేర్ చేయించాక చెక్ చేసిన పోలీసులకు..


దీనిపై ఆస్పత్రి సీఎంవో రాందాస్ మారడ్ మాట్లాడుతూ కొవిడ్ కేసులు పెరుగుతున్నందున మృతదేహాలను అంబులెన్స్‌లలో తరలించడాన్ని నిషేధించామని తెలిపారు. పొద్దున వరకు ఆస్పత్రిలో ఉండమన్నామని.. అయితే శవ పరీక్ష చేస్తారనే భయంతో రాత్రికి రాత్రే వెళ్లారన్నారు. ప్రైవేట్ అంబులెన్స్‌లను సంప్రదించగా డబ్బులు ఎక్కువగా అడగడంతో చిన్నారి తల్లిదండ్రులు బలవంతంగా బైక్‌పైనే వెళ్లినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి.. ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లను విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలంతా స్కూల్లో జెండా పండుగకు వెళ్తుంటే.. అజయ్ ఇలా శవమై ఇంటికి రావడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

అస్వస్థత కారణంగానే కొడుకు చనిపోయాడనుకున్నారు.. ఓ రోజు కోడలు ఫోన్‌లో మాట్లాడుతుండగా అనుమానం రావడంతో..

Updated Date - 2022-01-28T22:34:24+05:30 IST