వర్షంతో పత్తికి జీవం

ABN , First Publish Date - 2022-08-10T05:22:29+05:30 IST

వారం రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షంతో పత్తిపైరు జీవం పోసుకుంది. దీంతో పత్తి రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

వర్షంతో పత్తికి జీవం
వర్షంతో జీవం పోసుకున్న పత్తి పైరు

పెద్ద దోర్నాల, ఆగస్టు 9: వారం రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షంతో పత్తిపైరు జీవం పోసుకుంది. దీంతో పత్తి రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేసినట్లయితే పత్తిలో అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

రైతులుతెల్ల బంగారంగా పిలుచుకునే పత్తి సాగు ఈ ఏడాది  మండలంలో సుమారుగా 1500 హెక్టారుల్లో సాగు చేశారు. రెండేళ్లుగా గులాబిరంగు పురుగు దాడికి పత్తిలో విపరీతంగా నష్టాలు చవిచూశారు. ఎకరం పత్తి సాగుకు రూ.60,000ల నుంచి రూ. 75,000లు ఖర్చవుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 15నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ క్రమంలో గతేడాది పత్తి కేవలం 500 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. అయినా ఎకరానికి 5, 6 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. మరో వైపు రైతులు ఎంతో ఆసక్తితో సాగు చేసిన మిరప పంటలో కూడా ఎర్రనల్లి తెగులుతో అపార నష్టం వాటిల్లింది. ఈ ఏడాది పత్తి ధరలు తొలినాళ్లలో ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటాలు రూ.12,000ల నుంచి రూ.14,000ల వరకు పలికింది. దీంతో రైతాంగం అధిక విస్తీర్ణంలో పత్తి సాగుకు ఉపక్రమించారు. వేసవి సాగుతో పాటు జూన్‌లో కొందరు పత్తి విత్తారు. తీరా పత్తి పంట దశకు వచ్చేసరికి ధరలు కూడా దిగజారాయి. ప్రస్తుతం క్వింటాలు ధర రూ.7,500ల నుండి రూ.9,000లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఈ ధరలు ఉంటే ఏ మాత్రం గిట్టుబాటు కావని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పొంచి ఉన్న గులాబిరంగు పురుగు

పత్తిపంటకు ప్రధానంగా గులాబిరంగు పురుగు నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత చల్లని వాతావరణానికి పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్న పంటకు అక్కడక్కడ ఈ పురుగు సోకింది. దీని నివారణకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని మందులు పిచికారి చేసినా నివారణ కావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంభిస్తూ పంటను పురుగు నుంచి కాపాడుకోవాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.


Updated Date - 2022-08-10T05:22:29+05:30 IST