JCB = జీహాద్ కంట్రోల్ బోర్డు : జీవీఎల్

ABN , First Publish Date - 2022-04-20T20:15:57+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను

JCB = జీహాద్ కంట్రోల్ బోర్డు : జీవీఎల్

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించడం ప్రారంభమైన కొద్ది సేపటికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ ఈ ఆక్రమణలను జేసీబీ (బుల్డోజర్)తో కూల్చుతున్న నేపథ్యంలో జేసీబీ అంటే జీహాద్ కంట్రోల్ బోర్డ్ అని పేర్కొన్నారు. 


జహంగీర్‌పురి ప్రాంతంలోనే శనివారం హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా దాడులు జరిగాయి. ఈ కేసులో దాదాపు 25 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలావుండగా, ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ బుధవారం ఈ ప్రాంతంలోని చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించింది, కొన్ని ఆక్రమణలను తొలగించింది. అనంతరం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఆక్రమణలను తొలగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్లు వాదనలు వినిపించారు. ఈ కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ ఆదేశాలు వచ్చినప్పటికీ, ఎంసీడీ అధికారులు తమ పనిని కొనసాగించారు. సీపీఎం నేత బృందా కారత్ సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులకు అందజేయడంతో బుల్డోజర్లకు బ్రేక్ పడింది. 


జీవీఎల్ నరసింహారావు ఇచ్చిన ట్వీట్‌లో, JCB =  జీహాద్ కంట్రోల్ బోర్డ్! అని పేర్కొన్నారు. దీంతో వివిధ పార్టీల నేతలు ఆయనపై మండిపడ్డారు. ఈ ఆక్రమణల తొలగింపు ప్రారంభ సమయంలోనే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం నేతలు బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-04-20T20:15:57+05:30 IST