భూమి కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2020-07-12T09:54:46+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాల పంపిణీ పేరుతో చేపట్టిన భూమి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ

భూమి కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలి

ధరణికోట, ముత్తాయపాలెంలలో తనఖా భూములు కొనుగోలు

అధికార వైసీపీ నేతల ప్రమేయం

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి


అమరావతి, జూలై 11: వైసీపీ ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాల పంపిణీ పేరుతో చేపట్టిన భూమి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను ఎన్నాళ్లనుంచో నివేశనస్థలాలకు కేటాయించిన భూముల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని చేసిన ప్రకటనలు నేడు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ధరణికోట, ముత్తాయపాలెంలలో సుమారు 400మందికి పంపిణీచేయనున్న నివేశనస్థలాలకు సేకరించిన 8.25 ఎకరాల భూమిలో 2.95 ఎకరాలను రైతులు మోదేపల్లి అచ్యుతరామారావు, శ్రీనివాసరావులు గుంటూరులోని సెంట్రల్‌బ్యాంక్‌లో తనఖా పెట్టి రుణం పొందారని, అ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించి రైతులకు రూ.1.6 కోట్లు బ్యాంక్‌లలో జమచేయడం చూస్తుంటే దీనిలో రైతులతో పాటు రెవెన్యూ అధికారులు, వైసీపీ నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.


ఏదైనా భూమిని కొనుగోలు చేయాలంటే ఈసీ తీసుకుని ఆ భూమిపై రుణాలకు సంబంధించి లావాదేవీలు ఉన్నాయా? లేవా? అని నిర్ధారించుకున్న తరువాత భూమిని కొనుగోలు చేస్తారని, అలాంటిది రూ.1.6కోట్లు ప్రభుత్వ ధనాన్ని రైతుల ఖాతాలకు జమచేసే సమయంలో అధికారులు పరిశీలించాల్సివుండగా జరిగిన సంఘటన దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని కొమ్మాలపాటి పేర్కొన్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు స్థానిక వైసీపీ నాయకులు ధరణికోట, అమరావతిలో రైతులతో ముందుగా రూ.25 నుంచి 35 లక్షల వరకు అగ్రిమెంట్‌లు చేయించుకుని అధికారబలంతో ఆ భూములనే నివేశన స్థలాలకు మంజూరు చేయించి ఎకరాకు రూ.55 లక్షలు ధరను నిర్ధారించి రైతుల ఖాతాలలో జమచేయించారని ఆయన తెలిపారు.


ఈ పద్ధతి ద్వారా వైసీపీ నాయకులకు, అధికారులకు పైసా ఖర్చులేకుండా సుమారు రూ.రెండు కోట్లు జేబులలోకి వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. భూముల కొనుగోలుపైనా విచారణ చేపట్టాలని శ్రీధర్‌ డిమాండ్‌చేశారు. వైసీపీ నాయకులు ఆడిన ఆటలో రైతులు, అధికారులు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. 


లోను రికవరీపై బ్యాంక్‌ అధికారులతో చర్చ

ముత్తాయపాలెంలో పేదల నివేశనస్థలాల కోసం సేకరించిన 8.25 ఎకరాల భూమికి సంబంధించి బ్యాంక్‌ తాకట్టులో ఉన్న 2.95ఎకరాల భూమికి చెందిన రైతులతో సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారులు శనివారం స్థానిక అధికారుల సమక్షంలో చర్చలు జరిపారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.75 లక్షలు చెల్లిస్తామని రైతులు చెప్పగా ప్రభుత్వం నుంచి అధికంగా డబ్బులు వచ్చినందున పూర్తి అప్పు రూ.1.02కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఉభయుల మధ్య విషయం కొలిక్కి రాకపోవడంతో సోమవారం ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. రికవరీ చేసినప్పటికీ కేసుమాత్రం యధావిధిగా ఉంటుందని సీఐ విజయకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-07-12T09:54:46+05:30 IST