ఐదుసార్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సివిల్ సర్జన్!

ABN , First Publish Date - 2022-01-18T17:28:20+05:30 IST

బిహార్‌లోని పాట్నాలో ఓ సివిల్ సర్జన్ ఐదు కోవిడ్ టీకా మోతాదులను

ఐదుసార్లు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సివిల్ సర్జన్!

పాట్నా : బిహార్‌లోని పాట్నాలో ఓ సివిల్ సర్జన్ ఐదు కోవిడ్ టీకా మోతాదులను తీసుకున్నట్లు రికార్డులు చెప్తుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అయితే తాను నిబంధనల ప్రకారం మూడుసార్లే వీటిని తీసుకున్నానని, తన పాన్ కార్డ్ వివరాలతో వేరొకరు ఎవరో మిగిలిన డోసులు తీసుకున్నారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆ డాక్టర్ కోరుతున్నారు. 


రికార్డులను పరిశీలించినపుడు సివిల్ సర్జన్ డాక్టర్ విభా కుమారి సింగ్ కోవిడ్-19 టీకాలు ఐదు డోసులను తీసుకున్నట్లు కనిపిస్తోంది. CoWIN portalలోని వివరాల ప్రకారం ఆమె 2021 జనవరి 28న మొదటి డోసు తీసుకున్నారు. గత ఏడాది మార్చినాటికి ఆమెకు సంపూర్ణ టీకాకరణ జరిగింది. 2021 ఫిబ్రవరి 6న, జూన్ 17న తన పాన్ కార్డు ఆధారంగా వ్యాక్సిన్ డోసులను తీసుకున్నారు. అదేవిధంగా 2022 జనవరి 13న ముందు జాగ్రత్త డోసును తీసుకున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 


పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


ఇదిలావుండగా, సివిల్ సర్జన్ డాక్టర్ విభా కుమారి మాట్లాడుతూ, తాను నిబంధనల ప్రకారమే కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నానని తెలిపారు. తన పాన్ కార్డు వివరాలను ఉపయోగించి వేరొకరు ఎవరో టీకాలు తీసుకున్నారని, దీనిపై దర్యాప్తు జరపాలని కోరారు. 


ఉత్తర బిహార్‌లోని మాధేపుర జిల్లాకు చెందిన బ్రహ్మదేవ్ మండల్ (84) కూడా ఇదేవిధంగా వ్యాక్సిన్ డోసులను తీసుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాను తన ఆధార్, ఓటర్ ఐడీలను ఉపయోగించి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించానని, 12సార్లు టీకా మోతాదులను తీసుకున్నానని ఆయన చెప్పారు. 11 నెలల క్రితం తాను మొదటి డోసు తీసుకున్నానని, అప్పటి నుంచి తనకు జలుబు చేయలేదని అన్నారు. తాను తీసుకున్న ప్రతి వ్యాక్సిన్ డోసు నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి తనకు ఉపయోగపడిందని చెప్పారు.




Updated Date - 2022-01-18T17:28:20+05:30 IST