చైనాలో మహిళ చేసిన పని హాట్‌టాపిక్.. పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకల కోసం రూ.11లక్షలు ఖర్చు.. 520 డ్రోన్లతో..

ABN , First Publish Date - 2022-01-07T01:37:52+05:30 IST

పెంపుడు కుక్క పుట్టిన రోజు సందర్భంగా ఓ మహిళ చేసిన పని చైనాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కుక్కపై ఉన్న ప్రేమతో రూ.11లక్షలు ఖర్చు చేయడం ఒకెత్తైతే.. స్థానిక నిబం

చైనాలో మహిళ చేసిన పని హాట్‌టాపిక్.. పెంపుడు కుక్క పుట్టిన రోజు వేడుకల కోసం రూ.11లక్షలు ఖర్చు.. 520 డ్రోన్లతో..

ఇంటర్నెట్ డెస్క్: పెంపుడు కుక్క పుట్టిన రోజు సందర్భంగా ఓ మహిళ చేసిన పని చైనాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కుక్కపై ఉన్న ప్రేమతో రూ.11లక్షలు ఖర్చు చేయడం ఒకెత్తైతే.. స్థానిక నిబంధనలను కూడా లెక్క చేయకపోవడం మరొక ఎత్తు. ఇంతకూ 520 డ్రోన్లతో ఆమె ఏం చేసిందనే వివరాలను ఒకసారి పరిశీలిస్తే..


చైనాలోని చాంగ్షా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు తన పెంపుడు కుక్క అంటే ప్రాణం. తన కుక్కను ఆమె ప్రేమగా డౌడౌ అని పిలుచుకుంటుంది. డౌడౌ 10వ పుట్టిన రోజును గ్రాండ్‌గా చేయాలని సదరు మహిళ భావించింది. ఇందులో భాగంగానే ఏకంగా 10లక్షల యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.11లక్షలు) ఖర్చు చేసి, 520 డ్రోన్లను అద్దెకు తీసుకుంది. సినిమాటిక్‌గా డ్రోన్ల ద్వారా ఆకాశంలో రకరకాల ఆకారాలు ఏర్పడే విధంగా ప్రోగ్రామ్ చేయించింది.



 దీంతో.. డౌడౌ 10వ ఏడాదిలోకి అడుగుపెట్టిన వెంటనే.. జియాంగ్ జియాంగ్ నదిపై ఏకంగా 520 డ్రోన్లు ఆకాశంలోకి ఎగిరి.. డౌడౌకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం సదరు మహిళ చేసిన పని చైనాలో హాట్ టాపిక్ అయింది. జనావాసాల మధ్య డ్రోన్లు ఎగరవేయడానికి అనుమతి లేదని స్థానిక అధికారులు తెలిపారు. ఆ మహిళ నిబంధనలు అతిక్రమించినట్టు వెల్లడించారు. 




Updated Date - 2022-01-07T01:37:52+05:30 IST