బీజేపీకి దీటుగా!

ABN , First Publish Date - 2022-07-06T08:22:18+05:30 IST

తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచడంతో..

బీజేపీకి దీటుగా!

  • రెండు బహిరంగ సభలకు కాంగ్రెస్‌ ప్రణాళిక 
  • పాల్గొనేందుకు రాహుల్‌ అంగీకారం
  • మంత్రి కేటీఆర్‌ ఇలాకా సిరిసిల్లలో.. 
  • విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై సభ
  • గిరిజనుల సమస్యలపై ఖమ్మంలో 
  • రైతు డిక్లరేషన్‌ తరహాలో డిక్లరేషన్లు
  • భారీగా నేతల చేరికలకూ ప్రణాళిక 
  • జూపల్లి కృష్ణారావు, పి.శశిధర్‌రెడ్డి, 
  • ప్రవీణ్‌రెడ్డి చేరనున్నట్లు ప్రచారం
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా!
  • ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి?
  • చేరికలపై కాంగ్రెస్‌ నాయకత్వం గోప్యత 


హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచడంతో.. రాష్ట్ర కాంగ్రెస్‌ సైతం అందుకు దీటైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఏఐసీసీ అగ్రనేత రాహల్‌గాంధీతో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్‌ చేసింది. వీటిలో ఒక సభను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం సిరిసిల్లలో, మరో సభను ఖమ్మం జిల్లాలో నిర్వహించనుంది. ఈ రెండు సభల్లో పాల్గొనేందుకు రాహుల్‌గాంధీ కూడా అంగీకారం తెలిపారు. ఏయే తేదీల్లో ఈ సభలు నిర్వహించాలన్నది.. త్వరలో టీపీసీసీ ముఖ్యనేతలు సమావేశమై నిర్ణయించనున్నారు. 


దేశంలో ప్రత్యామ్నాయ విధానం పేరుతో సీఎం కేసీఆర్‌ బీజేపీపై విరుచుకు పడుతుంటే.. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభను నిర్వహించడం ద్వారా కేసీఆర్‌కు బీజేపీ సవాల్‌ విసిరడం తెలిసిందే. కేసీఆర్‌ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకోవడంతో క్షేత్రస్థాయి ప్రజానీకంలో ఆ పార్టీ పట్ల కొంత ఆసక్తి ఏర్పడింది. దీనిని ఓటు రూపంలోకి మార్చుకునేందుకు గ్రామీణ నియోజకవర్గాల్లోకి చొచ్చుకుపోయే కార్యక్రమాలను బీజేపీ రూపొందించుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రేసులో వెనుక పడకుండా బీజేపీకి దీటుగా కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ కాంగ్రెస్‌ పూనుకుంది. ఇతర పార్టీల నుంచి చేరికలనూ ప్రోత్సహిస్తూనే బహిరంగ సభలను తలపెట్టింది. తెలంగాణలో ఉద్యోగాలు కేవలం కేసీఆర్‌ కుటుంబానికే వచ్చాయంటూ ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని ఎత్తి చూపేందుకే విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై సభ ను మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం సిరిసిల్లలో నిర్వహించాలన్న నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపా యి. ఇక ఖమ్మం జిల్లాలో గిరిజన సమస్యలపై సభను నిర్వహించనున్నారు. సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఈ రెండు సభల్లో పాల్గొనాల్సిందిగా కోరగా.. ఆయన అంగీకరించారు. సెప్టెంబరు, నవంబరులలోఈ సభలను నిర్వహించే అవకాశంఉంది.


భారీ చేరికలకూ ప్లాన్‌ ..!

భారీ సభలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు పెద్ద ఎత్తున నేతల చేరికలతో ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల నమ్మకం కల్పించేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోం ది. ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితాపై అధిష్ఠానం నుంచి ఆమోదం కూడా తీసుకున్నారు. ఈ నెల 7న  గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి పలువురు ముఖ్యనేతలు చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు మంగళవారం మీడియాలో ప్రచారం జరిగింది. కొండేటి శ్రీధర్‌ ఈ ప్రచారాన్ని ఖండించారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లో చేరననున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఓ మాజీ మంత్రి కూడా ఉన్నట్లు చెప్పుకొంటున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేయడంతో ఆయన కూడా పార్టీ మారతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

చేరికలపై గోప్యత అందుకే..

చేరికలనూ ఒక అస్త్రంగా ఎంచుకున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారి డిమాండ్లను ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి తెలుపుతూ అనుమతి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఓ మాజీ ఎంపీ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్‌ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే పార్టీలో ఎవరెవరు చేరుతున్నారు.. ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్న విషషయంపై కాంగ్రెస్‌ నాయకత్వం గోప్యత పాటిస్తోంది. పేర్లు బయటికి వస్తే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు.. ఆయా నేతలతో మాట్లాడి జాగ్రత్త పడుతుండడమే ఇందుకు కారణమని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-07-06T08:22:18+05:30 IST