Abn logo
Feb 14 2020 @ 05:28AM

ఓబీసీల జనగణన ప్రస్తుతావసరం

బీజేపీ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఓబీసీల వివరాలను సేకరిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ అది ఇప్పుడు అమలు కావడం దాదాపు అసంభవంగా కనిపిస్తున్నది. ఈ సందర్భంలో బీసీ విద్యావంతులందరూ తమ బాధ్యతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరమున్నది. తెలంగాణ, అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలు ఓబీసీ జనగణన 2021లోనే చేపట్టాలని తీర్మానించాలి. తద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బీసీల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన సందర్భమిది.

దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు జనాభా లెక్కల సేకరణ జరుగనుంది. ప్రతి పదేండ్లకోసారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత జనాభా లెక్కల రిజిస్ర్టార్‌ ఈ గణాంకాలను సేకరిస్తారు. 2021 జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాలను కూడా సేకరించాలని మహారాష్ట్ర, బిహార్‌, ఒడిషా రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. ఓబీసీల జనగణన చేస్తామంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. 2018 సెప్టెంబర్‌ రెండున అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘2021 జనాభా లెక్కల్లో మొదటి సారిగా ఓబీసీల గణాంకాలు’ సేకరిస్తామని ప్రకటించారు. ఓబీసీల్లో సబ్‌ కేటగిరీ చేయడం కోసం కేంద్ర ఒక కేబినెట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, ఈ హామీని తోసిరాజంటూ ఇప్పుడు ఓబీసీల వివరాలు లేకుండా 33 ప్రశ్నలతో జనాభా లెక్కలు సేకరించాలని నిర్ణయించారు. అందులో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే వివరాలు మాత్రమే ఉన్నాయి. దీని వల్ల ఓబీసీలు మరోసారి మోసపోయే ప్రమాదం ఏర్పడింది. 

కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే దేశంలో ఆయా కులాల మధ్యన ఘర్షణ జరిగే ప్రమాదముందని చెబుతూ ఇన్నేండ్లూ కుల జనగణన చేయలేదు. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీల గణాంకాలు తప్పనిసరి కావడంతో వారికి సంబంధించిన సమాచారాన్ని జనాభా లెక్కల్లో భాగంగా సేకరిస్తున్నారు. అలాగే మతపరమైన వివరాలు, భాషా పరమైన సమాచారం కూడా ఈ గణాంకాల్లో సేకరిస్తున్నారు. ఈ సమాచారం సేకరించినప్పుడు జరగని ఘర్షణలు కులపరమైన సమాచారం సేకరిస్తే జరుగుతాయని చెప్పడమంటే బ్రాహ్మణీయ, మనువాద భావజాలం గల వాండ్లు కుల జనగణనను అడ్డుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. 

ఓబీసీల సబ్‌ కేటగిరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోహిణి కమిటీ కాల పరిమితిని పొడిగిస్తూ ఆ సామాజిక వర్గాల పట్ల తమ పట్టిలేని తనాన్ని ప్రభుత్వం ప్రకటించుకుంది. బీజేపీ వాళ్లు చాలా సార్లు మా ప్రధాన మంత్రే ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు, మాకు వారి పట్ల ఎలాంటి వివక్ష లేదు అని ప్రకటించుకుంటున్నారు. కానీ, ఆచరణలో మాత్రం ఓబీసీల పట్ల బీజేపీ పూర్తిగా వివక్షతో వ్యవహరిస్తోంది. ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేస్తోంది. లెక్కలు సేకరించినట్లయితే కచ్చితమైన సమాచారం ఉంటది కాబట్టి తమ జనాభా దామాషాలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలు రిజర్వేషన్లు డిమాండ్‌ చేస్తారని, ఆ మేరకు తమకు నష్టం కలుగుతుందని అగ్రవర్ణ అధికారులు ఈ గణనను అడ్డుకుంటున్నారు(ప్రస్తుతం లెక్కలు సరిగ్గా లేని కారణంగా కోర్టులు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి). అట్లాగే ఓబీసీలు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేసే అవకాశం ఉండడం, ఏ కులం వారు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో ఆయా ప్రాంతాల నుంచి వారు పోటీ చేయడం, దీని వల్ల అగ్ర కులాల వారి ఆధిపత్యానికి గండి పడనుండడంతో ఓబీసీ జనాభా గణన చేయకుండా అడ్డుకుంటున్నారు. 

ఒక వైపు అగ్ర కులాల వారు పత్రికల్లో మాట్రిమొనీలో కులాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కులాల వారీగా పెళ్లిళ్లు కుదిర్చే సంస్థలు టీవీల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. కులపరమైన అపార్ట్‌మెంట్లను, కాలనీలను కట్టుకుంటున్నారు. సమాజంలో ఏది చేయాలన్నా, చేయకూడదన్నా దాని వెనుక కులహస్తం పని చేస్తోంది. అట్లాంటిది కులపరమైన లెక్కలు సేకరించడానికి డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్‌ లాంటి ఒకటి రెండు పార్టీలు మినహా అన్ని పార్టీలు ఓబీసీల గణన విషయంలో గోడమీద పిల్లుల లాగా వ్యవహరిస్తున్నాయి. 

కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నటువంటి ఓబీసీ జాతీయ నాయకులు నానా పటోలే స్వయంగా అసెంబ్లీలో జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాలు సేకరించాలని ప్రతిపాదించారు. అసెంబ్లీలో ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌, శివసేన, ఎన్సీపీ, బీజేపీలు సమర్థించాయి. అట్లాగే ఒడిషా కేబిటెన్‌ కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కూడా బిహార్‌ అసెంబ్లీలో ఓబీసీ జనగణనకు మద్దతుగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. 

ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో వివిధ సందర్భాల్లో ఓబీసీల వివరాలను సేకరిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ అది ఇప్పుడు అమలు కావడం దాదాపు అసంభవంగా కనిపిస్తున్నది. ఈ సందర్భంలో బీసీ విద్యావంతులందరూ తమ బాధ్యతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరమున్నది. తెలంగాణ, అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలు ఓబీసీ జనగణన 2021లోనే చేపట్టాలని తీర్మానించాలి. తద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. బీసీల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన సందర్భమిది. 

నిజానికి మండల్‌ కమిషన్‌ తన నివేదికలో 1981జనగణనలో ఓబీసీల వివరాలు సేకరించాలని సిఫారసు చేసింది. ‘మేము ఓబీసీల వివరాలు సేకరించడంలో చాలా ఇబ్బంది పడ్డాము. ప్రభుత్వ సంస్థలు చాలా వరకు సహకరించలేదు. చివరిసారిగా కులగణన జరిగింది 1931లో. ఆనాటి లెక్కల ఆధారంగా బీసీ జనగణన చేశామని’ మండల్‌ కమిషన్‌ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే, 1931 జనాభా లెక్కల ప్రాతిపదికనే ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నివేదిక సమర్పించారు. 

దేశ జనాభాలో 55 శాతం వరకు ఉన్న ఓబీసీల వివరాలు ఒక క్రమపద్ధతిలో సేకరించినట్లయితే ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా ప్రగతికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. వీటి ఆధారంగా మెరుగైన ప్రణాళికలను రచించి వాటిని అమల్లోకి తీసుకొచ్చినట్లయితే ఓబీసీల అభివృద్ధి జరిగే అవకాశముంది. సంక్షేమ రంగంలో కూడా ఈ లెక్కలు కీలకం కానున్నవి. ఇప్పటికే విద్యార్థులకు వివిధ స్థాయిల్లో స్కాలర్‌షిప్పులు ఇస్తున్నారు. మండల్‌ కమిషన్‌ ఆధారంగా 27 శాతం ఉద్యోగాలను ఓబీసీలకు రిజర్వు చేసింది. ఇవన్నీ పకడ్బందీగా అమలు జరగడానికి ఈ 2021 ఓబీసీ జనగణన తోడ్పడుతుంది. 

­1990వ దశకం నుంచి దేశవ్యాప్తంగా బహుజన చైతన్యం పెరగడంతో 2001, 2011లో పెద్ద ఎత్తున బుద్ధిజీవులు, సంస్థలు, సామాజిక న్యాయం కోసం నిలిచే పార్టీలు వరుసగా బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చాయి. 2001లో వాజపేయి ప్రభుత్వం గణాంకాల సేకరణ విషయంలో ఓబీసీలకు మొండి చేయి చూపించింది. ఆ తర్వాత పదేండ్లకు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఓబీసీ జనగణనకు సమ్మతించారు. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన అంతా కేంద్రమంత్రి, ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వీరప్ప మొయిలీకి అప్పగించిండ్రు. అయితే, ఈ లెక్కల సేకరణ హోంమంత్రిత్వ శాఖ తరపున సేకరించాలి. దీంతో ఆనాడు హోంమంత్రిగా ఉన్నపి. చిదంబరం 2011 జనాభా లెక్కల్లో భాగంగా కాకుండా ప్రత్యేకంగా సేకరిస్తామని ప్రకటించారు. దీనికి అప్పటి ఆర్ధిక శాఖమంత్రి ప్రణబ్‌ముఖర్జీ వత్తాసు పలికిండు. దీంతో 2011గణాంకాల్లో ఓబీసీల వివరాలు సేకరించలేదు. కానీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఓబీసీల లెక్కలు సేకరించిండ్రు. ఇందుకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 4893కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ‘సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల’ గణన పేరిట సాగిన ఈ లెక్కల సేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పిండ్రు. దీంతో ఆయా రాష్ట్రాలు ఈ లెక్కలను కొందరు ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా, మరికొందరు అంగన్‌వాడీ టీచర్ల ద్వారా, మరి కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల ద్వారా, అట్లాగే ఇంకొన్ని ప్రభుత్వాలు ఎలాంటి బాధ్యత, జవాబుదారీ లేని వ్యక్తుల ద్వారా సమాచార సేకరణ జరిపించాయి. ఇట్లా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సేకరించిన ఈ గణనలో తొమ్మిది కోట్ల తప్పులు దొర్లాయి. ఇన్ని కోట్ల తప్పులున్న సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎలాంటి పాలసీనీ తయారు చేయలేని స్థితి.

నిజానికి 1948 సెన్సస్‌ చట్టం ప్రకారం జనాభా గణన చేయడమనేది ఒక చట్టబద్ధమైన వ్యవహారం. ఈ చట్టం ప్రకారం జనాభా గణనలో పాల్గొనడానికి నిరాకరించిన సిబ్బందిని, తప్పుడు సమాచారం ఇచ్చిన జనాన్ని శిక్షించడానికి అవకాశమున్నది. చట్టపరంగా గుర్తింపు ఉన్న 2011జనాభా లెక్కల్లో భాగంగా ఓబీసీల వివరాలు సేకరించకుండా ఉండడమంటేనే కాంగ్రెస్‌ వాళ్ళ చిత్తశుద్ధిని శంకించాలి. అంతేగాకుండా ఎస్‌ఇసిసి (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాల గణన) పేరిట దాదాపు ఐదువేల కోట్ల రూపాయలు వెచ్చించి సేకరించిన లెక్కలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయాయి. ఈ లెక్కలు బయటపెట్టి వాటి ఆధారంగా ఓబీసీల అభివృద్ధికి ప్రణాళికలు రచించాలని కొందరు కోర్టును ఆశ్రయించగా అందుకు వారు ఈ లెక్కలకు చట్టబద్ధత లేదని తేల్చేసిండ్రు. ఇందుకు కారణం ఈ గణన చట్టం గుర్తించిన ‘రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ సెన్సస్‌’ ద్వారా సేకరించకపోవడం. అంటే జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఇవ్వాళ కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా నేతృత్వంలోని జనగణన శాఖ ఈ లెక్కలను సేకరించాల్సి ఉన్నది. బీజేపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన సందర్భమిది. ఒక వైపు పౌరసత్వ సవరణ చట్టం, మరోవైపు ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌ విషయంపై దేశం అట్టుడుకుతోంది. దీంతో ఓబీసీ జనగణన ప్రాథామ్య అంశం కాకుండా పోయింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ ఒకటి నుంచి జరగబోయే 2021 జనగణనలో ఓబీసీ కులాల వారి లెక్కలు సేకరించి ఇన్నేండ్లుగా నష్టపోతున్న ఈ సామాజిక వర్గాల వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం మూడు శాతం ఆగ్రకులాలు మాత్రమే ఉన్నతమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నదని దిలీప్‌ మండల్‌ లాంటి సోషియాలజిస్టులు అంటున్నారు. ఈ విషయంలో ఎవరెంతమంది ఉన్నారో సరైన, కచ్చితమైన డేటాను సేకరించి ‘సబ్‌కే సాత్‌, సబ్‌కా విశ్వాస్‌’ అనే నినాదాన్ని ఇప్పటికైనా నిజం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా హోం మంత్రిత్వశాఖ సహాయ మంత్రిగా తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డి ఉన్నడు కాబట్టి ఆయన ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి. అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని బుద్ధిజీవులు, ఉద్యమకార్యకర్తలు, ప్రజలందరూ త్వరలో జరగబోయే జనగణనలో ఓబీసీల వివరాలను పొందుపరచాలని డిమాండ్‌ చేయాలి. అందుకు సమిష్టిగా కొట్లాడాల్సిన అవసరం కూడా ఉన్నది.

ఇప్పుడు లెక్కలు తీయడం సాధ్యం కానట్లయితే మరో పదేండ్ల వరకు ఆగాల్సి ఉంటది. అప్పుడు పరిస్థితులెట్లా ఉంటాయో చెప్పలేము. కాబట్టి బ్రహ్మణీయ, మనువాద భావజాల అధికారుల చేతుల్లో మంత్రులు కీలుబొమ్మలు గాకుండా స్వతంత్రంగా న్యాయంగా వ్యవహరించాల్సిన సందర్భమిది. 

సంగిశెట్టి శ్రీనివాస్‌

Advertisement
Advertisement
Advertisement