ఎక్స్‌కవేటర్ల సాయంతో కారును బయటకు తీస్తున్న పోలీసులు, అధికారులు
ఇద్దరు కడపవాసుల మృతి
గుర్రంకొండ, నవంబరు 27: గుర్రంకొండ మండలం గొల్లపల్లె సమీపంలోని పందిర్లవంక వాగులో కారు కొట్టుకుపోయి కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు సాయినగర్‌కు చెందిన రవి(55), సుబ్బయ్య(55) గురువారం ఉదయం సొంత పనుల నిమిత్తం కారులో చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లకు వచ్చారు. పనులు ముగించుకుని తిరిగి రాత్రి 10 గంటల సమయంలో తిరుగుప్రయాణమయ్యారు. గుర్రంకొండ మండలం టి.పసలవాండ్లపల్లె పంచాయతీ గొల్లపల్లె సమీపంలోని పందిర్లవంక దాటుతుండగా వరద ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ఎవరూ గుర్తించలేదు. ఉదయం అటుగా వచ్చిన గ్రామస్తులు ప్రవాహంలో కొట్టుకుపోయిన కారును చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్ల సాయంతో వాగులో చిక్కుకుపోయిన కారును బయటకు తీయగా అందులో రవి, సుబ్బయ్య మృతదేహాలు కనిపించాయి. బాధిత కుటుంబీకులకు సమాచారం అందజేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాల్మీకిపురం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.