తిరిగి తృణమూల్‌లో చేరిపోనున్న ముకుల్ రాయ్?

ABN , First Publish Date - 2021-06-04T00:13:41+05:30 IST

బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోనున్నారా? నందిగ్రామ్ ఎమ్మెల్యే సుబేందు

తిరిగి తృణమూల్‌లో చేరిపోనున్న ముకుల్ రాయ్?

కోల్‌కతా : బీజేపీ నేత ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోనున్నారా? నందిగ్రామ్ ఎమ్మెల్యే సుబేందు అధికారికి బీజేపీ అధిక ప్రాధాన్యం కట్టబెట్టడం, శాసనసభా పక్షనేతగా బీజేపీ నియమించడంతో ముకుల్ రాయ్ అలిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరిగి సొంత గూటికి చేరిపోనున్నారని వార్తలొస్తున్నాయి. దీనిని బలపరుస్తూ ఓ సంఘటన కూడా జరిగింది. ముకుల్ రాయ్ భార్యకు కోవిడ్ సోకింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తృణమూల్ ఎంపీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ముకుల్ రాయ్ భార్యను పరామర్శించి వెళ్లారు. అంతేకాకుండా ముకుల్ రాయ్‌తో తృణమూల్ ఎంపీ అభిషేక్ చర్చలు జరిపినట్లు కూడా వార్తలొచ్చాయి. 


ముకుల్ రాయ్‌కు మోదీ ఫోన్

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ముకుల్‌రాయ్‌కు ఫోన్ చేశారు. ఆయన భార్య యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అయితే మోదీ రాజకీయాలు మాత్రం చర్చించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ముకుల్ రాయ్ ‘ఘర్‌వాపసీ’ వ్యవహారం మోదీ దృష్టికి వెళ్లిందని, అందుకే మోదీ ఆయనకు ఫోన్ చేశారని కొందరు అంటున్నారు. 


మమత కోర్‌టీం సభ్యుడు ముకుల్ రాయ్...

 గతంలో ముకుల్ రాయ్ తృణమూల్‌లో అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. తృణమూల్‌ను క్షేత్ర స్థాయిలో విస్తరింప జేయడంలో ముకుల్ రాయ్ పాత్ర చాలానే ఉంది. అంతే కాకుండా సీఎం మమతా బెనర్జీ కోర్ టీంలో ముకుల్ రాయ్ ఒకరు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈయన 2017 లో బీజేపీలో చేరిపోయారు. సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీపై ముకుల్ రాయ్ అలిగారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, అధ్యక్షుడు నడ్డా బుజ్జగించిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. బెంగాల్‌లో తాజాగా జరిగిన ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో బీజేపీ బాగా పుంజుకుంది. ఈ పుంజుకోవడంలో ముకుల్ రాయ్ పాత్ర కూడా ఉంది. 





Updated Date - 2021-06-04T00:13:41+05:30 IST