2019 నుంచి 14,000 మందికిపైగా బంగ్లాదేశీయులను వెనుకకు పంపిన భారత్

ABN , First Publish Date - 2022-04-29T22:26:25+05:30 IST

భారత దేశంలో ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లిపోయేందుకు

2019 నుంచి 14,000 మందికిపైగా బంగ్లాదేశీయులను వెనుకకు పంపిన భారత్

న్యూఢిల్లీ : భారత దేశంలో ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన దాదాపు 14 వేల మంది బంగ్లాదేశీయులను వెనుకకు పంపించినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నివేదిక పేర్కొంది. 2019 జనవరి 1 నుంచి 2022 ఏప్రిల్ 28 మధ్య కాలంలో భారత్ నుంచి పారిపోతుండగా 9,233 మంది బంగ్లాదేశీయులను,  భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 4,896 మంది బంగ్లాదేశీయులను అంతర్జాతీయ సరిహద్దుల వద్ద అదుపులోకి తీసుకుని, తిప్పి పంపినట్లు  తెలిపింది. 


మూడేళ్ళలో మొత్తం మీద భారత్‌లో ప్రవేశించేందుకు, అదేవిధంగా చట్టవిరుద్ధంగా భారత్‌లో కొంత కాలం ఉన్న తర్వాత తిరిగి బంగ్లాదేశ్ వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన 14,361 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుని, వెనుకకు పంపినట్లు ఈ నివేదిక వెల్లడించింది.  భారత్‌లోకి ప్రవేశించేందుకు లేదా తిరిగి వెళ్లిపోయేందుకు బంగ్లాదేశీయులు దక్షిణ బెంగాల్ సరిహద్దులను ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. 11,034 మందిని ఇక్కడి నుంచే అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. సుందర్బన్ నుంచి మాల్డా వరకు ఉన్న ఈ సరిహద్దుల్లో కంచె లేదని, నదీ జలాలు ఉన్నాయని, అందువల్ల చొరబాటుదారులకు అనుకూలంగా ఉందని ఓ బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు. 


భారత్-బంగ్లాదేశ్ మధ్య 4,096 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. దీనిలో 913.32 కిలోమీటర్ల మేరకు దక్షిణ బెంగాల్ ప్రాంతం ఉంది. దీనిలో దాదాపు సగం సరిహద్దుకు కంచె లేదు, నదీ జలాలు ఉన్నాయి. సరిహద్దుల సమీపంలోనే గ్రామాలు ఉండటంతో చొరబాటుదారులను గుర్తించడం కష్టమవుతోందని అధికారులు చెప్తున్నారు. 


కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, అక్రమంగా చొరబడేవారు భారత దేశంలో నేరపూరిత చర్యలకు పాల్పడలేదని నిర్థరణ అయితే, వారిని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్‌కు అప్పగించాలని బీఎస్ఎఫ్‌కు తెలిపామని చెప్పారు. వారిని జైలులో నిర్బంధించడం వల్ల ప్రయోజనం ఉండదని తెలిపారు. వారు జీవనోపాధి కోసం మన దేశంలోకి వస్తున్నారన్నారు. 


Updated Date - 2022-04-29T22:26:25+05:30 IST