Kamala Harris స్ఫూర్తితో భారతీయ అమెరికన్లపై పుస్తకం

ABN , First Publish Date - 2021-07-15T00:25:55+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె విజయ స్ఫూర్తితో యూఎస్‌లో ఇండో-అమెరికన్ల ఘనతపై భారత సంతతికి చెందిన విద్యావేత్తలు, దౌత్యాధికారులు, వ్యాపారవేత్తలు, పలుకుబడి కలిగిన ప్రముఖుల బృందం...

Kamala Harris స్ఫూర్తితో భారతీయ అమెరికన్లపై పుస్తకం

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్ల జాతీయురాలిగా, తొలి ఆసియన్ అమెరికన్‌గా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె విజయ స్ఫూర్తితో యూఎస్‌లో ఇండో-అమెరికన్ల ఘనతపై భారత సంతతికి చెందిన విద్యావేత్తలు, దౌత్యాధికారులు, వ్యాపారవేత్తలు, పలుకుబడి కలిగిన ప్రముఖుల బృందం ఓ పుస్తకం రచించింది. 'కమలా హ్యారిస్​ అండ్​ ది రైజ్​ ఆఫ్​ ఇండియన్​ అమెరికన్స్​' పేరుతో ప్రచురితం అయిన ఈ పుస్తకంలో అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్ల అభివృద్ధి గురించి వివరించారు. తమ శక్తిసామర్థ్యాలతో అంచెలంచెలుగా భారతీయ అమెరికన్లు ఎదిగిన తీరును ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది.


అలాగే దేశ ఉపాధ్యక్షురాలి స్థాయికి కమలా హ్యారిస్ ప్రయాణాన్ని వివరించారు రచయితలు. అంతేగాక ఆమె విజయానికి భారత సంతతి ప్రజలు చేసిన కృషి వంటివి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. పదహారు వ్యాసాల్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్ల విజయానికి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నట్లు సమాచారం. ఈ పుస్తకాన్ని ప్రముఖ భారతీయ సంపాదకుడు తరుణ్ బసు సంకలనం చేసి సవరించారు.


'కమలా హ్యారిస్​ అండ్​ ది రైజ్​ ఆఫ్​ ఇండియన్​ అమెరికన్స్​' పుస్తక రచయితల్లో ఒకరైన ఎంఆర్​ రామస్వామి మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడ్డ విదేశీయులు కూడా రాణించగలరు అనడానికి కమలా ప్రయాణమే ఓ చక్కటి ఉదాహరణ అని అన్నారు. ఒకప్పుడు భారతీయ అమెరికన్లకు కొన్ని రంగాల్లో మాత్రమే గుర్తింపు ఉండేదని, ఇప్పుడు వైద్యం, రాజకీయం, సాంకేతికం, వ్యాపారం ఇలా పలు రంగాల్లో రాణిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారన్నారు. ఇలా ఎన్నో రంగాల్లో భారత సంతతి వ్యక్తులు రాణించడం వల్ల అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో 40 లక్షల వరకు భారతీయ అమెరికన్లుండగా, అందులో 18 లక్షల మంది అర్హులైన ఓటర్లు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.      

Updated Date - 2021-07-15T00:25:55+05:30 IST