దేశం ఏమైపోతుందో.. ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదు : వెంకయ్య

ABN , First Publish Date - 2021-12-16T07:20:35+05:30 IST

దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోందని, ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు....

దేశం ఏమైపోతుందో.. ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదు : వెంకయ్య

  • చట్టసభలు తాలింఖానాలు కావు!
  • బుద్ధిబలం చూపండి.. భుజబలం కాదు
  • ప్రజాప్రతినిధులకు వెంకయ్య పిలుపు
  • ‘గాంధీ టోపి గవర్నర్‌’ పుస్తక ఆవిష్కరణ


న్యూఢిల్లీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): చట్టసభలు తాలింఖానా(కుస్తీ, కర్రసాము పోటీలు నిర్వహించే ప్రాంగణం)లు కావని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బుద్ధిబలం చూపించాలి కానీ భుజబలం కాదని ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోందని, ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ స్వతంత్రసమరయోధులు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జీవితకథతో రచించిన ‘గాంధీ టోపి గవర్నర్‌’ పుస్తకాన్ని బుధవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల కోసం సేవ చేసిన వారి చరిత్ర ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది గాంధీతోనే విభేదించారని, అదేమీ నేరం కాదన్నారు. ఈ రోజు వేరే అభిప్రాయం చెప్పినవారిని శత్రువు అన్నట్లు చూసే పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిది కాదన్నారు.


‘‘పరిపాలన తీరుతెన్నులపై చర్చించడానికి, విధాన నిర్ణయాలు తీసుకోడానికి, చట్టాలను రూపొందించుకోడానికి, ప్రభుత్వ బలహీనతలు, విజయాలపై చర్చించడానికి మనం చట్టసభలను పెట్టుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు ప్రస్తుతం సభలు జరుగుతున్న తీరుతో బాధ, ఆవేదన కలుగుతోంది’’ అని అన్నారు. తెలిసి మరీ చట్టసభలను అపహాస్యం చేసేలా ప్రవర్తించి, కనీసం చింతించకుండా బరితెగించి ప్రవర్తిస్తే ఏం స్ఫూర్తినిస్తున్నట్లని ప్రశ్నించారు. కాగా, ప్రముఖ స్వతంత్రయోఽధుడి జీవిత విశేషాలను ముందుతరాలకు అందిస్తున్నందుకుగాను పుస్తక రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను, ప్రచురించిన ఎమెస్కో సంస్థ అధినేత విజయ్‌కుమార్‌ను అభినందించారు.

Updated Date - 2021-12-16T07:20:35+05:30 IST