ఉపాధికి ఊతం

ABN , First Publish Date - 2022-01-25T05:47:35+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పెరటికోళ్ల పెంపకంతో పాటు (పాడిపశువుల) పోషణ, నాటుకోళ్ల పెంపకం ప్రధాన జీవనోపాధిగా ఉంటూ నిరంతరం ఆదాయాన్ని చేకూర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నది.

ఉపాధికి ఊతం

మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు

పాడి, పెరటి, నాటుకోళ్ల పెంపకానికి రుణసాయం

మార్చిలోగా లక్ష్యాన్ని  సాధించేందుకు అధికారుల కసరత్తు


సంగారెడ్డిటౌన్‌, జనవరి 24: గ్రామీణ ప్రాంతాల్లో పెరటికోళ్ల పెంపకంతో పాటు (పాడిపశువుల) పోషణ, నాటుకోళ్ల పెంపకం ప్రధాన జీవనోపాధిగా ఉంటూ నిరంతరం ఆదాయాన్ని చేకూర్చడంలో ముఖ్యభూమిక పోషిస్తున్నది. స్వయం సహాయక సంఘ సభ్యులు పెరటి, నాటుకోళ్ల  పెంపకంతో పాటు పాడిపోషణ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మంచి అవకాశం ఉన్న దృష్య్టా స్త్రీ నిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే మార్చిలోగా లక్ష్యాలను సాధించేందుకు సంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.


లక్ష్యాన్ని సాధించేందుకు కసరత్తు

సంగారెడ్డి జిల్లాలో 890 గ్రామైఖ్య సంఘాలు, 23,663 స్వయం సహాయక సంఘాలుండగా వీటి పరిధిలో 2.50 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.117.45 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్ధేశించగా ఇప్పటి వరకు 11వేల సంఘాలకు రూ.90 కోట్లు రుణాలు అందజేశారు. మిగిలిన రూ.27.45 కోట్ల రుణాలను మార్చి నెలాఖరులోగా ఇచ్చేందుకు ఐకేపీ, మెప్మా అధికారులు కసరత్తు చేస్తున్నారు.


పాడి పశువుల పోషణకు రుణాలు

జిల్లాలో పాడి పశువుల పోషణను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని సంకల్పించారు. ఈ మేరకు జిల్లాలో 3వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా 1193 మందిని గుర్తించిన అధికారులు 520 మందికి స్త్రీ నిధి కింద రుణాలను మంజూరు చేసి ఇప్పటి వరకు 400 మందికి పాడిగేదెలను అందజేశారు. మిగిలిన వారందరికీ మార్చి నెలాఖరులోగా అందజేసేందుకు సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో గేదెకు రూ.85,200 రుణం ఇస్తారు వీటిని తిరిగి 48 నెలల పాటు వాయిదాల పద్ధతిన 93 పైసల వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది.


పెరటి కోళ్ల పెంపకం

సంగారెడ్డి జిల్లాలో మేలు జాతి పెరటి కోళ్ల పెంపకానికి స్త్రీ నిధి ద్వారా ప్రత్యేక రుణాలు ఇచ్చి మహిళా సంఘాలకు ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 350 మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 150 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 200 మందికి మార్చి నెలాఖరు నాటికి రుణాలు ఇచ్చి వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టారు. ఒక్కో యూనిట్‌ (100 కోడిపిల్లలకు)కు రూ.22,500 ఇవ్వనున్నారు. నాటుకోళ్లకు (మదర్‌ ఫౌలీ్ట్ర ఫాం) పెంపకానికి కూ డా ప్రత్యేక రుణాలు ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.2.98 లక్షలు రుణం ఇవ్వనుండగా, జిల్లాలో 10 మందిని గుర్తించగా ఆరుగురికి మంజూరు చేశారు. ఇందులో ఒక షెడ్‌ను నిర్మించడంతో పాటు వెయ్యి నుంచి రెండు వేల కోడి పిల్లలను పెంచాల్సి ఉంటుంది. ఈరుణాలను 60 నెలల వాయిదాల ప్రకారం 93 పైసల వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.


================================================================================================================================================================================================

Updated Date - 2022-01-25T05:47:35+05:30 IST